Wednesday, May 22, 2013

రాసేద్దామని కూచున్నావు ఏం తెలుసును నీకు?||




గాలి స్తబ్ధత లో వాలిన దిగులు చూపుల కళ్ళ 
హరిత స్వప్న సీమల జాడ లేమైనా తెలుసునా

వాన తీగల్లో ఒదిగిన చీకటిని తడిమి చూసే
మెరుపు వయ్యారాల వంపులేమైనా తెలుసునా

ఎక్కడో  మారు మూలలనుండి లాగి ఎప్పటికప్పుడు నెమరేసుకునే
గాయాల గడ్డిపరకల రుచి గురించేమైనా తెలుసునా

సూది మొనల్లా చురుక్కుమనిపించే
ప్రవేశాలూ నిష్క్రమణలూ నిలువెల్లా కుదిపేసిన ఘడియలు ఎన్ని

నిశాచరులై నీడల్లా వేళ్ళాడుతూ ఊడలు నాటుకున్న
చేదు విషాదాలు కనురెప్పలపై వాలి నిద్రను నిలువెల్లా
ఆవిరి చేసిన రాత్రులు ఎన్ని?

ఎవరి కంట నీరైనా సముద్రమై
నిన్ను నిలువెల్లా ముంచెత్తిన అలగా మారిన వైనమేదీ
చుట్టూ ఉప్పునీటి వరదల మధ్య
కాగితం పడవ ఊగిసలాడిన ఏకాంతపు ఉద్విఘ్నాలు ఎన్ని

ఇవన్నీ కాకున్నా
వెయ్యి వసంతాల ఆమని ఏనాడైనా
ఒక్కసారి నీ వాకిట నిలిచిందా?
ఎక్కడో గుండె శబ్దం నీదిగా నీకు తోచిందా
చెమ్మగిలిన మెత్తదనం చెక్కిలి నిమిరి పలకరించిందా

