1. నేను
వేల వేల ఆశల్ను అదృశ్యంగా భుజాన మూట కట్టుకుని
ఏదో సాధించాలని మరేదో మిస్సయిపోతున్నానని
హడావిడిగా ఈ లోకం వాకిట్లోకి ఊడిపడ్డా
కళ్ళు విప్పకముందే మనసుల కుళ్ళు వాసన
జన్మ జన్మాంతరాల మురికి కూపాల్ను ముందుకు లాక్కు వస్తోంది
రక్త మాంసాలు పంచిచ్చిన అమ్మ
మౌనం ఊబిలోకి తొంగిచూస్తే
ఈ బిడ్డ ఆడదే కావాలా నా ఖర్మ కాకపోతే మళ్ళీ కొడుకంటారు
మాటిమాటికీ చచ్చి బతికే పిల్లల యంత్రాన్ని కాక తప్పదా?
అప్పుడు తన్నుకు వచ్చింది కేరు మంటూ ఏడుపు
ఎంత దగా ఎంత దగా .... ఇదేనా ఈ లోకం నాకు పలికే స్వాగతం.
పక్కనే హడావిడి పడి పోతున్న వైద్యుడి
అంతరంగసొరంగాలను తడిమితే మూగ భావాలు
శిశిరపు ఉషోదయం లో నును లేత ఆకు కొసల్నిఒంచి జారే
మంచు స్పటికాల్లా
ఎన్ని రంగులను కలబోసుకున్నాయి?
లేత గులాబీలు నూరి ముద్దచేసి పోత పోసినట్టున్న ఈ పిల్ల
పదహారేళ్ళయాక ఎందరి గుండెల్లో రాజుకునే నిప్పురవ్వవుతుందో
అప్పటికి నా యౌవనం వయసు చెల్లిపోతుందే .........
అప్పుడనిపించింది నాచూపుకు లేజర్ శక్తి వుంటే
ఈ మూర్కత్వం బూడిద చెయ్యనా అని
ఒక వ్యామోహపు తెర తొలగి ఒక భావాతీత చైతన్యాన్నై
నా దిశ నిర్దేశించుకున్నాను
చూపుడు వేలేత్తి లోకాన్ని బెదిరిస్తూ .....
దగాజిలుగు తోలుకప్పుకున్న మనసుల్లో
నగ్నంగా జుట్టిరబోసుకుని నర్తించే
ఈ వికృత రూపాలకు విమోచన నవ్వాలి
నేను నేనవాలి
అంతే కాని ఈ బిడ్డనో ఆ బిడ్డనో కాదు...
పులి బిడ్డనవ్వాలి.
2. చెలీ
నా కనుపాపల పల్లకీ నెక్కించి
స్వప్నవీధులగుండా
గుండె నెత్తావులను వెదజల్లుతూ
నేను నలుగురినై
జీవితం పందిట్లోకి
మోసుకుపోతాను
నా గాఢ పరిష్వంగం వెచ్చదనాన
ఒదిగి పొదిగిన నిన్ను
ప్రేమాధి రోహణ అనుభూతుల్లో
జగమంతా ఊరేగిస్తాను
అలసి సొలసి
నిట్టూర్పుల సెగలో చలికాచుకుంటూ
కందిన నీ లే చెక్కిళ్ళగులాబీ రెక్కలమాటున
మధుపంగా ఒదిగిపోతాను
ఏళ్ళ క్రితం చూపుల రాయభారాల్లోని
నిశ్శబ్ద గమకాల్ను శృతి చేసి
రాగం కట్టిన పాట రక్త నాళాలను చేదించుకుంటూ
పెల్లుబికి వస్తోంది.
అత్తరు సువాసనల అట్టడుగునో
గాజు గోళీ కళ్ళకావలి తీరంలోనో
సముద్రంలా అడ్డంగా పరచుకున్న లోకానికి
ఈ వైపునో ఆ వైపునో
ఇంకా నీ నవ్వు సవ్వడి గాలానికి
నన్ను నేను తగిలించుకుంటూనే వున్నాను
నడి రాతిరి ఇల్లంతా పరచుకున్న ఏకాంతం
అడుగడుగునా నీ పాదాల ఒత్తిడి
రాత్రిని జ్ఞాపకాల మూసలో కరిగించి నీ కోసం
పుటం పెట్టిన అక్షరాలను
ఆభరణాలుగా మెరుగులు పెడుతున్నాను
ఏ అలసిన ఉదయపు క్షణాల్లోనో
ఓ చల్లని ఓదార్పు లా నీ స్పర్శ
లాలిస్తుందన్న ఆశతో
కను రెప్పలు మేను వాలుస్తున్నాయి
గాలి అల్లరిగా సంధించిన
ఉలి ములుకుల్లా నిశ్శబ్దంగా దూసుకు వచ్చి
నీ రూపం పచ్చబొట్టు
నా ఉనికిపై చెక్కుతున్నాయి
చెలీ
ఇహ నేనెక్కడ?
ఇటూ అటూ ఎటు చూసినా
నీజ్ఞాపకాలే
3. వసంతం విలువ
కాలానికీవిలువకూ మధ్యన
సామరస్యం పచ్చగడ్డి భగ్గుమంటుంది.
ఒకప్పటి అతిశయోక్తులు
ఇప్పుడు ఆధునికత జారుడు బండ దిగువన
శుష్క వచనాల దిగులు మొహాల్తో
శూన్యాన్ని దిగంతాలకు వేళ్ళాడదీస్తూంటాయి
సమయం సాన మీద అనవరతం
అరిగిన గంధపు చెక్కగా అద్భుత సౌందర్యం
అలసి సొలసి లేత నీరెండ చెక్కిళ్ళలో
ఓ క్షణం కునుకుదీస్తూంటుంది.
అనుభవం ఉలితాకిడిలో పెనవేసుకున్న
ఆలోచనలు అదృశ్యంగా
అద్భుత శిల్పాలై
అంతరంగం అడూగడుగునా నర్తిస్తూ
ఒకప్పుడు చెలియలి కట్టదాటి
పొంగి పొర్లిన మధురోహల స్మృతి సువాసనలు
సజీవంగా
పడమట చేరుతున్న వసంతానికి రూపమిస్తూ .....
అనుకోవాలే గాని ప్రతి ఉషోదయం ఉగాదే కదా...
ప్రతి శిశిరం ఓ వసంతపు ఛాయే కదా!
4. నో కాంప్రొమైజ్ ప్లీజ్
నో కాంప్రొమైజ్ ప్లీజ్
నేను రాజీ ఉరితీతకు సిద్దంగా లేను.
