Friday, November 28, 2008

భక్తీ లేదు-ముక్తీ లేదు

ఆశాపూర్ణా దేవి
ట్రాన్స్లేషన్ --స్వాతీ శ్రీపాద

అనుకోకుండా నా మిత్రుడొకడు మా ఇంటికి వచ్చాడు. లోపలకు అడుగు పెడుతూనే జేబులో చెయ్యి దూర్చి రెండు సినిమా టికెట్లు బయటకులాగాడు.
"వెంటనే తయారవ్వండి" అవి నా చేతికిస్తూ
"శనివారం రాత్రి షో కని ముందుగానె టికెట్లు కొన్నాను. ఎన్నాళ్ళుగానో ఈ సినిమా ప్రకటనలిస్తూనే వచ్చారు. వీటిని పారెయ్యలేక మీకిచ్చిపోదామని ఇంతదూరం వచ్చాను"
నామిత్రుడు ఇలాంటి విలాసాలకు దుబారా చెయ్యడం మామూలే.
"నువ్వే వెళ్ళొచ్చుగా?నిన్ను ఆపిందేమిటి?" సందేహంగా అడిగాను. ఓ పేలవమయిన నవ్వు అతని మొహం మీద కదలాడింది.
"రాత!ఇంకోరోజు రావడానికి సమయమే దొరకనట్టు సమాచారం-అమ్మమ్మ ఇప్పుడో ఇహనో అంటోందట.ఈరాత్రి గడవటం అనుమానమేనని సమాచారం" చెప్పాడతను.
" మీ అమ్మమ్మా?"అయోమయం అనుమానాలతో ఆశ్చర్యం వ్యక్తపరచాను.
" ఆరోజున మమ్ముల్ను పిలిచింది అమ్మమ్మగారి శ్రాద్దానికేగా? కాదూ!"
" అది మా అమ్మమ్మ శ్రాద్దం ఇప్పుడిది మావిడ అమ్మమ్మ సంగతి. ఇదే మాఅమ్మమ్మ అయివుంటే నా కార్యక్రమంలో మార్పే ఊండేదీ కాదు" అని మొహం గంభీరంగా పెట్టి
" ఇహ నేను వెళ్ళాలి .దేవుడు చిన్నచూపుచూసి వాళ్ళింటికి వెళ్ళే లోగా చచ్చిపోయిందో, ఇహ్ నా భార్య నన్ను ప్రశాంతంగా బ్రతకనివ్వదు. ఆవిడ మంచి జరీ చీర కట్టుకునివుంది.ఇప్పుడది ఓ మూలకు విసిరి కాటన్ చీర కడుతోంది. ఈ లోగా నేనిటు పరుగెత్తుకువచ్చాను. కనీసం మీఇద్దరూ సినిమా చూసి నా అత్మకు తౄప్తి నివ్వండి."

కనురెప్పపాటులో గేటుముందునుండి అతని ద్విచక్రవాహనం అదౄశ్యమైంది. నిజానికి అతను ఆనందంగానే జీవిస్తున్నాడు.పెట్రోల్ మీద ఎంత కంట్రోల్ ఉన్నా కలకత్తా ఈ మూలనుండి ఆ మూలకు తిరుగుతూనే ఉన్నాడు కార్ మీద ఏఆర్ పీతో .
ఉచితంగా టికెట్లు దొరకడం నాకు ఆనందాన్నిచ్చిన మాటకాదనలేను.
నాభార్యకు సినిమాపిచ్చి. దానికి తోడు ఈ సినిమాలో మహామహులైన నటీనటులు ఉన్నారని పొగుడుకోతం ఇదివరకేవిన్నాను. ఈ సినిమాకి వెళ్దామనగానే ఆవిడ ఎగిరి గంతేస్తుందని నాకు బాగా తెలుసు.
ఇద్దరం కలసి సినిమా చూడటం ఈ శనివారం సరదాగా గడపటమే.
నా సెలవలన్నీ ఎలా గదచి పోయాయో నాకు తెలీనేలేదు. ఖాళీ సమయం అంతా బియ్యం, గోధుమలు, పంచదార ,బొగ్గులు లాంటి అపురూప వస్తువులు వేట లోనే సరిపోయింది.
కానీ గాక.
ఇలాంటి కుటుంబ సమస్యలు వెయ్యిన్నొకటి చెప్పగలను. వాటికో అంతముండదు. నిజానికి అవి విషాద సముద్రాన్నీ కల్లోలపరుస్తాయి.
అదీగాక విషాదగీతాల్ను వినే తీరిక ఎవరికుంది గనక?
ప్రతివాళ్ళు ఎవరివంతు ఖర్మ వాళ్ళు అనుభవిస్తూనేవున్నారు.నా భార్య అంటూనేవుంటుంది-"ఎవరిక్కావలసింది వాళ్ళు పొందుతూనేవున్నారు నువ్వు తప్ప అని.

