నీకు తెలుసా ...........
కృత్రిమత సీతాకోక చిలుకల్ను కత్తిరించుకుని
కాగితపు నవ్వుల్ను పెదవులమీద అతికించుకు
చూపుల గాలాలను తప్పించుకుంటూ
మనసు దరిని ఒరుసుకుంటూ సాగే
మౌన ప్రవాహాల ఉపరితలంపై ఊగిసలాడే
ఉషోదయం తొలి పలకరింపులు
ఇవేనా? ఇవేనా నా చుట్టూ తెరిచి పరచుకున్న పుస్తకాల పుటలు
నిన్నటి చీకటి కీనీడలో
విరగబూసిన ముళ్ళగోరింట పూల గుసగుసలేకాని
ముళ్ళపొదల్లో నిలువెల్లా గాయపడి
రక్తాక్షరాలు స్రవించే
అంతరంగపుటలజడుల జాడైనా తెలుసా నీకు?
కంటి రెప్పల చిమ్నీల మీద
ఒంటిగా ఎదురుచూస్తూ
రాత్రి గుడ్లగూబల ఆహ్వాన హస్తాల్లో
కుండపోతగా కురిసే వెక్కిళ్ళ జడివానలో
సొమ్మసిల్లిన క్షణాలు తెలుసా?
దూరంనించి గూగుల్ భూగోళాన్ననీ
లోలోనకు పాకితే తప్ప
లోయల గుప్పిళ్ళు వీడవనీ
పర్వతాల పందిళ్ళూ రూపూ దిద్దుకోవనీ
ముదురాకుపచ్చ ముద్దమందారపు కొమ్మల్లా
పెళుసనిపించే సౌకుమార్యం నీకేం తెలుసు?
పగిలిన స్వప్న శకలాల్ను ఏర్చి కూర్చి
పునర్నిర్మించుకున్న ఈ జీవన సౌధంలో
ఏపక్క తడిమినా ఆనాటి రాగాలేననీ
నీకు తెలుసా?