కళ్లుమూసితెరిచేంత లిప్తలో
ఉనికికీ ఊహకూ_ సజీవతకూ సమూల మరణానికీ
ఉలిపిరి కాగితపు పరదా ఊగిసలాడుతున్న
తైంతిక సుకుమార జీవనవనంలో
విలువల గొంతునొక్కి
కలల గుమ్మటానికి వేలాడేందుకు
నేను సిద్దంగాలేను
నో కాంప్రొమైజ్ ప్లీజ్
సువిశాలపు ఆకాశం పాల చెక్కిళ్ళపై
పరుగులు పెడుతూ రూపాలు మార్చుకునే
తెలి మబ్బు తునకల క్షణికపు పాలపొంగు
ఈ విరామం
ఊపిరాడని పొగల్లో సెగల్లో
తుహిన బిందువుల్లా ఆవిరి చేసేందుకు
నేను సిద్దంగాలేను
నో కాంప్రొమైజ్ ప్లీజ్
ముళ్ళమధ్య కళ్ళువిప్పి
నాజూకు పాదాల నవనీతపు
భావాలను
కన్నీళ్ళ అలజళ్ళ కుంపట్లమీద
కరిగించుకుందుకు ఎంతమాత్రం
నేను సిద్దంగాలేను
నో కాంప్రొమైజ్ ప్లీజ్
గుండెనిండా జ్ఞాపకాల పూలమడులు
పెదవులమీద మొలకెత్తే చిరునవ్వులు
నా తరువాత శూన్యం మందిరాలు
నా ఉనికి అగరొత్తుల పరిమళమై
ప్రసరించేలా ప్రసవించేలా
నాలుగు యుగాల ఇతిహాసానికి
ప్రేమ నింపుకున్ననాకలం
చరిత్ర పుటలమీద అవిశ్రాంతంగా
కాలాన్ని చెక్కుతుంది
అందుకే
నాకు మరెందుకూ సమయం లేదు
ఊసుపోక కబుర్లాటకు
నేను సిద్దంగాలేను
నో కాంప్రొమైజ్ ప్లీజ్
5, పులకింతలపున్నాగలుఏవాకిట కురిసినా
తొలకరించు తొలి పలుకులు ఏనోటన పలికినా
పరిమళాల ప్రవాహాలు పరుగులిడే గుభాళింపు
కనుసన్నల జాజిపూలు పల్లవించుకావ్యాలే
ఆవంకన జాలువారు జలపాతపు తలపులెన్నొ
ఈ వంకన నింగితాకు సింగిణీల విల్లంబులు
కనుపాపల కదలికలో హొయలొలికే సోయగాలు
కనగలిగే మనసుకైతే అరచేతిన స్వప్నమౌను
నిర్నిద్రలొ ఊహకొలను తొలిచూపుల స్పర్శకేను
జలజలమను పల్లవాలపారిజాత గమకాలై
చిరు సవ్వడి అలికిడిలో ఆదమరచి ఒక్కక్షణం
తెల్లవారె కలలన్నీ తెల్లబోయె మోవిసిరులు
6. అడుగుజాడలు
యుగాల నుండీ ఈ జీవన తీరాన
జ్ఞాపకాల సైకతవనంలో సతమతమవుతూ సమయం
చెక్కుతూ పోయిన నీ అడుగుజాడల్లో
నన్ను నేను ఇముడ్చుకుందుకు
ఏదీ ఒక్కసారి అదృశ్యంగా నైనా చెయ్యందించరాదూ
ఓ చిన్ని స్పర్శ
మాటిమాటికీ తిరగబెట్టే నిరాశా నిస్పృహల శిశిరాన్ని
నిమిషంలో వసంతపుటలలా వెంటలాక్కుపోతుంది
అప్పుడే కళ్ళువిప్పిన ఆనందపుహేల
చుక్కలమధ్య మయూరిలా మనసును నర్తింపజేస్తుంది
ఏదీ అదృశ్యంగా నైనా ఓ సారి చెక్కిలి నిమరరాదూ
నాకోసమే
ఓ మధురమైన గమకపు తునక
నీ స్వర సామ్రాజ్యాలనించి
తొందరపడి తొంగిచూసే
తొలిమేఘపు గాలి వీవనగా
చెక్కిన చెక్కిలి వంపులో
విశ్రాంతి తీసుకుంటున్నకన్నీటి బొట్టు
ఘనీభవించి ముత్యపు ముద్దుగా మార్చేందుకు
ఓ గమకాన్ని కూనిరాగంగా మార్చరాదూ..
ఓ మారు నిశ్శబ్ద సాగరాల మౌనంలో
చిరు అలల పులకరింతల్లో
వెలుగు సోకని రాత్రి ఒడిలో
దరిలేని గతం కౌగిట్లో నా ఏకాంతానికి
వినిపించకున్నా తొలిసారి పలకరింపు కారాదూ
వేదనలో రగిలి రగిలి
హృదయం సంపూర్ణంగా కరిగి కరిగి కురిసిన
కన్నీళ్ళుతాగి విశ్వమంతా పరచుకునే
సస్యశ్యామల హరితవనాల కవనాలకు
తొలి చిగురాకు తుళ్ళింతగా
ఓ సారిటు రారాదూ
రెప్పలు దాటని కలలకు చితిపేర్చుకున్నా
పుట్టకముందే ఆశలకు సమాధి కట్టుకున్నా
ఓ సారి నీ చిటికెన వేలందించి
చివరి ఆశీస్సులను తొలకరించరాదూ
7. ఉషోదయం
కళ్ళు తెరిచీ తెరవక ముందే
మనసును మెలిపెడుతూ ఒక వాస్తవం
మెడఒంపులో తలదాచుకున్న
ఇంకా నులి వెచ్చని గిలిగింతగా
మమకారపు ఊపిరి ఆనవాలు
పెదవుల పై పెదవులాన్చి మేల్కొలిపే
నును వెచ్చని చిలిపితనం
చెక్కిళ్లపై సుతారంగా జ్ఞాపకాలు సవరించే
వేలికొసల సౌకుమార్యపు సవరింపు
నా తోపాటే
సుప్తాసుప్త అవస్తల్లో స్పందించే హృదయం
అంత గతమంటూ ... జారీ జారని ఓ కన్నీటి చుక్క
8. మనం
నా నిశ్శబ్దం కత్తి అంచున
జాగ్రత్తగా అడుగులు కదుపుతూ
మౌన సరిగమల్లో గమకంలా నువ్వు
కనురెప్పలు వాల్చిన మరుక్షణం
ఎదురు చూసి ఎదురు చూసి విసిగి వేసారిన
నీ ఆగమనం కలల వాకిట్లో అసహనంగా ...
నేను కన్నీళ్ళు గుండెలో దాచుకు
కలల రంగుల హరివిల్లు తో సంభాషిస్తాను
పరుగులు పెట్టే మేఘాల విరుజల్లులా
అస్పస్టపు ఆశల్లా వినిపించని నీ మాటలు
ఉనికికీ అదృశ్యానికీ మధ్య ఉలిపిరి తెరలా
జీవితానికీ అస్తమయానికీ మధ్య నేను
9. లోకానికి అటూ ఇటూ
శబ్ద వలయాలకావల
దృశ్య కావ్యాలకందనంత సుదూరంలో
నీడలజాడల్లో విశ్రమించి
ఒక సుషుప్తి , ఒక విరామం
ఒక సావలోకన ...
రేపటి స్వప్నలోకాల విహారంలో
మధురిమలు కలబోసిన
సప్తవర్ణాల కళలు చెక్కిన సజీవ చిత్రాలు
తడబడే బుడి బుడి నడకల
వయ్యారాల హంసల సోయగాలు
ఒక్కోరక్తం చుక్క ఇనపముక్కై ఇటుక ముక్కై
కట్టిన అపురూప సౌధం
ఒకలోకానికి ఆవైపున
నిరంతర కుంభవృష్టి కన్నీళ్ళలో
నాని నాని
చీకి చిరిగిపోయిన కళాఖండం
నేటి వాస్తవం
కాళ్ళు విరిగి నడక మరిచి
నేలవాలిన మయూరాలు
ఈ నాటి నిస్సహాయతలు
కలలు బూడిదై రక్తం పాలిపోయి
అసహయత పేకమేడై
కుప్పకూలిన గతంపై పుట్టగొడుగులా
వాస్తవానికి ఈ వైపుకు విసిరేయబడ్డ
శిధిల శిబిరం
అద్దం నిజమే చూపిస్తుందంటారు
కాని కాలం మాత్రం రెండు నాలుకల కోడెనాగు
ఎక్కడ చూసినా నిలువెల్లా విషమే..