రాసేద్దామని కూచున్నావ్
ఏం తెలుసనీ నీకు

Tuesday, May 21, 2013

నాకూ నా జీవితం కావాలి



పుష్యమాసం. ఉదయం చలిగాలులు చర్మాన్ని దూసుకువెళ్ళి ఎముకలను సూదుల్లా తాకుతున్నాయి. వేడి వేడి నీళ్ళు స్నానం చేసి రావటం వల్ల కాబోలు చలి మరీ ఎక్కువైనట్టు తోచింది కృష్ణ సాహితికి. ఎలాగూ అరగంటలో బయలు దేరాలి, అక్కడికీ మందపాటి చీరే కట్టుకుంది. డ్రెస్సింగ్ టేబుల్ ముందునించుని పగిలిన చేతులకు మాయిస్చరైజర్ రాసుకుంటూ యధాలాపంగా అద్దంలో వెనకాల అగుపిస్తున్న దృశ్యాన్ని చూసి తలతిప్పుకుంది. డెబ్బై దాటిన తండ్రి అరవై ఆరుదాటిన తల్లి, పక్కన నించున్న ఆవిడను దగ్గరకు లాక్కుని పెదవులమీద ముద్దు పెడుతూ
"ఛీ"
అప్రయత్నంగా పైకే అనేసింది. అయితే టీవీ సౌండ్ పెద్దగా ఉండటం, " నన్ను దోచుకుందువటే వన్నెల దొరసానీ " పాట ఇల్లంతా వ్యాపించటం వల్ల కాబోలు కృష్ణ సాహితి మాట ఎవరికీ వినబడలేదు.
గబగబా పెదవులపై లిప్ గ్లాస్ అద్దుకుని , గదిలోంచి బయటకు వచ్చింది.
డైనింగ్ టేబుల్ దగ్గర తండ్రి పక్కనే నిల్చున్న తల్లి శకుంతల కాస్త పక్కకు జరిగి కృష్ణ సాహితికి పళ్ళెం పెట్టి ఇడ్లీలు వడ్డించింది.
పళ్ళెంలో అల్లం పచ్చడి వేస్తూ,
" రేపు ఉదయం బండికి కరుణ సాయంత్రం  కవిత వస్తున్నారు"
అయిష్టంగానే తలాడించి ఊరుకుంది కృష్ణ సాహితి.
ముందుగా బాగ్ లోంచి నాలుగు టాబ్లెట్స్ తీసి వాటి ఫాయిల్ తొలగించి చేతిలో పట్టుకుని ఎడం చేత్తో గ్లాస్ అందుకుని వాటిని మింగి నీళ్ళు తాగి ప్లేట్ ముందుకు జరుపుకుంది.
డయాబెటిస్ కి గదిలోనే ఇన్స్యులిన్ తీసుకుని బయటకు వచ్చింది. ఒక బీపీ మాత్ర, ఒక థైరాయిడ్ మాత్ర, ఒక టి డయాబెటిస్ కీ మరోటి కొలెస్ట్రాల్ కి.
అందుకే ఆయిల్ లేకుండా ఇడ్లీ , దాంట్లో అల్లం పచ్చడే తినాలి.
మధ్యాన్నానికి రెండు చపాతీలు కాస్తకూర వంటమనిషి లంచ్ పాక్ చేస్తుంది.
ఉదయం వచ్చిన వంటమనిషి ఉదయం ఉపాహారాలు , మధ్యాహ్నం భోజనం రాత్రికి చపాతీలు చేసి నాలుగింటికీ టీలు ముగిసాక వెళ్తుంది.
ఇంట్లో ఉన్న తల్లీదండ్రీ ఉదయం వాకింగ్ కి వెళ్ళివచ్చి టిఫిన్ తినడం రోజంతా సినిమాలు , సరసాలు, గిల్లికజ్జాలు పగటి నిద్రలు మళ్ళి అయిదింటికి కృష్ణ సాహితి వచ్చేసరికి ముక్కుతూ మూలుగుతూ ముణగదీసుకు కూచుంటారు.
ప్లేట్ తీసి సింక్లో వేసి చెయ్యి కడుక్కుని నీళ్ళు తాగుతున్న కృష్ణ సాహితి చేతికి సరుకుల చీటీ అందించింది శకుంతల.
" ఇదేమిటి? "  వాష్ బేసిన్ ముందు నించుని అద్దంలో చూసుకుంటూ అడిగింది.
"అప్పుడే చెంపలు నెరుస్తున్నాయి " మనసు లోనే గొణుక్కుంది.
"కావలసిన సరుకులు"
ఎప్పుడూ తీసుకుని బాగ్ లో పెట్టుకుని వెళ్ళే కృష్ణ సాహితి నీంచుకుని లిస్ట్ ని గట్టిగానే చదువుతూ పోయింది.
పంచదార ఆరుకిలోలు..
బ్రూ ఫిల్టర్ కాఫీ ఒక కేజీ
శనగపిండి నాలుగు కిలోలు,
నూనే పదికిలోలు ....
అమ్మా ఇవన్నీ ఇంటికా? మనమేమన్నా మెస్ పెడుతున్నామా? "
