ఇప్పుడు కావలసినది
1
ఆగిపోయినది కాలం అనుకుంటాము
కాదు
ఎక్కడి అట్టడుగు అనుభూతులలోతుల్లోనో పాతుకు
పోయిన క్షణానికి
చూపుల తాళ్ళతో మనను మనమే కట్టేసుకుంటాము
పెనుగులాడి పెనుగులాడి ఊడిరాని తలపులచుట్టూ
తిరుగుతూ పోయే గుడ్డి గానుగెద్దులమవుతాము
కాలం కదులు తూనే ఉంటుంది
ఆగని చక్రాలు అమర్చుకున్న యంత్రమై
కాలం సాగుతూనే ఉంటుంది
ఆపలేని ,అడ్డం లేని నదీ ప్రవాహపు ధారలా...
2.
ఉదయపు నీరెండ పలకరింతలు అద్దు కున్న మొహం మీద
ఉండీ
ఉండీ మసకలు బారే మబ్బుల గుంపులు
రాలి పడిపోతున్న నీడల మెరుపుల్లో
తొంగి చూస్తూ వెలసిపోతున్న వెలవెలలు
అసహనంగా ఊపిరాడని ఉక్కపోతలో
ఒక చల్లని మాట వీవన కోసం
బీటలు వారిని భూమి పగుళ్ళలా
లోలోపల ఒక నిలువు పగులు
౩.
ఎవరిచుట్టూ వారు మౌనాన్ని కప్పేసుకు
శీతస్వాపన సుప్తావస్తలోకి జారుకుని
ఎప్పటికో రూపవిక్రయ విధాన ధ్యానంలో
కలల తెరలు దించుకు
పరిమళాలూ పట్టు పరుపులూ స్వప్నిమ్చే క్షణాలు
చిత్రి౦చుకుంటూ
కాలం కాళ్ళకు సంకెళ్ళు వేసామనుకుంటారు
4
ఎందుకిలా సమయాన్ని గాలి బుడగల్లా ఊదిపారేస్తూ
ఈ పిల్లతనపు చేష్టలు
తెరమీద కురిసిన వానవెల్లువలో
ఎందుకలా పరవశాల మయసభలో తత్తరపాటు
తెలుసు కదా
మనకు తెలియదు ఏది మిధ్యో ఏది విద్యో?
కాలం సంగతి మనకెందుకు
మనను
మనం బతికి౦చు కోడం ముఖ్యం కదా
మనకు మనం వేసుకునే శృంఖలాలు విడగోట్టుకోడం
అడికడా ఇప్పుడు కావలసినది.