10. అంగడి
ఆశ్చర్యం
అంగట్లో అన్నీ వున్నా
ఒక్కటీ కడుపునింపదు
మనసునూ నింపదు.
అహంకారాన్ని తృప్తి పరుస్తాయి
లేని ఆధిక్యాన్ని ఆపాదిస్తాయి
అడుగడుగునా
కుప్పలు తెప్పలుగా పోగేసుకుని అమ్ముతున్న
ఈ సరుకు కు మీరు తేవలసింది క్రెడిట్ కార్డ్ లో
డబ్బులు పర్స్ లోనో కాదు
గోనె సంచుల్లో మూటలు మూటలుగా రూపాయల కట్టలే కాదు
రికమండేషన్ పత్రాలూ , పరిచయ ప్రహసనాలూ
వీలైతే అందుబాటులోవుండే విలాసాలూ
ఇచ్చిపుచ్చుకోగలిగే హోదాలూ కులాసాలూ కుషామతీలూ
అయితే
అందులోనూ కోరిన వారికి కొరినవేంటో
తెలుసుకు సమర్పించుకునేనేర్పుండాలి.
ఒక్కసారి కాటలాగ్ వాటి విలువనూ తిరగెయ్యండి
డిగ్రీలూ ఉద్యోగాలు వాటి సంగతి తెలీనే తెలుసు
పత్రికలు ప్రచురణలూ --ఇజాల్యూ భుజాలు
రాజకీయాలూ రంగుటద్దాలూ --క్రౌర్యం నయవంచన
అవార్డ్లూ రివ్వార్డ్లూ --ఇక్కడే కద హోదాల భుజాలు రాసుకోడం
కులాల సారూప్యత చూపుకోడం
ఇచ్చిపుచ్చుకునే సమర్పణలూ
అంగట్లో అన్నీ ఉన్నాయి ఇహ మీసత్తా చూపుకోండి.
11. అప్పుడప్పుడు ..............
చిరునవ్వుల పెదవులను తగిలించుకు
చీకటి కన్నీళ్ళను గుండె గదిలో భద్రంగా దాచి
ఉషోదయంతో పాటు ఉదయిస్తూంటాను.
అయినా భావోద్వేగాల వల్లరిలో కొట్టుకు పోతూ
అనిశ్చయత చెలియలికట్ట సంయమనాన్ని కోసేసినపుడు
పట్టుకోల్పోయిన మనసు వరద వెల్లువవుతుంది
కట్టలు తెగిన జీవనదిగా పొంగి పొర్లుతుంది.
భయాందోళనల తుఫానులో, ఏకాంతపు సుడిగాలిలో
విలవిల్లాడుతూనిస్సహాయంగా చేతులుచాపి
ఆపన్న హస్తం కోసం అలమటించిన అమాయకత్వం
చెక్కిళ్ళు తడిసిన కన్నీళ్ళతో తడబాటు చూపుల్తో
ఇంకా ఏమూలో అజ్ఞాతంగా ఒదిగి మిగిలిపోయింది
ఎంత వెన్నుతట్టి నేనే ధైర్యాన్నని నాకు నేననుకున్నా
లోలోపల ఏమూలో వెయ్యిమొహాలు పరిహసిస్తూ
నిశాచరులై వెంటాడి వేటాడూతూ ...
నిరాశా నిస్పృహల జడివానలో తడిసి కరిగిపోయిన వదనం
పాటలు రాలిపోయిన పూల ఋతువులా ,
రెక్కలు విరిగి విలవిల్లాడే దీపం పురుగుల్లా
పొర్లి పొర్లి రూపం పోగొట్టుకున్న విషాదమవుతుంది
చీకట్లు శపించిన కాళరాత్రిగా మారుతుంది
కన్నీళ్ళు నాచుట్టూ గింగరాలు కొట్టే గద్దలవుతాయి
అయినా ఇదంతా కాస్సేపే ... తుఫాను తీసేసాక
నాలో నేను మళ్ళీ శ్వాసించడం మొదలెట్టగానే
విషాద భాగం కుక్కిన పేనులా లోలోపల ఒదిగి పోయాక
వరద తీసిన గోదారిలా అలసిన మనసు సుషుప్తిలో సేదదీరాక
మొహాలన్నీ లోలోపలికి తోసేసి
నన్ను నేను మళ్ళి విజయవంతంగా చిరునవ్వుల్లో చుట్టుకుంటాను
12. నువ్వూ-నేను
ఎప్పుడో యుగాల కిందట
ఈ నేలా ఈ నింగీ ఏకాంతపు సమాగమంలో
ఊసులు పంచుకున్న జ్ఞాపకం
అలలు అలలుగ తేలివచ్చే ఆనందపు నురగల్లో
మన ప్రతిబింబాలను మలుచుకున్న మాధుర్యం
ఉక్కిరి బిక్కిరి చెసే కలల కౌగిళ్ళలో
గాలి పొదరిళ్ళ మధ్య ఇంకా ఆవిర్భవించని రేపటి ఆవిర్ల రూపాలై
సంచరించి , ఒకరికొకరై , మేఘాల్లో మెరుపులై
యుగలు క్షణాలుగా
పాలరాతి నునుపుపై దొర్లిపోయిన జలపాతలు
ఇప్పుడు
స్థబ్దించిన రాత్రి , విషాదం చీకట్లలో తలదాచుకు
వెక్కిళ్ళు పెట్టే శూన్యత
మరణాన్ని మెలిపెట్టే బాధ
అయినా నిశ్శబ్దపుతెరల కదలికల్లో నీడలా నీ రూపం
వద్దన్నా ప్రతిరెండో క్షణం
గతంలోకి దూకే వర్తమానపు శైశవం
నిన్నలో విశ్రమించిన గానమధుర్యాల
ప్రతిధ్వనులు ఊపిరి పీల్చుకుంటూ
ఏకాంత జీవనయానం
ఎన్నాళ్ళు ఎన్నేళ్ళు
ఈ ఉలిపి కాగితపు పరదా మనకడ్దంగా
ఆ వైపున ఎదురుచూస్తూ ఎప్పటిలా నీ అశ్రునయనాలు
ఈ వైపున ఒడ్డున పడి గిలగిల్లాడుతూ అసహాయతలో నేను
అయినా పెదవులుకదలని మౌన భాష్యాలు
మోసుకు వచ్చే సందేశం యుగాలకిందటిదేగా
నా నింగీ నా నేలా ,నా చుక్కలూ
నా ఉనికీ నా ఊపిరీ
చివరకు నా సమస్థం
అంతెందుకు నేను గతం నువ్వే వర్తమానం
13. ఇహ నా వల్ల కాదు
ఇలా నిశ్శాబ్దంగా వీడ్కోలు పలకడం
ఇది వెయ్యిన్నొక్కసారి
ఏకాంతపు వరండాలో
ఊబుసుపోక ఉక్కిరిబిక్కిరౌతూ
వర్షపు నీటి తుంపరలో
కన్నీటి చెమరింపులో
తడిసిముద్దైపోయిన తలపు
బిక్కు బిక్కుమంటూ ఒదిగి
అంతరంగంలోని ఉరుములూ మెరుపులూ
ఆయుధాలై కనిపించని గాయాలు చేస్తూ
ఈదురుగాలి కొడవళ్ళుగా మారి
కోస్తున్నది నా చర్మాన్నా
ఆలోచనల వలయాన్నా
సైకత స్వప్న సీమలు కూలిపోయిన క్షణాలు యుగాలుగా
నీ తలపుల చలిలో మొద్దుబారిన మనసు
జీవన్మరణాలమధ్య ఊగిసలాడుతూ
ఇహ నా వల్ల కాదు
ఇలా నిశ్శాబ్దంగా వీడ్కోలు పలకడం
ఇది వెయ్యిన్నొక్కసారి
14. ఉగాది వచ్చేస్తోంది
ఎప్పట్లాగే ఉగాది సందడీ
ఉరుకుల పరుగులతో
ఏడాది ఎదురుచూపులను
మోసుకు వస్తూ ఉగాది వచ్చేస్తోంది
ప్లాస్టిక్ సంస్కృతిని మేసి
సిమెంట్ భవనాల జైళ్లలో బంధీలైపోయాక
ప్రకృతి వికృతై ఒళ్ళువిరుచుకుని
ఆధునికతకు దాసోహమన్నాక
బోన్సాయి మొక్కలుగా జీవితాలు
నాలుగ్గోడలకు పరిమితమయ్యాక
ఏసీ రూములు అనుమతించవు
కోయిల కుహూరవాలు వినిపించేందుకు
మామిడి చిగుళ్ళ పరిరక్షణకు చల్లిన
పురుగులమందు ఘాటుకు
జాతి అంతరించిపోయింది
సమయం అనుమతించదు
గతం స్వర రాగాలను రికార్డ్ చేసుకున్న
ఆధునిక పరికరాలే గతి
వసంతం ఏమూలో తలదాచుకున్న ఈ క్షణాన
కాగితం పువ్వులదే రాజ్యమయ్యింది.
