కనురెప్పలలో ఒదిగిన ముత్యపు ఒంటిరాయి కలనీవే
కమనీయపు మెరుపున విరబూసిన బంగరుకమలము నీవే
ఆకుల మాటున ఆమని స్వరమై అలజడి రేపిన మధురిమనీవే
పూపొదరింట పున్నమి వెలుగై తారలదివ్వెలు పేర్చినదీ నీవే
ఊహల ఆశల ఊపిరికలమై నీలినింగి అలలపైన పంచ వన్నెల కావ్యంలా
ఆహ్వానపు చిరు గీతం ఏర్చికూర్చి మమతను పొదిగి పొదిగి పలికిస్తున్నా
పెదవుల సరిహద్దుల వెనకో ముందో వినిపించీ వినిపించని కోయిల గానంలా
వసంతగీతిక పల్లవిగా పదేపదే పలవరించు కలవరింతగా పాడుతున్నా
యుగాలుగా నీవాకిట ఎదురుచూపులో ఎండమావిలావేచిఉన్నాను
సెగలు పొగలుగా రగిలిన మనసుకు చల్లగాలి ఓదార్పులా ఏదీ నీ కడకొంగు వీవన
రగిలి రగిలి మది చెదిరి ముక్కలై మరిగి మరిగి ఆవిరి చుక్కనై ఆకసాన వేలాడినా
తొలి చినుకు చుక్కనై నీ పెదవి పాన్పుపై సేదదీరలేనా ఇది కల కానేకాదు సుమా....
No comments:
Post a Comment