అయితే మావిడకీమాట చెప్పేందుకు నేనే మాత్రం వెనక్కి పోను- నిజం చెప్పాలంటే ఇలాంటి రకరకాల మోతాదులకు నేనెప్పుడో అలవాటు పడిపోయాను.
ఇప్పుడీ క్షణం ఈ రాత్రి ఇద్దరం కలసి సినిమాకు పోవడం గురించి మావిడ ఏమంటుందో ఊహించుకోడం మొదలెట్టాను.
ఆనందం పొంగి పొర్లుతుండగా స్టోర్ రూం దగ్గరకు వెళ్ళి తొంగిచూసాను.ఆ గది తలుపుకి ఓ పెద్ద తాళం కప్ప.
హడావిడిగా మాగది లోకి వెళ్తే- ఎదురుగా ఆవిడ చీర సింగారిస్తోంది.
నేను నవ్వుకున్నాను.మామాటలన్నీ చాటుగా వినేసి ఉంటుంది.

శాంతిపురి చీర మడతలు విప్పుతోందావిడ. ఎక్కువ వ్యవధి లేకపోవడంతో పెద్ద భారం తగ్గినట్టు నిట్టూర్చాను.ఎవరో భుజం తట్టి అనుసరిస్తున్నట్టుగా నా మొహంమీద ఓ పెద్ద దరహాసం.
" సరే, తయారవడం చాలా మంచి పని. ఈ రాత్రి డబ్బుఖర్చు లేకుండా సరదాగా గడుపుదాం. శెశెర్ దావి మొదటాట సినిమా చూసొద్దాం."
" ఏం మాట్లాడుతున్నారు? డబ్బుల్లేకుండా ఈరోజున సరదాగా ఎలా గడపగలం?" కీచుమందామె స్వరం.
"నిర్మల్ రావడం రెండు సినిమా టికెత్లు ఇవ్వడం నువ్వు చూడలేదా?" కాస్త అడిగాను.
"మరింకేం పనీ పాటా లేనట్టు ఇరవై నాలుగ్గంటలూమీ మాటలు వింటుంటాననుకున్నారా? మీ మిత్రుడి ఎక్కడయినా రెండు సంచుల బొగ్గులు దొరికాయామీ పట్ల ఇంత ధాతౄత్వాన్ని ప్రదర్శించాడు?" భళ్ళుమందామె.
"కావొచ్చు. మరి నీజరీ అంచుచీర సింగారింపుకు కారణమేమిటో "
" హరిబాబు ఇంట్లో పూజ ఆంటీ స్వయంగా వచ్చి మరీ పిలిచారు"
"మరీ టికెట్ల మాటో?" కాస్త విషణ్ణంగా అడిగాను.
" టికెట్ల గురించి నేనేం చెప్పను?" నిర్లక్షంగా జవాబిచ్చింది.
" బయటకు విసిరెయ్యనా?" సినిమాకు రప్పించాలని ఒప్పించే ప్రయత్నంగా అన్నాను.
"మరిగదారేదీ? సత్యనారాయణ పూజ వదిలి సినిమాచూసి నేను పాపకూపంలో మునిగి పోవాలనా మీ ఉద్దేశ్యం? మీ మిత్రుడికి టికెట్లివ్వడానికి మరో సమయమే దొరకలేదా? " అందామె.
చీర కట్టడం, రెండు మూడు సార్లు తలదువ్వుకోడం,మొహానికి క్రీం రాయడం అయాక నుదుటన బొట్టుబిళ్ళ అతికించుకుని విప్పిన చీర కొంగునుండి తాళాల గుత్తి తీసుకుంటూ,
" ఎందుకంత విచారంగా కూర్చున్నారు?" కట్టిన చీర కోంగుకు తాళాలగుత్తి ముడి వేస్తూ,
"సినిమాకు మీరు వెళ్ళొచ్చుగా?మీరొక్కరూ వెళ్ళొద్దని ఎవరూ అనలేదుగా?" అంది ఓదారుస్తున్నట్టు.సినిమాకు ఒంటరిగా వెళ్ళమని ఆమె సూచించటం ఇదే మొదటి సారి.ఒకవేళ పూజకు వాళ్ళ ఆంటీ ఆమెనొక్కదాన్నే పిలిచివుండకపోతే నేనొక్కడినే సినిమాకి వెళ్ళడం మీద ఎంత రాద్దంతం జరిపేదో?
" నేనెలాగూ ఇంట్లో వుండను, ఒక్కళ్ళు బిక్కు బిక్కు మంటూ ఉండేకంటె సినిమా చూసి రావడం టైం పాస్ చేసెందుకు ఉత్తమం కద"
