మౌనం పేగు తెంచుకు పుడుతూనే మాట
మౌనం పేగు తెంచుకు
పుడుతూనే మాట
శతావధానం చేస్తూ
పరుగిడుతూనేవుంటుంది
ఉల్కాపాతపు వెలుగుల వేగాన్ని
అరువడిగి
అనవరతం సరిగమల్ను పాడేసరిత్తై
గలగలల్ను ఒలకబోస్తూనేవుంటుంది
పెదవుల గడప దాటుతూనే వెర్రితలలు వేసె ఆధునికత
నిలువెల్లాఅలదుకుంటూ మోకాళ్ళపైకీ బొడ్డుకిందకూ
దిగజారి నడుం కొలతల్ను సవరించే
జీన్స్ క్యాప్రి పిల్లై
రోడ్డున పడి దొర్లుతుంది
మరో వంక
పాలూ తేనెల మధురిమలో ముంచి
వెన్నెలవాకలో ఆరబెట్టిన
పటిక బెల్లం ముక్కలాంటి
మధురిమల
రుచుల సవ్వడుల్ను
నాలుక కొనగోట మీటుతూ
పలుకు వంపుల్లో పరిమళాలు గుప్పిస్తూ
వయ్యారాలు సవరించుకునే
మాట సిగ్గుల మొలకై
తడబాటు అడుగుల్తో
తత్తర పడుతుంది
మాటకు యుద్ధాలూ వచ్చు
కత్తులూ కటార్లే కాదు కనిపించని
భావావేశాల్ను లేజరుకిరణాలుగా
రోగగ్రస్త వ్యవస్త
మొదలంటా చితిపేరుస్తూ
చరిత్ర రెక్కల్ను కత్తిరించి
కొత్త మలుపులకు అట్టలేసుకుంటూ
మాట నిర్లజ్జగా బజారున పడి
ఏ తలపట్లకైనా సిద్ధ మవుతుంది
కిరీటం లేని మహారాణిలా
మాతా సామ్రాజ్యాల నేలుతుంది.
రాజముద్ర అంగుళీకంతో
అలికే అక్షరాల అయోమయపు
అధికారమూ అవుతుంది.
మాట రూపంలేని నీటి మూట
ఆకారం లేని నోటిపాట
మనుషుల చేతుల్లో
రూపాలు మార్చుకునే మైనపుముద్ద
అయితే నాకు మాత్రం
మాట మంత్రాక్షరం
అపురూప రతనాల వారసత్వపు కోట
మాట నా ఉనికి, నా ఊహ
నాఅస్తిత్వం
అందుకేమాట నాకు ఆది గురువు
అమృతపు నెలవు.
No comments:
Post a Comment