కాలగమనాల గతులు తప్పి
రెండు రోజుల మధ్య సంధి కాలంలో
సంకట దశలో ఉగాది
నేడా రేపా అనేది ప్రభుత్వానికే తెలియాలి
ఉగాది వచ్చెస్తోంది.
15. వినతి
ఎక్కడ చూసినా పచ్చ పచ్చని స్వప్న సీమలు
ప్రేమామృత భావనలపై పరచిన తివాచీలు
పగటి కలల్లో పరవశిస్తూ మెత్తని రోజుల పొత్తిళ్ళలో
కళ్ళువిప్పని చిన్నారి పొన్నారి పసిపాప నైర్మల్యం
ఆకుచివరల ఊయల్లూగుతూ తుళ్ళిపడే నీటిచుక్క
ఇంద్ర ధనుసు రంగుల్లో మొహం చూసుకుంటున్న వెలుగు
అంచులు దాటి పొంగిపొర్లే కేరింతల అలల సడిలో
ఉట్టి కాళ్లతో పరుగులు పెట్టే ఊహ నీటి చెలమలు
ఇలా ఈ స్వప్న సీమల వీధుల్లో ఒళ్ళుమరచి ఊరేగుతాను
చుక్కలు పరచిన బాటమీద తేలిపోతూ నడుస్తాను
శిధిల శకలాల పొర్లింతల్లో మాటలకందని పలవరింతగా
ముక్కలు ముక్కలుగా చిన్నాభిన్నమై నేల రాలిన వలపు తలపుగా
ఎక్కడో పారేసుకున్న అమూల్యానందాలను ఇక్కడ ఇలా
చీకట్లను వడబోసి వెలుగుల్ను ఏరుకునే ఈ కలల్లోనే ఉండనివ్వండి
ఈ పచ్చ పచ్చని ప్రాంగణం లోనే ఇలా కలల్లో పరవశించి పోనివ్వండి
మెళుకువనడి సముద్రంలో నిర్దాక్షిణ్యంగా విసిరెయ్యవద్దు
వాస్తవం ముళ్ళకంచెలో ముక్కలైన జీవితాన్ని ఏరుకునే ఓపికలేదిక.
16. ఒక్క క్షణం
మూసేసుకున్న గోడలగుండా గుండె గదిలో
జలపాతపు వాయు వేగంతో నీలాకాశపు నింగినుండి
ఉరుకులు పరుగులతో ప్రవహిస్తూ
పిడికిట్లో కళ్ళుతేలేస్తున్న జీవితం వెన్ను నిమిరి
అరమోడ్పు కనుకొసల ఓదార్పు ప్రేమ పరిధి సారవంతం చేస్తూ
లోలోపలి సువర్ణకాంతులకు మెరుగులుపెదుతూ
నిర్విరామంగా ,అజరామరంగా చుక్కల వెలుగుల్ను
గుప్పిట దాచుకోవాలన్న తహతహలో ...ప్రేమ
స్వప్న జగత్తు వాకిళ్ళలో తడబడేచిట్టి పొట్టి నడకల తప్పటడుగుల్లో
సుమధుర సంగీత సామ్రాజ్యంగా సరిగమలు పలవరించే
మనసు కొర్కెల రంగవల్లికలు అలంకృతమైన స్వర్గసీమల్లో
విజయోత్సాహపు ఆశలరెక్కలను చుక్కానులుగా
విశ్వాంతరాళాల పయోనిధుల్లో రెపెరెపలుగా...
కలల్ను తప్పతాగి మత్తెక్కిన జీవితం
ఉదయాస్తమయాల ఉభయ సంధ్యల మధ్య పరుగులుపెట్టే
నీడల జాడల్లో మొహం దాచుకుంటూ
మసకవెన్నెల వెలుగులో రాత్రి కొంగట్టుకు
బెరుకు బెరుగ్గా స్పందన పసిపాప ... ప్రేమ
విశ్రమించినా ప్రవాహం ఆగని రక్త నదీ నదాల్లో
నురగలు కక్కుతూ ఒడ్డుచేరాలన్న తపనలో
లయబద్ధంగా సంతృప్తి చెక్కుటద్దాల్లో వేకువ తోకచుక్కల్లా
వలపు ఓ గుక్కైనా తాగకముందే మత్తెక్కి
మైమరచి ...పలవరింతల్లో ............
17. మళ్ళీ మళ్ళీ
మళ్ళీ మళ్ళీ ఆ స్వప్న సీమలోకి వెళ్ళిపోదామనే ఉంది
హృదయ రాగాలు పల్లవించే ఆ అనుభూతుల కుహరంలోకి
సాయంసంధ్యారుణిమ సుతిమెత్తని లాలింపుకై
ఉన్మత్త జగతిని వదిలి సుషుప్తిలోకి జారిపోదామనే వుంది
మళ్ళీ మళ్ళీ మధురమైన కలలే వస్తాయన్న ధీమా ఉంటే
పీడకలల నీడలు వెయ్యి చేతుల్తో గుండె నులిమెయ్యవన్న
నమ్మకం పల్లవించే పారిజాతంలా సువాసనలు వెదజల్లుతుంటే
మళ్ళీ మళ్ళీ ఆ స్వప్న సీమలోకి వెళ్ళిపోదామనే ఉంది
18. మనిషి మాత్రం .....
ఆకాశం మెట్లు దిగి వచ్చి ఓ వెన్నెల తునక
సుతారంగా మనసుతీగల్ను మీటి ,కలల చెక్కిళ్ళు నిమిరి
కంటి రెప్పలపై పెదవులాన్చి మధువులను పంచింది.