"అదేమిటే చోద్యం, అలాగంటావు, కరుణ , కవిత పిల్లలతో వస్తున్నారు . సంక్రాంతి సెలవలు అయ్యాకే వెళ్తారు. నలుగురూ ఇంట్లో ఉన్నాక కాఫీలు ఫలహారాలు అవవూ... ఇల్లన్నాక పండగ పబ్బం అంటూ ఉండదా? ఎలాగూ అందరూ వస్తున్నారు సీతారాం ని కుడా పెళ్ళాం పిల్లలను తీసుకు రమ్మని చెప్తాను"
"ఇంకెవరూ లేరా పిలవడానికి?"  గుమ్మం దాటుతూ గట్టిగా అని తల్లి మరేదో మాట్లాడబోతున్నా ఆపి బయటకు వెళ్ళిపోయింది.
@@@@@@@@@@@@@@@@@@@@
మధ్యాన్నం లంచ్ టైం తరువాత రెండూ పీరియడ్స్ ఫ్రీగా వుండటంతో తీరిగ్గా ఆలోచించుకునే సమయం దొరికింది.ఉదయం వస్తూనే మొదటి క్లాసే కామర్స్ వాళ్ళది. ఉన్న పాతిక మందిలో ఇరవై మందికి లెఖ్ఖలు రావు. కాని పదో క్లాస్ లో అరవైలూ డబ్బైలూ మార్కులు .... వాళ్ళకి ఏ కాన్సెప్టయినా తల్కెక్కే సరికి దేవుడు కనిపిస్తాడు. రెండో పీరియడ్ కంప్యూటర్స్ వాళ్ళది. సగం మందికి రాక శ్రద్ధ లేకపోతే మిగతా సగం మందీ ఏ ట్య్యుటోరియల్ లోనో ముందే చదివేసుకుని వాళ్ళకూ ఏ శ్రద్ధా ఉండదు. కత్తి మీద నడవటం అయిపోయింది టీచింగ్ అంటే మూడో పీరియడ్ ఫ్రీగా ఉన్నా ఎవరు రాకపోతే వారి క్లాస్ అడ్జస్ట్మెంట్
 మొత్తానికి తీరిక చిక్కే సరికి పన్నెండున్నర దాటింది.
వేసుకోవలసిన టాబ్లెట్స్ వేసుకుని ఒకసారి స్టాఫ్  రూం పరిశీలనగా చూసింది.
ఆ చివర శైల ఎవరితోటో ఫోన్లో అతి మంద్ర స్వరంలో మాట్లాడుతోంది. ఫాన్ కింద సూర్యలక్ష్మి కునికి పాట్లు పడుతూనే నోట్ బుక్ లో రెడ్ ఇంక్ పెన్ తో టిక్ మార్క్ లు కొడుతోంది.   తలబయటకు తిప్పింది. బయట గ్రౌండ్ లో చెట్టునీడకిండ కుర్చీలో సంగీతం టీచర్ స్వప్న పీటీ సర్ శిరీష్ కబుర్లాడుకుంటున్నారు. పిల్లలు వాళ్ళ ఇష్టా రాజ్యంగా ఆటలు.
ఎన్ని కలలు ! ఎన్ని ఆశయాలు!
ఏమైపోయాయి అవన్నీ?
ఎమ్మెస్సీ గోల్డ్ మెడలిస్ట్ , అమెరికా వెళ్ళాలనీ అక్కడ ఎమ్మెస్ చేసి, భవిష్యత్తు పట్ల ఎన్నో ఊహలు. కాని ఇంటికి వచ్చేసరికి అన్నీ బూడిద కుప్పగా మారిపోయాయి.
పెరాలిసిస్ వచ్చి ఆసుపత్రికి వెళ్ళిన తండ్రి, బిక్కమొహంతో ఇద్దరు చెల్లెళ్ళూ అమ్మా నాన్నా కనిపించక బిక్కు బిక్కుమంటూ తమ్ముడు సీతారాం.
కలల్ను తుంగలో తొక్కి జీవన సమరానికి దిగక తప్పలేదు. వెంటనే ప్రైవేట్ స్కూల్లో చేరిపోయింది.
వెంటనే ప్రైవేట్ స్కూల్లో చేరిపోయింది.
పొద్దునా సాయంత్రాలు ట్యూషన్ లు చెప్పదం. ఆర్నెల్లలో తండ్రి కాస్త తేరుకున్నా మరి ఉద్యోగం మాటే ఎత్తలేదు.
అయినా తనకూ ఈ పరిస్థితి బాగానే తోచింది. అంతకు ముందు నాన్న నడిగే అమ్మ ఇప్పుడు తనను అడగటం మొదలు పెట్టింది. ఏం వండాలి అని.
తనకు ఇష్టమని ప్రతి రెండో పూట బంగాళా దుంపలో అరటి కాయలో వేపుడు చెయ్యడం, ఇది వరకు వెళ్ళి ఎవరి కాఫీగ్లాస్ లు వాళ్ళు తెచ్చుకోడం ,తాగాక ఎవరిది వాల్లు కడిగి పెట్టడం జరిగేవి. కాని ఉద్యోగంలో చేరాక మొహం కడుక్కునే సరికి అమ్మ కాఫీ గ్లాస్ అందిస్తుంది.