ఈ క్షణం లో నా భావాలకు రూపమిస్తే ఈ సామరస్యత చెడగొట్టు కోవడమే.
స్వరాన్ని మార్ధవంగా మారుస్తూ, " నువ్వు పక్కన లేకుండా సినిమా చూడటం నాకే మాత్రం ఆనందాన్నివ్వదు" అన్నాను.
" పిచ్చిగా మాట్లాడకండి. ఇష్టమయితే సినిమాకు వెళ్ళండి, లేదూ ఇంట్లోనేవుండంది.వంటమనిషిని మాత్రం వేచి వుండమనకండి"
" ఏం? నువ్వు తినవా?" అడిగాను.
" ఆంటీ వాళ్ళింట్లోనే నా భోజనం, డిన్నర్ తినకండా ఆంటీ నన్ను రానివ్వకపోవచ్చు. ఈరోజు వాళ్ళకొత్తల్లుడు వస్తున్నాడు. అంటే లిల్లీ భర్త. వాళ్ళ సంబరాల్లో పాలుపంచుకోమని ఆంటీ చెప్పింది."
దానర్ధం సత్యనారాయణ వ్రతం ఆవిడ ముఖ్య ఉద్దేశ్యం కాదు. ఆమె ఆంటీకి బాగా తెలుసు ఈవిడ తెలివైనది , చతురురాలు హాస్యంగా మాట్లాడుతుంది చక్కగా పాడుతుంది అని.
"ఇంకో ఆడమనిషి మొగుడితో సరదాగా గడిపే అవసరమేమిటి?" ఆవిడ ఉద్దేశ్యం మార్చే ప్రయత్నంగా అన్నాను.
నిజం చెప్పాలంటే ఈవిడ స్వంత డబ్బా కొట్టుకోవలనే ఈవిడ కోరిక నాకేమాత్రం రుచించదు.
" నీ మొగుడితోనే సరదాగా..."
ఆవిడో కోర చూపు విసిరి నిర్లక్షంగా బయటకు కదలడంతో మధ్యలోనే ఆపేసాను.
సినిమాకి వెళ్ళాలనే నా కోరికా చివికి పోయింది. మొదట టికెట్లు వంటమనిషికి ఇచ్చి ఇంట్లో ఒంటరిగా వుండిపోదామనుకున్నాను.అంతలోనే మరో ఆలోచన నా నిర్ణయాన్ని మార్చుకున్నాను. కారణం నాలో మగతనం ఎదురుతిరిగింది. నా భార్యకు నా ఓటమి ఎందుకు తెలియనివ్వాలి? నా సమస్యలు కష్టాలు లెఖ్ఖచెయ్యకుండా ఆమె వేరే వాళ్ళతో సరదాగా గడుపుతుందా ? ఆవిడ మాటలకు నేనెందుకు టాళం వెయ్యాలి? మేం , భర్తలం మా పెళ్ళాల కోరికలకు మా అభిరుచులు చక్కని ప్రవర్తన గాయపడినా మన్నిస్తము.
ఇప్పుడు మాత్రం ఆవిడ పక్కన లేకున్నా నా స్నేహితులతో ఆనందించగలనని చూపాలి. నా మోటర్ సైకిల్ తీసుకుని నా ఆలోచనలను ఆచరణకు అనువదించే కార్యక్రమంలో నా మిత్రుడు అబాని ఇంటికి బయల్దేరాను. అతని భార్య చాలా అందంగా ఉంటుంది.అందుకే ఆవిడంటే నా భార్యకు ఓరకమైన అసూయ. నాభార్య ఈర్ష్య ను రగిలించే ఉద్దెశ్యంతో ఇంకోటికెత్ కొనడానికి ఎంత ఖర్చు పెట్టాల్సి వచ్చినావెనుకాడ కుండా అబాని ని అతని భార్యను సినిమాకు తీసుకు వెళ్ళాలనే నిర్ణయానికి వచ్చాను వాళ్ళిద్దరినీ సినిమాకు ఆహ్వానించటమే కాదు వాళ్ళని టాక్సీ లో తీసుకువెళ్ళి రాచ మర్యాదలూ చేస్తాను. ఐస్ క్రీం, ఆలూ చిప్స్ మొదలయిన వాటితో సినిమా ఆనందాన్ని అనుభవించేలా చేస్తాను.
ఇవన్నీ ఆబాని భార్య ఎంత ఆనందంగా తిని అనుభవించిందో నా భార్యకు సవివరంగా వర్ణించి చెబుతాను.

