Monday, January 30, 2012



కాలం ఆగిపోయినా.........


కాలం ఆగిపోయింది
మనం మాత్రం పరుగెడుతూనే ఉన్నాం
పచ్చని ఇత్తడి పళ్ళెం మీద
కాటుక మసి పోగయినట్టు
ఈ రాత్రి ఇంత చీకటి పొగ గుప్పు గుప్పున వదిలుతుంటే
తడిసిముద్దైపోతూ  నిశ్శబ్దం
ఒదిగిఒదిగి తమలో తాము దాగిపోతూ నగ్న వృక్షాల
వాలిన తలలు
కాలం ఆగిపోయింది
మంచుతుప్పరలు పుక్కిలిస్తున్నశిశిరం చలి రాత్రి 
వజ్రపు తునకలూ తళుకు టద్దాలూ
కుట్టిన సరిగంచు మేలిముసుగు
చలినెగళ్ళ చిటపటలను సవరిస్తూ
చలికాచుకుంటూన్న వేలికొసలను లాలిస్తూ...........
కాలం ఆగిపోయింది
పున్నమి చల్లదనాన్నద్దిన వేసవి నడి ఝాములో
చుక్కల తో పోటీ పడుతూ మిణుగురు వెలుగులు
నింగీ నేలల మధ్య పచార్లు చేస్తున్న క్షణం
కాలం ఆగిపోయింది.
కెంపులు వెదజల్లిన హేమంతపు కనకాంబరపు హేలలో
కనురెప్పలు వాల్చి విశ్రాంతి బాహువుల్లోకి
చల్లగా జారుకుంటున్న అసుర సంధ్య వేళ
రేపటికి ఆశలను వేళ్ళాడదీసి నిరీక్షణ
రెప్పవాల్చని వేళ కాలం ఆగిపోతుంది
అయినా కలం మాత్రం
అవిశ్రాంతంగా సాగిపోతూనేఉంటుంది
ఊపిరి సహకరించే వరకు

పొగమంచు చూపులో

మసకబారిన  చూపు
పొగమంచు నడి సముద్రాన
విషాదపు సుడి గుండానికి బలై
సుళ్ళుతిరుగుతూ మనసు మసకబారింది.
కళ్ళెత్తి నవ్వినా జలజలా రాలిపడే
కన్నీటి కొవ్వొత్తులను పిడికిళ్లమధ్య దాచుకున్నా
గాయపడి విలవిలలాడే హృదయం స్రవించే అదృశ్య రక్తాశ్రువులు
నిశ్శబ్దంగా బడబాగ్ని విరజిమ్మే అణ్వస్త్రాలను సంధించటం
మసకబారిన మానవత్వపు ఆటవిక వేటేగా
అనాదినుండీ ఆధునికతవరకూ పరచుకున్న
ఈ అనాగరికతకు భరతవాక్యంగా
ఎక్కడో అలలనడి ఒడ్డున విరిగిపోయిన స్వాప్నిక జగత్తులో గాయపడి గేయాలయే
 తలపుల తపనలకు
ఏ జ్ఞాపకాల తపస్సమాధిలో నో సతమతమయ్యే
వేలాది జీవచ్చవాలకు
ఇవ్వరాదూ రెండు అశ్రు తర్పణాలు
ఒక్కోసారి తెరిచిన కళ్లముందు
దృశ్యాలు అలుక్కు పోయి ప్రతిదీ అస్పష్టమే అయినప్పుడు
మనఃస్థిమితం లేని భ్రమల మధ్య
చూపానని దూరాలకు సాగాలన్న
నేల విడిచి పరిభ్రమించే దౌర్భల్యాలకు దూరంగా
అయినవాళ్ళకు రెండు ఓదార్పు కన్నీళ్ళు
ఒలికించని జీవితాలెందుకు ?
జీవిత గమ్యాలనూ గమనాలనూ శాసించే
అలౌకిక శక్తికి అర్పించుకుంటూ
మానవత్వం మహా శీకరం తో సాయుజ్యం పొందలేకపోతే మిగిలేవి రెండు ఆశ్రునయనాలే
అదీ పొగమంచు మసక చూపుతో ..............
నువ్వేనా?