ఆర్ధికంగా కాస్త వెసులు బాటు చిక్కగానే పనిమనిషిని కూడా మాట్లాడింది. సజావుగా సాగే కుటుంబంలో అప్పుడో ఇప్పుడో తన పెళ్ళి ప్రసక్తీ వచ్చేది. రాగానే అమ్మ మొహం చిన్నబోడం తెలుస్తూనే ఉండేది. పెళ్ళి మాట ఎత్తిన వాళ్ళతో " ఆడపిల్లన్నాకా పెళ్ళి చెయ్యక పోతే ఎలా ? చూస్తున్నాం మంచి సంబందం కుదరగానే చెయ్యకుండా ఉంటామా ? మా రాతలు మావి " అనేది. అప్పట్లో నిజమే అమ్మ చెప్పినది, అమ్మకు నా గురించి ఎంత బెంగ్ అనుకునేది.
ఒకటి రెండు పెళ్ళి చూపుల వరకూ వచ్చాయి కూడా. వాళ్ళటు వెళ్తూనే ఇటు కామెంట్స్ మొదలయేవి.
" మరీ ఆ తల్లేమిటండి బాబూ కొడుకును ఒక్కమాటా మాట్లాడనివ్వదు. మరీ ఇంత డామినేషన్ అయితే రేప్పొద్దున పెళ్ళయాక కూడా అమ్మ ఏంచెప్తే అది అంటాడేమో" అప్పట్లో సంపాదన గీర్వాణం తలకెక్కి "అవును అలాటి సంబందం వద్దే వద్దు "అనేసింది.  మరో సంబందం అక్కలూ చెల్లెళ్ళూ ఉన్నారని , ఇంకోటి పిల్లాడికి సంపాదన తక్కువనీ, మరొకడు అందంగా లేడనీ ఒకటా రెండా ఎన్ని?
దాదాపు పదేళ్ళు ఉద్యోగం చేశాక కాబోలు ఇలా అనుకోకుండా ఇహ ఉద్యోగం రాదనుకున్న సమయంలో వచిన ప్రభుత్వోద్యోగం మరింత అహాన్ని పెంచింది.
తల్లి నెమ్మదిగా మిగతా కూతుళ్ళ సంబందాలు చూసి ఒప్పించి వాళ్ళిద్దరి పెళ్ళిళ్ళు కానిచ్చింది. అప్పుడు తనకు ఆలోచన రానే లేదు తన పెళ్లి అనే సరికి అడ్డం పడ్డ కారణాలేవీ చెల్లెళ్ళ విషయంలో ఎందుకు అడ్డంకులు కాలేదో ?
ముప్పై తొమ్మిదో ఏట అనుకోకుండా తనతో పనిచేసే శంకర్రావుఒకరోజున ప్రపోజల్ తెచ్చాడు.
అతనికీ బరువులూ బాధ్యతల వల్ల పెళ్ళి ఆలస్యమయింది. ఇద్దరిదీ ఆర్నెల్లు అటూ ఇటూ గా ఒకటే వయసు. ఇద్దరి వెనకాల సంస్యలు , సాంఘిక పరిధీ ఒకటే సుముఖత తెలియజేద్దామనుకున్న రోజే తమ్ముడు తనకు నచ్చిన పిల్లను పెళ్ళాడి ఇంటికి తెచ్చాడు. మనసులోని అక్కసంతా వాడి మీద గుమ్మరించింది.
నాఇంట్లో ఉండటానికి వీల్లేదంది.అడ్డం వచ్చిన తల్లిని కావాలంటే మీరూ వాడితో వెళ్ళిపొమ్మని అనేసింది.
వాడు వేరే ఇల్లు తీసుకుని వెళ్ళిపోయాడు.
మళ్ళీ తల్లీ తండ్రీ తను. శంకర్రావు మరెవరినో పెళ్ళి చేసుకున్నాడు.
చూస్తూనే వుంది అనువైన మనిషి దొరికితే పెళ్ళి చేసుకోవాలనే ... ఆసమయంలోనే ఆరంభమయింది బీపీ .
ఈ లోగా మెనోపాజ్ డయాబెటిస్ థైరాయిడ్ వీటితో పాటు ఎంత జీతం వస్తే అంత నీళ్ళలా ఖర్చుపెట్టే అమ్మ...
సెల్ రింగవడంతో తేరుకుని ఫోన్ తీసుకుంది .
అమ్మ!
" ఊ చెప్పు ."
" సంక్రాంతికి వస్తున్నారు కదా , పండగపూట వచ్చిన వాళ్ళకి బట్టలు కొనకపోతే ఏం బాగుంటుంది ..." వినకుండానే ఫోన్ స్విచ్చాఫ్ చేసింది.
ఈ భాగోతం గత పదేళ్ళుగా సాగుతున్నదే.
ప్రతిపండక్కీ వస్తారు చెల్లెళ్ళు వాళ్ళ పిల్లలు సంసారం వాళ్ళకోసం పిండి వంటలు కొత్త బట్టలు....
ఆలోచించలేక టేబుల్ మీద తలవాల్చిన కృష్ణ సాహితి ఏమవుతోందో అర్ధం అయ్యేలోపే స్పృహ తప్పి కుప్పకూలిపోయింది.