నింగీ నేలా దూరాన్ని రవ్వల ముక్కలు చుక్కలు చుక్కలుగా
రాలుతున్న నీటి బొట్లతో దారపు తీగల్తో కొలుస్తూ
మెరుపు సుగంధాల మైమరపు చమరింపుతో వెన్ను నిమురుతూ వాన
అలవోక తూగుటుయ్యాల సాగినట్టూ , రాయంచ కదిలీ కదలనట్టూ
వెలుగు ఒళ్ళో పుప్పొడి ధూళి గారాలు పోయినట్టు
పసిపాప చిరునవ్వు పిలకరింతల్లా గిరికీలు కొడుతూ గాలి
నులి వెచ్చని మమకారపు స్పర్శ ఒళ్ళంతా తడిమినట్టూ
ఉదయం ఒంటి రెక్క మీద వేయి వెలుగుల రేపును మోసుకు వస్తున్నట్టూ
గుండె గదిలో నును వెచ్చని వేడి దీపాల్ను వెలిగిస్తూ ఉదయకిరణాలు
గాలీ , నీరూ, మట్టీ ,ఆకాశం వెలుగూ వేడీ కలబోసుకున్న మనిషి మాత్రం
ఒక అంతం లేని గాలి తుఫాను, వెన్ను చూపని వరద వెల్లువ
19. మరో సారి
మరోసారి మరోసారి
ఉహు అవకాశమేలేదు
ప్రతిక్షణం ఓ తుహున కణంలా ఇప్పటికే పరిమితం
మరోక్షణం లోకి జారి అది గతంగా మారి
కాలం వెనక్కు తిరగదు
దాని కాళ్ళకున్న చక్రాలు పరుగెత్తేది ముందుకే మరి.
మరో సారికి అవకాశమే లేదు
రాలిన ప్రతి చినుకూ
ముచ్చటగా ముత్యమవదు
రాసిన ప్రతి అక్షరం మాత్రం
చరిత్ర గోడమీద చెక్కిన శిల్పమవుతుంది.
మరో సారికది మహా కావ్యమవుతుంది. 20. వర్ష ఋతువు
చూరమ్మట సుతి మెత్తగా
కలలు వర్షించిన జడివాన ధారల
సరిగమల తప్పటడుగులో
పాలరాళ్ళ స్వప్నసీమ పరిధుల్లో
పరిభ్రమించిన ఎండమావుల అడుగుల
శబ్దసాగరాల హృదయఘోష లో
మూసిన కనురెప్పల వెనుక
నిండు మేఘాల పురిటి నొప్పుల వ్యధలో
ఎక్కడ చూసినా వర్ష ఋతువే
21. అక్షర సంపద
మాటలు రెక్కలు తొడుక్కు లోకసంచారానికి
బయల్దేరిన వేళ
మనసూ గుండే శూన్యమై
ఏకాంతపుటరలో పెదవులు మూగవోయి
వినికిడి నిరాకరణలో
చూపుల పావురాళ్ళు నీలమ ఒలుకుతున్న
ప్రపంచాంబరపు టంచులను సవరదీస్తున్న వేళ
గాలి గమకాల్లో సరిగమల పలకరింపులు
అక్షరాల ఊపిరి నిశ్వాసలు
క్షణం ఇక్కడ మరోక్షణం మరెక్కడో
రెక్కల రెపరెపల గాంధర్వ గానంతో
భూనభోంతరాళాలన్నింటిని ప్రతిధ్వనిస్తూ
వసుధనో పాపాయిగా ఉర్రూతలూగిస్తూ
స్వేచ్చగా అక్షరాల అప్సరసలు
అన్నీ ఒకటొకటిగా
ఎకరాల కొద్దీ మనసులను సాగుచేస్తూ
పిడికిట ఒదిగిన నెమలిఈకలా
కనుమరుగయ్యే సౌంద్ర్య సీమల్ను
వెలుగు రెక్కలపై మోసుకు వస్తూ
ఓ తుళ్ళింతగా ... ఓ పులకింతగా
అనుభూతి పదాలు
22. ఇప్పుడు
కన్నీళ్ళు ఉలిగా మలుచుకు
చెక్కుతున్న అక్షరాల ఏకాంతపు శిల్పమిది
గడిచిపోయిన శిశిరాలూ రాబోయే వసంతాలూ
ఎండా వానల తాకిడిలూ ఎన్ని వ్యధలో ఎన్ని సుధలో
ఒక్కోసారి మాధుర్యపు సరిగమలూ
మరోసారి మమతల బహుమతులూ
అన్నింటినీ అక్షరాల తోరణాలల్లి
ప్రేమగీతాలాపనల్లా పునర్ వ్యవస్థీకరిస్తూ ...
వెలుగును దోచుకున్న చీకటి కళ్ళ నల్ల రాళ్ళకు
రవ్వలు రవ్వలుగా ఇసుకపుప్పొడిలా రాలే
మాధుర్యపు జ్ఞాపకా్ల రతనాలను పొదిగి
కాలపు వేదికపై ప్రదర్శిస్తున్నాను.
నన్ను నేను భవిష్యత్తుకు పరిచయం చేసుకుంటున్నాను
తేలుకొండిలా పాము కోరల్లా తేనెటీగల్లా కాటేసే
కబళించి శూన్యం బహూకరించే స్వగతమూ
పెదవులపై మాసిపోయిన చిరునవ్వు జ్ఞాపికలా మిగిలిపోయిన
ఒకప్పటి వసంతాగమనపు సరదా సందడీ
విశ్వాంతరాళాల్లో మూగిన మబ్బు ముక్కల ముచ్చటింపులూ
శీతల ప్రపంచాల ప్రకంపనలూ గతాన్ని త్యజించి
వర్తమానం క్షణం క్షణం రేపటికి రూపమిచ్చే సుధీర్ఘ వ్యవసాయంలో
తలమునకలవుతూ ....
23. ఇంకా ఇప్పుడే కాదు
ఇంకా ఇప్పుడే కాదు
నా వెనకాల వదిలేందుకు
ఇంకా ఏమీ కూడబెట్టుకోలేదు
వీలునామా రాసి ప్రపంచానికి
ఏదో ఒకటి అందజెయ్యలనేవుంది.
కిలకిలా రావాల్లోని ఓనమాలు దిద్దుకోనేలేదు
కాంతి కిరణాల అంతరంగాల అధ్యయనం ఇంకా ఆరంభించలేదు
కనువిందు చేసే రంగుటద్దాల విందుల నారగించలేదు
సౌరభాలు వెన్నంటి మధుపాన్నై మకరందాలు గ్రోలనేలేదు
నాచుట్టూ కురిసే నక్షత్రాల వానలో తుళ్ళిపడే వెలుగురవ్వల్నింకా
మనసారా నా ఊహా గానపు రాగలహరిలో పొదగనేలేదు
చేజారిపోయి ముక్కలైన శకలాల్ను ఏర్చికూర్చి
గొప్ప కళాఖండన్నోదాన్ని పొందుపరచలేదు
నా జ్ఞాపకాల పొదలో తలదాచుకున్న
భావకవుల ఆత్మల నింకా ఆవిష్కరించలేదు
గానకళా కోవిదుల పెదవులపై దొర్లే రాగమాలికకు
అమృతాలు కురిసే పాట ఒకటి బహుకరించలేదు
అనంతంగా కొనసాగే సశేషాల పట్టిక
జీవితం వలుగు వెన్నెల లో ఇలా సాగిపోతూనే ఉంటుంది
ఉండీ లేనట్టు ఉలిపిరి కాగితం రెపరెప లాడే
విశ్వం రెక్కలమీద వినువీధి ముంగిట్లో
అమరత్వపతాకం ఎగరేసే వినూత్న సృష్టి ఇంకా మిగిలేవుంది.