నా ఉద్దేశ్యాన్ని భగవంతుడు మరోలా భావించాడు.
" ఈ రాత్రికి సినిమా చూసే రాత మాకు లేదు. నేనూ రెండు టికెట్లు తెద్దామని ప్రయత్నించా , తేలేక పోయాను. ఫ్మొట్ట మొదటి రాత్రి ఆటకే వెళ్ళాలని నా భార్య పట్టు బట్టింది. ఆవిడకు మొదటి ఆటే కవాలి. దురదౄష్టం ఏమిటంటే నా కొడుకు మెట్ల మీంచి పడిపోయి నుదుటికి గాయం చేసుకున్నాడు.ఆయొడిన్ , కాటన్ తెచ్చేందుకు వెళ్తున్నా .. నాక్కాస్త ముందే చెప్పుంటే..."
చివరి మాటలు ఏ విధంగా చెప్పాడంటే ముందేగనక అతనికి చెప్పుంటే అతని కొడుకు నుదుటికి గాయం చెసుకునేందుకు తడబడే వాడన్నట్టుగా....
ఆబాని ని మనసులోనే శపిస్తూ నిఖిలేశ్ ఈంటి వేపు బయల్దేరాను.
అతని భార్య పెద్ద అందగత్తె కాక పోయినా చదువుకున్నదనే పేరుందామెకి. ఆవిడ చదువు మావిడకు కంటీ మంటగా ఉన్నా ఆవిడ తో మాట్లాడటం నాకు ఆనందంగా ఉంటుందనే చెప్పాలి.
నా ప్రతిపాదన విన్నాక నిఖిలేశ్ అభిమానంతో కరిగి పోయాడు.
" నా భార్యకు ఫిట్స్ రాకపోయివుంటే సినిమాకు సంతోషంగా వచ్చే వాళ్ళం" అన్నాడు.
'ఏమైందావిడకు?" నిరాశ పడుతూ అడిగాను.
" మా అమ్మ తో పోట్లాట.దాని వల్లే ఆవిడ కు ఫిట్స్.ఈ మధ్య మా అమ్మకు బొత్తిగా వివేకం లేకుండా పోతోంది"
" నీ చావు నువ్వు చావు" మనసులోనే అనుకున్నాను.
కోపంతో మరిగిపోతూ శశాంక ఇంటికి బయల్దేరాను. శశాంక భార్యకు చదువు అందం లాంటి లక్షణాలేమీ లేవు.అలగని పెద్ద ఆకర్శణీయంగానూ ఉండదు. అదౄష్టం నన్ను నిజంగా విడిచి పెట్టేసింది.నీళ్ళల్లో దూకే చేప
పాటి కూడా మిగల్లేదు.
" మీతో సినిమాకు రావడం మాకు గొప్ప సంతోషమే , కాదంటే నువ్వింత దుష్ట సమయాన వస్తావని అనుకోలేదు" అన్నాడు శశాంక.
"ఏం జరిగింది?" నా ఆదౄష్టాన్ని నిందించుకుంటూ అడిగాను.