****************
" ఎలా ఉంది కృష్ణా "
వినిపించిన చాలా సేపటికి కళ్ళు తెరిచింది.
ఎదురుగా డ్రాయింగ్ మాస్టర్ వెంకటరమణ -అతని కళ్ళలో ఆత్రుత. అతనొక్కడే కృష్ణ అనిపిలిచేది
" ఏం లేదు కొంచం షుగర్ లో అయింది, వెంటనే ఇక్కడికి రాగానే గ్లూకోస్ డిప్ ఇచ్చారు. ఇప్పుడు మామూలుగానే ఉంటారు "
అవును నెమ్మదిగా లేచి కూచుంది.
డాక్టర్ వచ్చి టెస్ట్ చేసి నార్మల్గానే వుంది వెళ్ళమని చెప్పాక దిగబోయింది వచ్చి చెయ్యందించాడు వెంకట రమణ
 నిస్సంకోచంగా అతని చెయ్యి ఆసరా తీసుకున్నాక గుర్తు వచ్హ్చింది.
వెంకటరమణ ప్రపోజల్, అయిదారేళ్ళు అయిఉంటుంది, మధ్య వర్తి ఎవరో ఈ ప్రసక్తి తెచ్చాడు. సరిగ్గా వినను కూడా లేదు.ఎంత ఎగిరిపడిందని-నాకూ అతనికీ సాపత్యమా? ఎం ఎస్ సీ చేసి పీజీ టీచర్గా ఉన్న తనను డ్రాయింగ్ డిప్లొమాతో ఉద్యోగం సంపాదించుకుని ఎంతధైర్యం అదీ ఒక సారిపెళ్ళై భార్య పోయినవాడు అంటూ నానా యాగీ చేసింది.
అయినా అతను నవ్వేసి ఊరుకున్నాడు.
అది తలచుకుంటే ఇప్పుడు సిగ్గుగా వుంది.
కళ్ళకు కమ్మిన పొరలి విడిపోయినట్తుగా వుంది.
"ఒక్కనిమిషం "అంటూ వెళ్ళి కారు తెచ్చి వెనక డోర్ తీసి పట్టుకుని మరీ కారు ఎక్కించాడు.
" రిలాక్స్ అవండి కృష్నా ఇలా సిక్ అయితే ఎలా చెప్పంది"
ఎంత మార్ధవం అతని స్వరంలో
కారు ముందుకు కదిలింది.
" ఒక్క నిమిషం రమణా, కాస్సేపు మీ ఇంటికి వెళ్దామా "
ఆశ్చర్యంగా తలతిప్పి చూశాడు.
" మీ ఇష్టం , కాని అక్కడో కప్పు కాఫీ ఇచ్చే వాళ్ళు కూడా లేరు పైగా ఇల్లెంత చెత్తగా వుందో "
" ఇల్లెలావుంటేనేం " అంది కాని అర్ధం అయింది అతను మళ్ళీ పెళ్ళి చేసుకోలేదన్నమాట.ఇంటి ముందు కారాపి చేయందించి లోనికి తీసుకెళ్ళాడు
హాల్లో కూర్చోబోయిన ఆమెను ఆపి లోపల బెడ్ రూంలో మంచం చూపి " వెళ్ళి కాస్సేపు పడుకోండి కాస్త కాఫీ తెస్తాను " అన్నాడు
వెళ్ళబోతున్న అతని చెయ్యి పట్టుకు ఆపి "  రమణా ఇలా ఈ చేతి సాయం ఎల్లకాలమూ అందిస్తావా? ఆలస్యంగా అడుగుతున్నాను కదూ "
వెంకట రమణకు ఒక్కనిమిషం అర్ధం కాలేదు, అర్ధమయాక మనసు ఆనంద మహార్ణవమయింది.
" పద రమణా ఇప్పుడే ఇప్పుడే వెళ్ళి మనం పెళ్ళి చేసుకోవాలీ"
రెండు గంటల తరువాత పసుపు బట్టలతో ఎదురుగా నిల్చున్న కూతుర్ని చూసి ఏమనాలో అర్ధం కాలేదు తల్లికీ తండ్రికీ.
అయినా అనే అవకాశం ఇస్తేగా రమణను తీసుకుని తన గదిలోకి వెళ్తూ "అమ్మా చూశారుగా నేను రమణను పెళ్ళి చేసుకున్నాను.   మీరే చెల్లాయిల  దగ్గరకు వెళ్ళండి లేదంటే తమ్ముడింటికి వెళ్ళి అక్కడకు రమ్మని నువ్వు చెప్తావా నన్ను చెప్పమన్నావా? అంటూ " మేమిద్దరం కొన్నాళ్ళు ఒంటరిగా ఉండదలుచుకున్నాం ఒకరికొకరం అర్ధం అయ్యే వరకు .. నాకూ నా జీవితం కావాలి.అయినా కొడుకింట్లోనే ఉంటే బాగుంటుంది కదూ " అంటూ అవాక్కయిన వారిని వారి దారిన వదిలేసి రమణ చెయ్యి పట్టుకుని లోనికి తీసుకెళ్ళింది.

**************