అది అనవరతం అమరంగానే నిలవాలని నా వంతు కృషి ఇంకా మిగిలేవుంది.
24. సమాంతరం
నిన్నో మొన్నో లాగుంది
చూపుల పరిచయాలు చిగురించిన క్షణాలు
కళ్ళలో కలల సౌధాలను కాదు
యుగాల పరిచయాలను వెదుక్కున్నఘడియలు
ఒకరిలో మరొకరు దూరమైన సగభాగం వెతుక్కున్న సమయం
ఆ పచ్చిక జలపాతాల ప్రాంగణంలో
నిశ్శబ్దంగా ఒకరినుండి మరొకరిలోకి ఇంకుతున్న
పెదవిదాటని , మాట మూగవోయిన భావాలు
చూపులతో కలబోసుకుంటున్న చీకటి రాత్రుల ప్రవాహాలు
గతుకుల బాటపై సాగిన గతం తలపోతలు
కలబోసుకున్న కష్ట సుఖాల వడబోతలో
ఒకరినొకరు చిరు స్పర్శ బుజ్జగింపుతో
అనునయించుకున్న అద్భుత రాగలాలిత్యాలు
ఇప్పుడూ నిశ్శబ్దమే
నింగినుండి నేలకు పరచిన చీకటి పరదా కింద
చిల్లులుపడిన ఆకాశం గుండా వర్షిస్తున్న
వెలుగుల వేడిలో మాడి బూడిదవుతూ
ప్రపంచాని కీ పక్కన అయోమయంగా నేను
కనిపించీ కనిపించని మసక పరదా వెనుక
మూగవోయిన కోయిల స్వరంలా నువ్వు.
25 . సిగ్గు సిగ్గు
ఇదేనా మనం
సంస్కారం మాస్క్ వేసుకున్న రాక్షస మొహాలు మావి .
సంఘం వెలుగులో సంచరించే తెరపై తోలుబొమ్మలం
ఆడేడి ఆడించేదీ అంతా మిధ్యే
పుడుతూనే మొదలు పిడికిలిబిగించి నాదంటూ
పుట్టెడు స్వార్ధాన్ని ఊపిరితోపాటు మోసుకురావడం
చూపానినంత లోకాన్నీ తన సామ్రాజ్యంగా శాసించడం
గొంతెత్తి గోడలు ప్రతిధ్వనించేలా ఉనికిని చాటుకోడం
నాటు మనస్తత్వం నాటినుండీ వారసత్వంగా
అణువణువునా నింపుకు అందినంత దోచుకునే
మరో ఆగామి అవతరణ
సిగ్గు సిగ్గు !
మానవత్వం లుప్తమైనాక మనులనుకునేదారేదీ
అయినా అలవాటేగా కానివన్నీ మావనుకోడం
లేనివన్నీ ఉన్నాయని చూపటం
లేమిని దర్జాగా లూటీలు చేసి
మంచితనం పునాదిగా అంతస్తుల కృతకపు హర్మ్యాలనునిర్మించటం
సిగ్గు సిగ్గు
మూడు కాళ్ళూ ముప్పైచేతులతో
జీవితాలూ జీవనదులూ
నింగీ నేలా నిప్పునీళ్ళూ
వామనులై ఆక్రమించే
ఈ తరం లో
మనిషిననుకుందుకే సిగ్గు .
ఇప్పుడుమాత్రం
కలసి పంచుకునే ఘడియల్ను కుదించుకు
పక్కనే వున్నాపది లోకాల దూరం
ఎందుకు సుషుప్తిలో సగం కాలన్ని వ్యర్ధం చేసానో
అయితేనేం
నీకూ నాకూ మధ్యన దాట వలసిన అగాధం
నక్షత్రాలు పొదిగిగిన రాత్రి
సరిగంచు మేలిముసుగు సవరింపులా
రంగుల ఇంద్రధనుసు ఊగుతున్న గాలి ఊయల
తిప్పికొట్టే వెలుగు కిరణపు మెరుపులా
తేనె వాకల అంచుల్ను అమృతంలో అద్దినట్టూ
మెరుగు పెట్టిన వెన్నెల కిరణం
చల్లదనానికి మంచిగంధం అలిమినట్టు
కల్పవృక్షం జలజలల రాల్చే పారిజాతాల జల్లుల కింద
అర్ధరాత్రి అలవోకగా అమరత్వం రాగాలు తీసినట్టు
కేవలం ఒక స్వప్నజగత్తు
ఏమవుదామని............
రాత్రి కృశించిపోతున్న సమయాన
చుక్కలు ఉషోదయం వాకిట
వెలా తెలే పోయేవేళ
మంచుతెరల మధ్యన మంద్రంగా
తొలివెలుగు రేకల్ను తాగి
పక్షిపాపల రాగాల సన్నాయిలు
రాబోయే ఉజ్వలాన్ని స్వాగతీకరిస్తూ ............
భూనభోంతరాళాల మధ్య ప్రతిధ్వనిస్తున్న
చీకట్లను వెలిగిస్తూ ఆకసం ముంగిట్లో జ్వాలా తోరణాలు
ఆశల్ను పొదిగి అమృతం తాగిన అప్సరసలు
వినిపించే రెక్కల రెపరెపల సంగీతం
కన్నీళ్ళు నాటి ఆనందహేలను పండించుకుంటూ
శిశిరం దాటి వసంతం వాకిట నిలిచిన పరిసరాలు
పొంగిపొర్లే విషాదాన్ని మోసుకు పోయేందుకు
పల్లకిగా మారి వాకిట నిలిచిన ఉదయకాంతి
ఎక్కిళ్ళుపెడుతున్న గుండె వెన్నుతట్టి
వెలుగుల ఓదార్పు దోసిళ్ళకొద్దీ అందిస్తూ
సన్నాయిరాగాల రెక్కలపై అదౄశ్య హస్తాల సేదదీర్పు
చీకటినా ? వెలుగుల వేకువనా?
సంశయమెందుకు
వెయ్యి గుండెలు వెలిగించే సూర్యోదయాన్ని.
ఏమైపోయాయి
నా చుట్టూ నేను కట్టుకున్న కంచుగోడలు
నింగినితాకుతూ గాలైనా దూరలేని
దుర్భేధ్యమైన నిశ్శబ్దం కోట
చాపకిందనీళ్ళలా కన్నీళ్ళైనా ఇంకలేవు
ఇన్నిమెట్లెక్కి
ఈ ఔన్నత్యాన్ని ఎవరూ అందుకోలేరు
ఘడియో క్షణమో సాక్షాత్కరించే
వేడి వెలుగులూ వెన్నెల జ్వాలలూ
అంతలోనే అదృశ్యమైపోతాయి
ఆలోచనల నూలుదారాలు ఎక్కడ ఆరంభమయాయో
ఎన్ని చిక్కుముళ్ళల్లో ఇరుక్కుని తెగిపోయాయో
గాలి పరద వెనుక అగుపించీ అగుపించని
తేట తేట స్పష్టత వెయ్యికోణల్లో వెలుగులు విరజిమ్ముతూ
మాటల్లో మొలకెత్తిన వసంతం పైరగాలి పూరెక్కలు
కిరణాల చరణాలనంటి వెచ్చని మమతల్ను అభిషేకిస్తూ
నరనరానా ఇంకిపోయిన విషాదం విషాన్ని పుక్కిటబట్టి
రాత్రి మొహమ్మీద ఊసేస్తూ
తలెత్తి చూసే కొత్తలోకం గరిక మరకతాల సేకరణలో ................