శిబ్ పూర్ నుండి మా పెద్దన్నయ్య అత్తమామలు వచ్చారు. వాళ్ళకళ్ళ ముందే నాభార్యను తీసుకుని బయటకు రావడం బాగుండదు కద!" చెప్పాడు.
" నీ భార్యను నువ్వు తీసుకుని వెళ్ళేందుకు ఏం అడ్డం పడుతోంది? " అతని తో వాదించాను
'మరొకరి భార్యను బయటకు తీసుకెళ్తే సమస్యలు రావచ్చు కాని , మీ పెద్ద వదిన ఇంట్లో లేరా వాళ్ళని చూసుకుందుకు?"
" ఆవిడ ఇంట్ళోనే వుంది కాని వాళ్ళతో మాటల్లో మునిగి పోయారావిడ దాంతో వాళ్ళా మాంచి చెడు చూడాల్సిన బాధ్యత నా భార్య మీద పడింది. అందరు బెంగాలీ కుటుంబాల్లొ ఇది సర్వ సాధారణమే. అదీ గాక నా భార్య గురించి మాకుటుంబం లో ఎవరు వేలెత్తి చూపినా నేను సహించలేను"
నీరసించి పోయి నేను మళ్ళీ నా మోటర్ బైక్ ఎక్కి కమలాక్షు ది ఇంటి వైపు పోబోతుంటే నా వెనక నుండి శశాంక
" మా గZడియారం సరిగ్గా పని చెయ్యట్లేదు.బహుశా తిమె లేదల్లేలా వుంది"
అతని హెచ్చరిక నే చెవిన పెట్టలేదు. యుద్దం గురించిఉపన్యాసాలు యుద్ధ దౄశ్యాలు అయిపోయినా చింతలేదు. కమలాక్ష మంచి అనుచరుడు. అతనో న్యాయ వాది, ఇంకా ప్రాక్టీస్ లో పుంజుకోలేదు. పెళ్ళికూడా కాలేదు. నాతో సినిమాకి వచ్చేందుకు అతనికెలాంటీ అడ్డంకులు కలిగించే వాళ్ళు లేరు. ఒఓ కుర్తా పైజామా తగిలించుకు రావడమే. అసలు సమస్యల్లా ఇంట్లో ఉంటాడా లేదా అన్నదే!
ఇంట్లోనే ఉన్నాడు. నా ఆర్తనాదం విని బయటకు వచ్చాడు. , అతని పని వాణ్ణి పిలిచి నా బైక్ సరిగ్గా తీసి పెట్టమని ,నన్ను తనే లేవ దీసాడు.
" ఏం జరిగింది? మోటర్ బాఇక్ ఇంత పిచ్చిగా నడుపుతూ రావలసిన అగత్యం ఏం వచ్చిపడింది?ఈ ముసలి వయసు లో
కాలు విరగ్గొట్టుకున్నావు. గాయాలయాయా?'
" అవును. విరగ్గొట్టుకున్నాను" విసురుగా అన్నాను.
"నిన్ను పట్టుకుందామని వచ్చాను. నీ ఇంటి ముందున్న ఆ స్పీడ్ బ్రేకర్ లాంటి దిబ్బ ఎక్కబోయి పడ్డాను. .మరీ అంతెత్తున కట్టుకోడం నేరమే"
" నిజమే అలా కట్టూకోడం నిజంగా నేరమే! రేపే దాన్ని విరగ్గొట్టిస్తానుకాని నాలాంటి బీదవాడిని వెదుక్కొంటూ రావలసిన అవసరం నీకేమొచ్చింది? నీ పెళ్ళాం పుట్టింటికెళ్ళిందా? లేదా ఆమెతో తగువు పడ్డావా?"
" నా విషాదగాధ విని నువ్వేంచేస్తావులే? ఓ రిక్షా పిలిస్తే బాగుండు కద?"

