Saturday, October 22, 2011

ఏమైపోతిని ఏమైపోతిని ఈ క్షణమూ
నేను శూన్యమై జగము మాయమై
ఒళ్ళు మరచి కళ్ళెదుట నిలిచినదొకటే
పాటా పల్లవి ఒకటి వెనక మరొకటి పాటా పల్లవీ................

అక్షరాలు ఏర్చి కూర్చి అప్సరసల పదాలల్లి
సుకుమారపు భావాలను ఊపిరులను ఊది ఊది
పద సంపద చక చకమని  పరుగులెట్టు గోదారల్లే
ప్రవహించటమే ఉనికిగా ఊపిరిగా నేనుగా.....

ఆకసాన మబ్బుతునక నీడవోలే నడయాడగానె
ఏ కొసనో పదిలంగా దాచుకొన్న అక్షరాల విత్తనాలు
చిరుజల్లుగా పెను వానగా వెదజల్లు వేడుకలు ఆగి దాగి
 ఆపై నునులేత పచ్చికలై  మొలకలుగా తలలెత్తే క్షణాన
 నా పసికూనలు పాటల పాపలు బుడి బుడి నడకల
నాలుగు వీధులు నడచినప్పుడు .. నాలుగు చెరగుల పలికినప్పుదు
పాటలోని పాట వెంట ప్రాణవాయువై రాగ తేజమై భావ యుక్తమై
ఏ దరికో ఏ హృదికో ఏ అనంత లోకాలకొ తరలిపోవు వేళ
ఆకురాలు కాలమా అలసిపోని విలయమా
నేలపైన వాలినా రంగులన్ని నీవేనా?
ఆకురాలు కాలమా ...............
నడినెత్తిన మాసిన వెలుగు కొలువు
నిలువెత్తున ఖైదీగా వేడి పొడగు
రూపేమో తెలుపైనా  మంచుపిలుపు
జివ్వుమనే సూదిమొనల పరుపేగా
ఆకురాలు కాలమా...
దుమ్ము ధూళి అలుముకున్న వదనంపై
అమ్ముకున్న వసంతాల సమాధిపై
కనబడవే కాస్తైనా వేదనల రోదనలు
 కన్నీటి చారికల గతకాలపు వైభవాలు
ఆకురాలు కాలమా.........
జవసత్వాలుడిగి పోయి ఆసక్తులు సమసినాక
రివురివ్వున ఎగిరేందుకు రావు కదా రెక్కల సలు
పూసి కాసి పండయి పోయిన వయసున
మిగిలిన పడిగాపులు అసుర సంధ్య కౌగిలికేగా .............ఆకురాలు కాలమా.........
అది స్వరమా ?
వెన్నెల ఝరి వ్యామోహమా?
ఎద కదలిక పలికే స్వాగత సంగీతమా?
అపరిచిత భావాలను మీటే మలయపవనమా?

వానచినుకు తాకిడికే వసుధ తనువు వణికినట్టు
శిశిరం దులిపేసిన  చిరు మంచుపొగల జల్లుకే
మసకేసిన వెన్నెలలో నీటి అలలు జరిగినట్టు
  ఓ గమకం పొరబాటున కాలుజారి
కలకూజితమై పలికినట్టు
అది స్వరమా ?
వెన్నెల ఝరి వ్యామోహమా?
ఎద కదలిక పలికే స్వాగత సంగీతమా?
అపరిచిత భావాలను మీటే మలయపవనమా?
మనసులోలోపలి వీధుల్లో కల చిటికన వేలివెంట
విభ్రమవశీకరణలో పసిపాపలాగ నడిచినట్టు
ఆకురాలు  కాలం లో రాలిపడే పూరెక్కల కలబోతల
గుసగుసలే కలవరించినట్టు
అది స్వరమా ?
వెన్నెల ఝరి వ్యామోహమా?
ఎద కదలిక పలికే స్వాగత సంగీతమా?
అపరిచిత భావాలను మీటే మలయపవనమా?





సిరిమల్లె గుబురంట సీతమ్మ వాకింట

సిరిమల్లె గుబురంట సీతమ్మ వాకింట
పూసింది నిలువెల్ల పరుగెత్తే తొలిపంట

ఆకు రాల్చిందంటె అమ్మాయి శిల్పమే
చిగురు తొడిగిందంటే చెక్కిళ్ళ అందమే
చిగురు చిగురున మొగ్గ చిన్నారి కనురెప్ప
గాలి కదలికలన్నీ సరిగమల గమకాలు

సిరిమల్లె గుబురంట సీతమ్మ వాకింట
పూసింది నిలువెల్ల పరుగెత్తే తొలిపంట

ఆకుల్లోమొగ్గలా అవి కన్నె కలలా
మొగ్గలవెనకాన ఆకుల చూపులా
కాదు కాద్దమ్మో అవి సిరిపూల తూపులు
అమ్మడి మనసున విరిసిన వలపులు

సిరిమల్లె గుబురంట సీతమ్మ వాకింట
పూసింది నిలువెల్ల పరుగెత్తే తొలిపంట

రాత్రంతా ప్రవహించు తలపుల మధురిమలు
తెల్లారి నేలన వెదజల్లె కధల పూరెక్కలను
ఏరేటి సీతమ్మ మనసు పరచిందేమొ
వెన్నెల అలికిన వెలుగుల పున్నమిగ

తొణికే స్వప్నమా తొలకరి ముత్యమా’ ఎద లోలోపలి ఏకాంత మౌనమా

తొణికే స్వప్నమా తొలకరి ముత్యమా’
ఎద లోలోపలి ఏకాంత మౌనమా
ఎందుకే నీకింత తుళ్ళింతలీ వేళా
ఎందుకే నీకింత రాగతనమీ వేళా

