Friday, March 23, 2012

నవ వసంత యామిని

అలసి సొలసి పవళించిన శిశిరపు గాలులపై తేలి సోలి నర్తించగ 
మంచుపూల కళ్ళుగప్పి  తేట తేనె  గళం ఎత్తి
తొందరపడి నవ వసంత యామిని ముందే మనవాకిట రంగుల పురివిప్పిందీ 

రంగువెలసి పీలికలై గతకాలపు వైభవాల పరదాలిక వద్దంటూ 
ఏ చోటనొ కానరాని
కొత్త పూల నెత్తావులు తొలి కలల జల్లు చినుకులుగా
చూరమ్మట జారి జారి పరిమళాల ధారలుగా
పెదవి దాటి ఒక మాటాల గోదావరి లా
గోధూళి చల్లు రంగుల వసంత కేళిలా .....
తొందరపడి నవ వసంత యామిని ముందే మనవాకిట రంగుల పురివిప్పిందీ 
అడవితల్లి అల్లుకున్న   ఆకు పచ్చకోటలోన
తలదాచుకున్న పాటల పాపాయిల రెక్కలనో మారు నిమిరి
నిప్పులు కురిపించే బాల సూర్యునికో లాలిపాట పాడేందుకు
కొమ్మల తో లేత లేత చిగురాకుల  రెమ్మలలో పరుగులిడే గాలి స్వరం సానబట్టి
అల్లిబిల్లి దారుల్లో కుప్పిగంతులేసే మబ్బు తునకలో రెంటిని చిక్కటి పరదాలై పోపొమ్మని తరిమికొట్టి
తొందరపడి నవ వసంత యామిని ముందే మనవాకిట రంగుల పురివిప్పిందీ 

Thursday, March 22, 2012

ప్రేమంటే

నిద్ర ముని వేళ్ళమీద నడిచొచ్చే నిశ్శబ్ద స్వప్న సీమ కాదు
పెదవులకు తాళం వేసుకు మాటలకు మౌనం చుట్టుకు విశ్రమించిన సరాగ సౌందర్యం కాదు
విశ్వాంతరాళపు వీధుల్లో ఊరేగి  కొండ కోనల
గుండె లోలోపల నిశ్చల తపస్సామాధిలోని
జీవనదీ కాదు
కెరటాలకూ తీరానికీ మధ్య నిరంతరం కొనసాగే ఆధిక్యతా తోపులాట వ్యవహారం కాదు
రోలర్ కోస్టర్ మీద కాస్సేపు పైపైకీ కాస్సేపు అగాధానికీ చుట్టూ చుట్టూ తిరిగే సరదాకాదు
ప్రపంచం బోనులో పడి కానిపించిన ప్రతివారిపై అక్కసు వెదజల్లే మృగరాజు అంతకన్నాకాదు
చిందర వందర కాగితాల మధ్య ఎవరిని వాళ్ళు
వెతుక్కోడం కాదు
 వీటన్నింటి మధ్యా చిరునవ్వుతో అతలాకుతలమైనా
ఉనికి మరచి ఊహను మరచి నేననే భావన మరచి
ప్రపంచమంతా ఒక్కరిదే ననుకునే తీపి వేదనే ప్రేమ
ఎవరిని వాళ్ళు  బలి చ్చుకోగలిగేదే ప్రేమ
జీవన్మరణాల వాకిట చెక్కిన సజీవ శిల్పం ప్రేమ



Sunday, March 18, 2012

ఎందుకా పరుగు నీకు ఓ చల్లగాలీ

ఎందుకా పరుగు నీకు ఓ చల్లగాలీ
ఎవరి చెక్కిలిపైన చిరు నవ్వై వెల్లి విరియాలనీ
అలికిడే లేని నెత్తావి గుస గుసల అలనీలి తేరువై
పులకరింతల పూల తలలూపు చిన్నారి బాలికల పున్నగ రాగమై
ఎందుకా పరుగు నీకు .............
హరిత కడలిని కాలాన్చి నర్తించు అలల రెప రెప లుగా
ఆకుచాటున దాగి ఎలమావి కోయిల సరిగమల విందుగా
ఎవరికీ దొరకని పరిమళపు అలరింపు మైపూత నీవుగా
చివరి వెన్నెల జాలు వారిన తేట తేనియ తీగగా
ఎందుకా పరుగు నీకు .............
ఏ హృదయ సీమలో పల్లవై పలికిన వలపు భావన దూతవైతివో  ఏమో
ఏ గగన భూమిలో చిరుసంధ్య  మెరుపులో కేరు మను పాపాయి ఊపిరవ్వాలో
లోకమంతా మేసి నెమరేయు మనస్సులో ఆనంద డోలికల కదలి కవ్వాలనో
అంతరంగము చేయు కనుసైగ లీలలను కడదాక తరలించు భాగ్యమవ్వలనో
ఎందుకా పరుగు నీకు .............