నా భార్య చాల ఆలస్యంగా వచ్చిందా రాత్రి. నేను కప్పుకుని పడుకుని ఉండటంతో " ఒంట్లో బాగాలేదా ?" స్వరంలో ఆత్రుత వ్యక్త పరుస్తూ అడిగింది.
నేనామె ప్రశ్నకు జవాబివ్వకుండా "ఇంత ఆలస్యమయిందేం"అని అడిగాను
ఆమె నవ్వింది-ఓ ఇబ్బంది కరమైన నవ్వు.
జరగవలసిందాన్ని తప్పించుకోవడం మనిషి తరమా ?
నేను హరిబాబు ఇంటికి వెళ్ళే సరికి వాళ్ళ కొత్తల్లుడు మా అందరినీ సినిమాకి తీసుకువెల్ళే ప్లాన్ లో ఉన్నాడు. టికెట్లుకూడా తెప్పించాడు. సినిమాకు వెళ్ళేందుకు గేట్ వద్ద కార్ ఎదురు చూస్తోంది.ముందు నేను రాననే అన్నను కాని మా ఆంటీ అస్సలు వినలేదు."
ఆవిడ దర్జాగా హాల్ లో కూర్చుని బంధుజన పరివారంతో సినిమా చూసే సమయంలో నేను ఇంటింటికీ పిచ్చి కుక్కలా, జేబులో రెందు మొదటి తరగతి టికెట్స్ జేబులో పెట్టుకుని మరీ స్నేహితులవెంట వారి పెళ్ళాలను వెంటేసుకుని నాతో సినిమాకు రమ్మని బలవంతపెడుతూ తిరిగాను.
నా భార్యనుంచి చూపులు తిప్పుకు "సత్యనారాయణ వ్రతం మాటేమిటి?" అని అడిగాను
"సత్యనారాయన గురించి హాస్యమాడటం ఎందుకు?"
"ఆంటీ పూజారి సినిమా చూసేందుకు రాలేదు.తిరిగొచ్చాక పూజ కానిచ్చి ప్రసాదం పుచ్చుకున్నాం. తరుచాత అద్భుతమైన విందు ఆటపాటలూ..కొత్త జంట కబుర్లు వినేందుకు సాతు థాకుర్పో పైనించి కిటికీ వరకూ ఓ తాడు కట్టాడు.అంకుల్ అతను తాడు మీద వేళ్ళాడ్డం పసిగట్టాడు. ఇదంతా ఎంత వినోదకరంగా వుండిందనీ?"
ఆమె హౄదయం తౄప్తి పడేలా వినోదాల వల్లరిని అభివర్ణించింది నా భార్య. ఆమె సుఖ సంతోషాల నిలయంగా కనిపించింది. సత్యానారాయాణ దీవెనలకు కౄతజ్ఞతలు ఆమే వినోదాల వ్యాహ్యాళి చేసి వచ్చింది.
"మరి నా మాటో? నరకంలో ఓ పురుగు. నాకు భక్తీ లేదు. మోక్షమూ లేదు.
దాని కోసం ఆశ పడటమూ లేదు. ఆమె మీద్ ప్రతీకార వాంఛ లోలో పల పెంచుకున్నందుకు సిగ్గు పడ్డాను.
చీర మార్చుకుని పాన్ డబ్బాతో వచ్చి మంచం పట్టి మీద కూర్చుంది.
" మీరు సినిమా కెళ్ళారా? " సౌమ్యంగా అడిగింది.
"వెళ్ళాను " చెప్పి మరో వైపు తిరిగాను.
" వెళ్ళారా? మంచి పని చేసారు! అప్పట్నించీ పడుకునే ఉన్నారనుకున్నాను. మీరు మరీ బద్దకస్తులు కదా, సినిమా బాగుందా? మంచి సినిమా కదూ!?" చెప్తోందామె.
"అవును" అంటూ దుప్పటీని పసుపు రాసుకున్న నా కాలి మీదకు లాక్కున్నాను.

దొమ్మరి పిల్ల

బుడి బుడి నడకల బాల్యం బూరుగుదూదిలా
ఆకలి తాపాల్లో వేడిగాలి ఊపిరి
నడివీధుల చూపులకుముడివేసిన
వినోదం ఉలిపిరి దారంమీద
వయ్యారం అడుగుల సొబగుల్ను
ఆకసం వీధివెంట మళ్ళిస్తూ
బక్కచిక్కిన వెన్నెల తునకలా
మునివేళ్ళసంగీతాల్ను మీటుతూ
చూపుల అభ్యర్ధనల్తో
గుండె గుండెనూ తట్టి పిలుస్తూ
దిగంతాల పరదాల మీద తోలు బొమ్మై
నవ్వులు రువ్వే దొమ్మరిపిల్ల

మనసు దోసిళ్ళనిండా తేనె వాకల్ను నింపుకు
వీధి వీధంతా మధురిమల్ను నింపుతూ
అపాయం అంచుల మీద వెలుగుల వరూధినిగా
బాల్యం లోగిళ్ళలో వినోదాల వేలం పాట

అమ్మ కొంగు చాటున
మురిపాలు గరపాల్సిన ముద్దు పాప
ముచ్చటగా తాడెక్కి మునివేళ్ళ చివర్న
అలవోక వయ్యారాల చంద్రవంకై

వరద గోదావరి పల్లవించిన ఆమె వదనం
అనీమియా పీల్చేసిన అధర యుగళం
గాలి ఊయల్లో గంతులేసే గుండెగుసగుసలు
పుస్తకాల వనాల్లోనో బాల్యం పూపొదరిళ్ళలోనో
తొక్కుడుబిళ్ళాదుకునేవయసు
రంగుమాసిన గోడల్నెక్కి
పొగమంచు మసక వీధుల్లో
నదీనదాల్ను చూపులుగా మార్చి
ఆశల నక్షత్రాల్ను చెక్కిళ్ళ పై జాలువార్చి
చీకట్నించి, చీకట్లోంచి , చీకట్లోకి
సుధీర్ఘ ప్రస్తానంగా
వినోదాల పూలవల్లరిగా తోచే మౄత్యు మార్గం మీద
వెన్నెల పువ్వులా ధవళా హాసాల్ను రువ్వే
నవ్వుల ఊరేగింపుగా
దొమ్మరి పిల్ల.