అస్త్ర సన్యాసం
ఋతువులు విసుగెత్తిపోయాయి
ఎంత ఠంచనుగా ఆగమన నిష్క్రమణలను పాఠిద్దామన్నా
ఎదురౌవుతున్న ఆటంకాలకు వశమై
గాడితప్పి దారిదొరక్క
తిరిగిన చోటే తిరుగుతూ
అలసి సొలసి సేద దీర్చుకుంటున్న
ఋతువులు విసుగెత్తిపోయాయి
ఆహ్వానించని అతిధుల్లా
అకాల వర్షాలు
ఆహ్వానమే అవసరం లేని చొరబాటుదార్లుగా
వరదలూ ముంపులూ
శీతలం వేడెక్కితే
వేసవి బాధను వర్షిస్తూ
గ్రీష్మం గాఢ నిద్రలో పలవరిస్తూ
చైత్రం తెల్లబోయి ఆలోచిస్తోంది
"తీరం వదిలి సముద్రంలోకి పోతున్న ఏకాకి నౌక"లా
ఏ వైపుకు సాగాలని.
నాకు తెలుసు
కనిపించేదీ వినిపించేదీ వాస్తవంకాదు
మొహకళవళికల్లో మూడు లోకాలను
గుండెల్లో విజ్ఞానకోశాలు దాచుకున్నట్టే
అణచివుంచుతారు
గుండె గది తలుపులకు తాళాలు వేసి
ఆలోచనల ప్రవాహాలకు నిద్ర మాత్రల మైకం
ఆనకట్టగా వేసి
కనిపించని యంత్రాల్లా కదులుతూనే
పోయే రోబోల లోకం ఇది
నాలుక పలకలేని అకృత్యాలకు
మౌనంమంత్రాక్షరమని అందరికీ తెలుసు
ప్రతి నిశ్శబ్దానికీ వెనక ఓ అగ్నిపర్వతం
లావాను మరిగిస్తూంటుందనీ తెలుసు
అయినా అమాయకంగా
ఆకాఆశం అంచుల్లో విహరించే
సువర్ణ విహంగపు రెక్కలనే ఇష్టపడతాను
నన్ను నేను మరచిపోయే అక్షరాల భ్రాంతిలో
యుగాలు క్షణాలను చేస్తూ వెయ్యి జన్మలు గడిపేస్తాను
నీకూ నాకూ మధ్య
నీకూ నాకూ మధ్య
ఆకురాలు కాలం ఓ అగాధమై
మాటల కోయిలలు మూగవోయాయి
కలల వసంతాలూ శిధిలమైనాయి
నిశ్శబ్దంగా సందేశాలు అందిపుచ్చుకున్న ఘడియలు
కనుచూపు సంభాషణల రాయభారాలూ
తెరమరుగైనాయి
నిశ్శబ్దంగా నిష్క్రణ ఆగిపోయిన సూర్యోదయంలా
మబ్బు నీటమునిగిన వెన్నెల అప్సరసల్లా
ఒక్క సారైనా ఓ చిన్న సూచనైనా లేదు
నేను మాత్రం
చిరునవ్వుల తొడుగు తగిలించుకుని
జీవితం జారుడు బండమీద సాగుతూనేవుంటాను
చెమ్మగిలిన మనసు కళ్ళలోకి రాకుండా
నలకల సాకులను వెతుకుతూనే వుంటాను
నడి చీకటి మంద్రంలో లోకం విశ్రమించిన క్షణాల్లో
గతాన్నీ గుండె స్వగతాన్నీ కలబోసుకుని
రాత్రంతా కన్నీళ్ళ సముద్రాన్ని ఈదిఈది
ఉదయానికి మళ్ళీ
తెర మీది భాగోతానికి సంసిద్ధమవుతాను
నది ఒడ్డున ................
వెన్నెట్లో సేదదీరుతూ నిద్ర పోతున్న నది ఒడ్డున
ఎన్ని ఇసుక రేణువుల పసికూనలు
కర్కశంగా మన పాదాలకింద నలిగి
కళ్ళెర్రజేసి కసిగా తిట్ట్టుకున్నాయో ......
చుక్కల రేడు చక్కదనానికి పారవశించి
మందగమనంతో అందాలు ఆరేసుకున్న
నది ఎన్నిమార్లు తుళ్ళిపాటు తో తత్తరపడి
హడవిడిగా ఉపరితలపు నీటి తెరను సవరించుకుందో .....
నిశ్శబ్దంగా గుండె గతులు పంచుకున్న
గుసగుసల మధురిమల సరిగమలువినిపించట్లేదన్న
ఆత్రుతతో పైపైకి ఎగిరిపడ్డ జలపుష్పాలకు
నిద్రపట్టని ఎన్ని రాత్రులు శివరాత్రులయాయో ...
అలవోకగా నీ ఎదపై వాలి కళ్లప్రతిబింబంలో
మైమరచి నన్ను నేను ప్రంశంసించుకునే వేళ
చూపుల జడివానలో నిలువెల్లా తడిసి
ఎన్ని ప్రకంపనల అసూయా ద్వేషాలు ఆవిరులయాయో .....
అందుకేనా ఇప్పుడిలా నది ఒడ్డున
ఇసుకమేటలు మోస్తున్న విషాదపు చీకటిలో
గతాన్ని తవ్వుకుంటూ జీవజల వెతుక్కుంటూ
నిరంతర అన్వేషణ లో....
నేను మహిళను
నాకు తెలుసు
వజ్రలు పొదిగిన పాలపుంత మౌక్తిక హారాల నించి జారి
ఒక్కొక్కటిగా అమూల్య క్షణాలు
రెక్కలు మొలిచిన పక్షి పాపల్లా ఎగిరిపోతున్నా
వేన వేల జాబిల్లి ముక్కల్ను
చిరునవ్వులు సడలని పెదవుల మీద అతికించుకుంటూ
అలంకృతం చేస్తూనే ఉండాలి.
నాకు తెలుసు
అపహాస్యపు మురుకి మనసంతా అలుముకు
అవమానపు ఎడారి సుడిగాలి ఇసుక తుఫాను
చూపుదారుల్లో జిలుగు సూదుల్ను గుచ్చుతున్నా
గుండె కమిలి కరిగి రక్త నదీ నదాలుగా ప్రవహిస్తున్నా
అంతరంగం అతలాకుతలపు సముద్రాలను ఔపోసన పట్టి
సహనం ప్రతిరూపమై నిశ్శబ్దం సహవాసిగా నన్ను నేను నిర్వచించాలి
స్వేచ్చ
ఆరంభమే ఓ పెద్ద ఆటంకం
ఎన్ని ప్రయత్నాలు మొదటి పదంలోనే ఆగిపోయాయో
ఎక్కడో ఏ క్షణంలోనే పుట్టగొడుగులై మాటలు
తోటలుగా వనాలుగా అరణ్యాలుగా మారి
మనసు మబ్బుల కవచాలు చీల్చి మెత్తని కన్నీళ్ళను పీల్చి
పూలపరిమళాయై దిశదశలా వ్యాపిస్తాయి.
ఆద్యంతాలు అతలాకుతలపు అభినివేశాలను
స్వేచ్చ ఓ కవితా పతాకంగా ప్రపంచం వినువీధిలో ఆవిష్కరిస్తుంది
సంభవామి యుగే యుగే ..............