చెక్కిళ్ళకెంజాయ కెరటాలు పల్లవించినవేమొ
మెలమెల్లగా దిగులు తెల్లవారినదేమొ
నీలిగగనపు సీమ నెమలి నడకల తోడ
శృతిచేసి ఎదమీటి ఎందుకీ వేదింపు
కనుదోయి కలశాల లేత మామిడి కొమ్మ
వలపు రెమ్మ
పరచిన పాల చెక్కిళ్ళ పుంతలో
సిగ్గు సింధూరాల వీణ
భావాల జాతర వాకిళ్లలోనీ తలపుకళ్ళ లో
తేనె తొలి చినుకు వాన
ఎవరితో చెప్పనీ నును వెచ్చనీ మలుపు
ఎవరికై చిలకనీ మనసు గంధపు చినుకు
ఏనాటి భాగ్యమో ఎదురైన ఈ ఘడియ
ఎంత మాధుర్యమో చూపు రెక్కల మాటు
వేన వేల అనునయాల అలికిడుల రాగాలు

కలగన్నానా?

కలగన్నానా ? కలగన్నానా?
ఇలలోనైనా కలలోనైనా అనుకున్నానా? ’
ఈ క్షణమొకటి నాకోసం వేచి వున్నదని
ఎన్ని యుగాలుగ ఎదురు చూసిన రాగబంధమొకటి
ఇంటి గడపలో ఎదురుచూపులో నిలచివుందనీ
కలగన్నానా..........................

ఎవరో నడిచొచ్చే అలికిడి లేదు
ఎచటా అడుగుల సడి అసలే లేదు
మనికి మూలలో మాట మలుపులో
వెలుగుపూల వానై , చిరుజల్లు వరదముంపై
ఊహల నదిలో ఊరేగింపున మునిగి తేలుతూ
పూలపల్లకై పూర్వ జన్మ సుకృత మొకటి
ఎదుట నిలిచి ఉంటుందని
కలగన్నానా?

క్షణమొక యుగమై మనసొక జగమై
మాటరాని మౌనానికి ఒక జీవిత ఖైదీనై
వెలుగు చీకటుల దాగుడుమూతల రాతి బొమ్మ ఊపిరినై
హుషారైన తుషార వీచిక ఏ మాత్రపు అలికిడి తోచని
స్నేహ స్వప్నమొక స్వర్గద్వారమును తెరచివుందనీ
కలగన్నానా?

ఏమో ఇది ప్రేమేనా

ఏమో ఇది ప్రేమేనా
ఎవరికి తెలుసు అవునో కాదో
నీ మాటలు వింటుంటే
అది మోహనమని అనిపిస్తే ..............

నీతో గడిపే ప్రతి నిమిషం ఎన్ని క్షణాలకొ ఊపిరి అయితే
నిద్రా మెళుకువ రెప్పలపై నీ స్వర మాధురి రాజ్యమేలితే
పెదవి కోనపై మనసు ముత్యమై దొర్లిన మాటలు
రెక్కలొచ్చిన తూనీగలుగా మనసు చుట్టు మరిమరి మూగితె

ఏమో ఇది ప్రేమేనా
ఎవరికి తెలుసు అవునో కాదో
నీ మాటలు వింటుంటే
అది మోహనమని అనిపిస్తే ................

నిద్ర వంపులో వాలిన రెప్పల ఆకాశానివి నువ్వైతే
మగత బెంగలో పలవరింతలో పలికే మాటె నీదైతే
పెదవి కదిలినా మనసు పలికినా ఆణి ముత్యమై నీవుంటే
అదరక బెదరక అన్ని వేళలా నీ జపమే ఇక నాదంటే

ఏమో ఇది ప్రేమేనా
ఎవరికి తెలుసు అవునో కాదో
నీ మాటలు వింటుంటే
అది మోహనమని అనిపిస్తే ................

కల కాదుసుమా.............

కనురెప్పలలో ఒదిగిన ముత్యపు ఒంటిరాయి కలనీవే
కమనీయపు మెరుపున విరబూసిన బంగరుకమలము నీవే
ఆకుల మాటున ఆమని స్వరమై అలజడి రేపిన మధురిమనీవే
పూపొదరింట పున్నమి వెలుగై తారలదివ్వెలు పేర్చినదీ నీవే

ఊహల ఆశల ఊపిరికలమై నీలినింగి అలలపైన పంచ వన్నెల కావ్యంలా
ఆహ్వానపు చిరు గీతం ఏర్చికూర్చి మమతను పొదిగి పొదిగి పలికిస్తున్నా
పెదవుల సరిహద్దుల వెనకో ముందో వినిపించీ వినిపించని కోయిల గానంలా
వసంతగీతిక పల్లవిగా పదేపదే పలవరించు కలవరింతగా పాడుతున్నా

యుగాలుగా నీవాకిట ఎదురుచూపులో ఎండమావిలావేచిఉన్నాను
సెగలు పొగలుగా రగిలిన మనసుకు చల్లగాలి ఓదార్పులా ఏదీ నీ కడకొంగు వీవన
రగిలి రగిలి మది చెదిరి ముక్కలై మరిగి మరిగి ఆవిరి చుక్కనై ఆకసాన వేలాడినా
తొలి చినుకు చుక్కనై నీ పెదవి పాన్పుపై సేదదీరలేనా ఇది కల కానేకాదు సుమా....