శిశిరంలో వసంతం

మాటలగుండా ప్రవహిస్తూ
నిశ్శబ్ద భావాల్ను సవరిస్తూ
వినువీధి కంటి కొసల్లో
మెరుపు తీగల హొయలుప్రసరిస్తూ
అంతరంగపు యవనికపై
అలల్లా కదిలే చిత్రవిచిత్రాలు

ఏ మూలనుండో ఓపులకింత
రెక్కలు కట్టుకువాలి
అదౄశ్య సందేశాల్ను చూపుల అంచులమీద
మోసుకు వస్తూనేవుంటుంది

అనుభూతి తొలకరి స్వప్నపు తునక
జీవనసంధ్యాకాశం నిండా
చుక్కలరంగవల్లికల్ను
తీర్చిదిద్దుతూనేవుంటుంది
అడుగడుగునా మమతల సువాసనల్ను
గుభాళిస్తూనేవుంటుంది.

సుషుప్తిలొ మైమరచిన చైతన్యాన్ని
కొనగోట చెక్కిళ్ళుమీటి
అలవోక సౌఖ్యమో అలౌకికమో
అనువదించుకోలేని పారవశ్యపు వాకిలి ముందు
మౌనరాగాల్ను పలవరింతలుగా
చెక్కుతూ పొయేవేళ

ఒద్దికగా జీవితం పుటల మధ్య
సస్నేహ వీచికల సౌరభాల్ను
పరిరక్షించుకుంటూనే వుంటాను
కాలం ఓడిపోతూ వెనక్కు తిరిగి
పరుగెడుతూనేవుంటుంది.

సంకోచం

మాటా మంతీ సవ్యంగానే సాగిపోతాయి
ఎక్కడా మన్ననకు ఏ లోపమూ రాదు
మీరు గారంటూ గౌరవం పలకరిస్తుంది
వచ్చిన చిక్కల్లా
నిరంతరం వలవిసిరి పొంచి చూస్తూ
రెక్కలింకా మొలిచీమొలవని
నా ఊహ పసిగుడ్డు పావురాయిని
వ్యామోహం వలలో ఇరికించాలన్న
అనవరతపు తపనే
అక్కడా ఇక్కడా కాకుండా
చూపుల అణువణువునా చిందులేస్తూ
ఇబ్బంది పెడుతూంటూంది
నాగరికత మాస్క్ తగిలించుకున్నా
జీవనదీ ప్రవాహపు కోర్కెలు
కొనవేళ్ళ చివరల్న చివురిస్తూ
కాస్తంత భయం భయంగా
నత్త నడకై సాగే స్పర్శ గొంగళి పురుగై
మనసంతా పాకి పాకి
మరింత ఇబ్బంది కలిగిస్తుంది.
ఉపేక్షించే కొద్దీ మౌనం సహనంగా కాక
అర్ధాంగీకారమనుకొంటూ
మాటల రహ దారుల్ను వదిలి
పరిధుల నతిక్రమిస్తూ
వెన్నెల పలకరింపుల్ను వక్రీకరిస్తూ
కనుసన్నల వాకిళ్ళ బయట
కాపలా కాసే మౌన విన్నపాల రాయభారాలు
అశ్లీల చిత్రాలై జుగుప్స కళ్ళు విప్పుతుంది
కుంచించుకు పోయిన మనసు
సంకోచిస్తూనేవుంటుంది
సంకోచిస్తూనేవుంటుంది.

సముద్రం పోయిందండి

నేలంతా పరచుకున్న
అలల కొంగు దారంతా
జిలుగు రవ్వలు పొదుగుతూ
ఉదయపు సూరీడు
మగ్గం పనికెక్కక ముందే
జీవితాన్నిభుజాన వేసుకు
ఒంటిరెక్క నావెక్కే వాస్తవం
ఉషోదయం గమకాల
ఆటుపోట్ల మధ్య
క్షణాల్నూ గంటల్ను కలనేసి
పడుగుపేకల అల్లికలో
కాలాన్ని రూపాయలుగా మార్చుకునే
వ్యాపారానికి తెరదింపుతూ
సముద్రం పోయిందండి
గోడల వెనక్కి
స్వార్ధం జాడల నీడల్లోకి
వేనవేల్ జీవితాల్ను
అనిశ్చయతకు వేళ్ళాడదీసి సముద్రం పోయిందండి.