మళ్ళీ మళ్ళీ పుడుతూనేవుంటా
మనిషిగా మనసున్న మనిషిగా
మళ్ళీ మళ్ళీ పుడుతూనే వుంటాను.
పొత్తిళ్ళ అసహాయతలో లాలించి
వెన్నుదట్టిన స్పర్శ ఆనవాలు కోసం
కను చూపు ప్రేమ వివశతలో
సప్త సముద్రాల నీలిమ రంగరించి
భావౌన్నత్యపు అలల కదలికల్లో ఊయల్లూపి
గతం భవిష్యత్తుల యుగాల
అనుభవం అక్షరాలుగా దిద్దించిన అమ్మనై
మళ్ళీ మళ్ళీ పుడుతూనేవుంటాను.
ఊహకందనిలోతులు అనుభూతులు
కనిపించకుండా వినిపించకుండా రూపం లేని
సౌకుమర్యపు మధురిమలుకదిలించే
చూపనని లోకాలను కొలిచి
పక్కనున్నా పదియుగాల ఆవలనున్నా
తుళ్లింపజేసే జలపాతపు జ్ఞాపకాలకోసం
మళ్ళీ మళ్ళీ పుడుతూనేవుంటాను.
ఊపిరి సాగిన ప్రతి క్షణం సాగిలపడి
సుప్త శూన్యాల ఖాళీ మందిరాల నిండా
మాటల పారిజాతాల ప్రవాహాలు నింపే మనుగడలో
హృదయపు లోలోపలి అంతః పురంలో
వికసిస్తున్న స్వర్గధామం కోసం
మళ్ళీ మళ్ళీ పుడుతూనేవుంటాను.
మనిషినించి మనీషిని సృష్టించే
పరసవేది దాచుకున్న
మానవత్వపు మహిమాన్విత వరం
రెండు చేతులా పంచేందుకు
తరాల తరబడి చరిత్ర సారవంతం చేసే
ప్రేమ జీవనదులు పరిరక్షించేందుకు
మనిషిగా మనసున్న మనిషిగా
మళ్ళీ మళ్ళీ పుడుతూనేవుంటాను.
అసహాయత
వ్యాకరణాన్ని కాలం నిర్వచించే వేళ
రెక్కలు మొలిచిన అక్షరాలు గుంపులు గుంపులుగా
సుప్తా సుప్త అవస్థల లయ విన్యాసాలను
ముక్కున కరుచుకు ముక్కోటి జీవాలకు పంచేందుకు
సమాయత్త మవుతూ ...
అయితే
హఠాత్తుగా అర్ధ రాత్రి సూర్యోదయంలా
నడి సముద్రం బొడ్డున ఒడ్డు మొలిచినట్టు
దారి మళ్ళించుకు తీరాలను కోసెస్తూ
కొత్త పొంగు నదీ నదాలు ఆవిర్భవించినట్టు
వాస్తవం పవళించి విశ్రాంతి తీసుకుంటున్న ఘడియల్లో
భావౌన్నత్యపు వినువీధిలో వెలుగులు పంచిపెట్టే
ఊహా లోకపు సౌందర్య సీమలు నా పుట్టిళ్ళు
ఎదురు చూడని వసంతంలా
క్షణంలో చుట్టేస్తుంది నరనరాన ఇంకిపోయిన
అక్షర సీమ
కాళ్ళవేళ్ళపడే పసిపాపలు నా ఊహలు కాదని పారిపోలేను.
కను రెప్పలమీద వాలి ఉభయ సంధ్యల్లో కలలతో స్వాగతించే ’
అక్షరాల అప్సరసల్ను కాలదన్నలేను
ఊపిరి అణువణువునా వేణుగానాలను పలికే
సరిగమల్ను తుమ్చి పారెయ్యలేను
అందుకే ఉషోదయం ముద్దుగారే అక్షరాల పసి కూనలతో
అస్తమయమూ ఆకాశం గోడలకు రంగేసే రాగాల గమకాలతోనే
ఒక అలవోక స్వప్న మార్గం
సరిహద్దురేఖలో నిన్నో , రేపో , వర్తమానమో
కుంభవృష్టి మంచుతుఫానో
చూపు సారించలేని ఎడారి సుడిగాలో
మసకబారిన వెలుగు పరదాల వెనక
పాలరాతి సౌకుమర్యపు గుండె ఒడిలో
తుళ్ళి పడే నీటీ తుంపరలుగా
నీ మౌన భాష్యాలు
పొడి బారిన గతం చలమల్ను
తవ్వుకుంటూ ఎంత లోతుకెళ్ళినా
అనుభూతుల తడితప్ప
ఉద్వేగాల జల పొంగి పొర్లదు
కనుమరుగై పోయిన గాయాలు
ఎండమావుల్లా అక్కడో ఇక్కడో తళుక్కుమంటూ
కనిపించని ఆయుధాలను మాటిమాటికీ విసురుతూ
అసహాయతను పరిహసిస్తూనే పోతాయి.
నడి సముద్రపు అలల పరిభ్రమణలో
ఎరుపెక్కిన వెన్నెల రంగులోనో
నిక్షిప్తమయిన అనుభవాల కదలిక
దిగుల నెగళ్ళు పోగేసుకుంటూ
చలికాచుకుంటున్నకొంకర్లు పోయిన కలల వేళ్ళు
గాజు గోలీ కన్నులా జీవితపు నిర్లిప్త గమనం
కనిపించకుండా వినిపించకుండా
నీ ఉనికి నిశ్శబ్దంగా ’
నా పలవరింతల్ను సవరిస్తూ ......
లిప్త
భావరాహిత్యపు ఉరికంబాన్నెక్కి
చూపు శుష్కించిన మసక మగతలో
ఊపిరి ఆరేసుకున్న స్వప్న శకాలాన్నై
అనంతంగా
కుప్పలు తెప్పలుగా రాలిపడుతున్న
నిస్సత్తువ హిమ వారాసులకింద
నిక్షిప్తమైపోయిన ఎదురు చూపు నవుతూ ...
ఈదురుగాలి వగపోత ఎక్కిళ్ళలో
నడి సంద్రపు తరగల తూగుటుయ్యాలగా
గారాలుపోతూ
విశ్వమంతటి గుండె పై తలవాల్చి
ఊహ ఝంఝామారుతాన్నై
లోకాలు చుట్టివచ్చిన క్షణాలు
జ్ఞాపకాల తీగల్ను కదిలించినప్పుడు
కన్నీటి రెప రెపల మధ్య చిరు కావ్యాన్నౌతూ
నిన్న ఒకలిప్త , రేపూ ఒక లిప్తే
ఇవ్వాళ మాత్రమే
సుదీర్ఘమైన పలవరింత.
అందుకేనా ..............
నా నిశ్శబ్ద కవనాల ప్రబంధాలు
నీ రాగ స్వరాల తుళ్ళింతలు
అనవరతం రాత్రీ పగలూ
ఎన్ని కళా భువన భవనాలు నిర్మించుకున్నామో
అందుకేనేమో ఇప్పుడీ
కుప్పకూలిన నిర్మానుష్యపు
శీతల సమాధిలోనూ
వసంతం తలవంచుకు సెలవంటూ
వదిలేసిన క్షణాల్లోనూ
ఒకానొకప్పటి మన కలల సౌధంలో
గతాన్ని వల్లెవేసుకుంటూ యుగాలను క్షణాలుగా
No comments:
Post a Comment