వెలుగంతా దోచేసుకు కనుకొలుకుల మూలల్న
చావు దీపం వెలిగించుతూ
గాజు కళ్ళ పొడి నెగళ్ళ వెనక్కు
సముద్రం పోయిందండి.
ఉదయం వెలుగు జల్లులు పన్నీటి చినుకులై రాలుతూనే
ముంగిట్లో రంగుల హరివిల్లుల్ను బంధించి
పని రధాన్నెక్కి ఊరేగే
సీతాకోక చిలుకల రెక్కల్ను విరిచి
కాళ్ళుండి కుంటిదైపోయిన భవిష్యత్తు రేపట్లోకి
చ్హివికిన చీకటి కుప్పలా విసిరి
సముద్రం పోయిందండి.

సముద్రం కదలికల మీద వ్రాసుకున్న
తరతరాల జీవితాల్లోకి పెరుగుదల
పలకా బలపం స్థాయిని వీడకముందే
మాయల మరాఠీ కథల వైచిత్రిలా
శూన్య వలయాల్ను విసురుతూ
హఠాత్తుగా సముద్రం అదౄశ్యమై పోయింది.

ఊయల్లో ఊగేపిల్ల
మరో ఇంటి వెలుగయే తీరు
ఇంకా చంకొదలని చిన్నది
పిల్లలకోడిగా మారే రహదారి
జానెడు గుడ్డ ముక్కతో అపురూప ప్రపంచాల్ను
మనసు గుప్పిట దాచుకునే మహత్తర
పధకం ఇంకా రూపైనా దిద్దుకోలేదు
అన్నింటికీ అసలు పునాది
మా అరచేతి స్వర్గం సముద్రం పోయింది.
మాఉనికేమాయమై పోయింది. మా రేపు శూన్యమై పోయింది
మాజాతి వట్టి పోయింది.
{గంగవరం మత్స్యకారుల ఆవేదన}

మాట

మౌనం పేగు తెంచుకు పుడుతూనే మాట
మౌనం పేగు తెంచుకు
పుడుతూనే మాట
శతావధానం చేస్తూ
పరుగిడుతూనేవుంటుంది
ఉల్కాపాతపు వెలుగుల వేగాన్ని
అరువడిగి
అనవరతం సరిగమల్ను పాడేసరిత్తై
గలగలల్ను ఒలకబోస్తూనేవుంటుంది

పెదవుల గడప దాటుతూనే వెర్రితలలు వేసె ఆధునికత
నిలువెల్లాఅలదుకుంటూ మోకాళ్ళపైకీ బొడ్డుకిందకూ
దిగజారి నడుం కొలతల్ను సవరించే
జీన్స్ క్యాప్రి పిల్లై
రోడ్డున పడి దొర్లుతుంది
మరో వంక
పాలూ తేనెల మధురిమలో ముంచి
వెన్నెలవాకలో ఆరబెట్టిన
పటిక బెల్లం ముక్కలాంటి
మధురిమల

రుచుల సవ్వడుల్ను
నాలుక కొనగోట మీటుతూ
పలుకు వంపుల్లో పరిమళాలు గుప్పిస్తూ
వయ్యారాలు సవరించుకునే
మాట సిగ్గుల మొలకై
తడబాటు అడుగుల్తో
తత్తర పడుతుంది

మాటకు యుద్ధాలూ వచ్చు
కత్తులూ కటార్లే కాదు కనిపించని
భావావేశాల్ను లేజరుకిరణాలుగా
రోగగ్రస్త వ్యవస్త
మొదలంటా చితిపేరుస్తూ
చరిత్ర రెక్కల్ను కత్తిరించి
కొత్త మలుపులకు అట్టలేసుకుంటూ
మాట నిర్లజ్జగా బజారున పడి
ఏ తలపట్లకైనా సిద్ధ మవుతుంది
కిరీటం లేని మహారాణిలా
మాతా సామ్రాజ్యాల నేలుతుంది.
రాజముద్ర అంగుళీకంతో
అలికే అక్షరాల అయోమయపు
అధికారమూ అవుతుంది.
మాట రూపంలేని నీటి మూట
ఆకారం లేని నోటిపాట
మనుషుల చేతుల్లో
రూపాలు మార్చుకునే మైనపుముద్ద
అయితే నాకు మాత్రం
మాట మంత్రాక్షరం
అపురూప రతనాల వారసత్వపు కోట
మాట నా ఉనికి, నా ఊహ
నాఅస్తిత్వం
అందుకేమాట నాకు ఆది గురువు
అమృతపు నెలవు.