ఉదయతారలా ఇలా వచ్చి అలా వెళ్ళిపోతావు
నేను వెన్నెల కిరణాల వేటలోనో 
మేఘమాలికల వలలోనో వేళ్ళాడుతూంటాను
నీ మాటల మాయలో పడి
పరవశం అడుగులో అడుగేస్తూ ఘడియలు లెఖ్ఖిస్తూంటాను
రాలిపోతున్న చుక్కలు గుప్పిట్లో దాచుకోవాలని
పరుగులు పెట్టి
దిగంతాల లోయలోకి జారిపోతుంటాను
రాలిన చుక్కలన్నీ నీ కళ్లలోకే వలస వచ్చాయని
అవి సూటిగా వచ్చి నా గుండె నెత్తురులో ఇంకిపోయాయనీ
ఎవరుచెప్తారు
చీకటి దొంగలా నీనీడ ఒకటి ఏ నిశి రాత్రో నా నిద్రను
దోపిడీ చేస్సి
మనసును తట్టిలేపి దాగుడుమూతలాడుతుంటుంది
ఉషోదయాన జేగురు రంగు కళ్ళతో
సూరీడి కోపం మూలమూలకూ  వెలుగు రంగునద్దే వరకూ
నీ కోసం నిస్సహయంగా వెతుకుతూనే ఉంటాను
లేలేత మల్లె గులాబీల  రేకల మధ్య చుట్టి 
సూర్యస్థమయాల రాగరంజిత స్పర్శతో చెక్కిళ్ళనద్ది
పరాగపు పొరల్లో నాట్యం చేసిన రాత్రులూ పగళ్ళూ
ఏ పున్నాగ చెట్లెక్కి పరిహసిస్తున్నాయి
కనురెప్పదాటని చిరు బిందువులో నీ చూపు పూసిన
ఇంద్ర ధనుసునుండి రెక్కలను కత్తిరించుకు
నింగీ నేలా పద్నాలుగు భువనాలూ
ఎక్కడ గాలించినా ఏదీ నీ జాడ?
అలసి సొలసి ఆదమరచిన వేళ సేద దీరుస్తూ
నాలోలోపలి పొరలనుండి తొంగి చూసేది నువ్వేనా?
కలల తీరానికి...............

నా వెన్నంటి కదిలే నీడ
నడి రాత్రి కిటికీలోంచి 
మనసు లోలోతుల్లో
 కలల కోసం వలవేసి
కునికిపాట్లుపడే తపన
అర్ధరాత్రి నిశ్సబ్దం చల్లగా కనురెప్పల పై పాకి
ఉదయం తీరానికి పాకివస్తున్న బాలసూరీడి దాగుడు మూతల్లో
నిద్ర బొట్లు బొట్లుగా  స్పృహలోకి ఇంకుతున్న వేళ
కలల తీరంలో
అలల ఊయలూగుతూ ... జోగుతూ..............

ఎలా? ఎలా?

పూసిన ప్రతి పువ్వు నవ్వూ
నీ కనుల మిలమిల  అయినప్పుడు
ఆకులు రాల్చని ప్రతి చెట్టూ వీచే గాలి
నీ లాలిత్యపు లాలి పాట వినిపిస్తున్నప్పుడు
నీ ఎద వెచ్చదనంలా పచ్చపచ్చని గరిక తివాసీ
నా పాదాలకు సుతి మెత్తని పూలబాట వేసేప్పుడు
నువ్వెదురుగా లేవన్న బెంగెందుకు

నా లోలోపలి నిత్య వసంతంలా
అనునిత్యం వినిపించే కోయిల కొత్త స్వరాల
కుహూ కుహూ రవాల సందడులు నీపాటలైనప్పుడు
కను రెప్పల రెప రెపల్లో అనుక్షణం
నీ స్పందన గుండె చప్పుడు గమకాలుగా మారేప్పుడు
నా ప్రేమ లాలిపాటకు నీ ఊపిరి ఊయలైనప్పుడు
ఎలా అలవాటు పడతాను నీ పరోక్షానికి

నా స్వప్న సీమల యౌవన వీధుల్లో
నీతో అనుక్షణం విహరించే  నేను
నా భూత భవిష్యద్వర్తమానాల కల్పవృక్షం పై
సువర్ణ పుష్పంలా విరిసే నీ నవ్వు సజీవ నదీ ప్రవాహం
నా జీవన గమనమైనప్పుడు
రెప్పపాటు కాలం లో వేల వేల మార్లు
శత సహస్ర  నామావళిలా ప్రతిమాటా నెమరేసుకునే నా మనసుకు
యుగాలు గడిచినా నీ ఉనికి తెరమరుగెలా అవుతుంది?
రండి రండి

కనీవినీ ఎరగని వింత సోయగాలను వీక్షించేందుకు
రెప రెప లాడుతున్న నీడల పొద్దులో
మొహం దాచుకున్న రహ దారుల అడుగు జాడలను
పసిగట్టేందుకు పదిలంగా పరచిన పదాల మెట్లు చూపిస్తాను
పొగమంచు వెండి జలతారు శాలువా జారి జారి
జాలువారిన పట్టుకుచ్చు మసక వెలుతురు వెన్నెల పరదా వెనక
చివరి సొగసులు దిద్దుకునే
నాకలలచెయ్యట్టుకు సాగిపోయేందుకు
రండి రండి
అల్లరిగా మొహమ్మీద వాలి
చురుక్కుమనిపించే వేడి కిరణాల ఊపిర్లను ఊది
క్షణంలో విరజాజుల తెల్లదనాన్ని
కాగి మరిగి రంగుమారిన లేలేత్ గులాబీ పాల మాదిరి
అంతలోనే తళతళా మెరిసే రాగి చెంబు జేగురు రంగుగా
రెక్కలు విప్పి వేడి కల్లాడే నీలి ఆకాశం పరవశతలోకి మారే
ఉదయ సంధ్య కునికి పాట్లలో స్వప్న వీచికలను
తడిమి చూసేందుకు
నా అక్షరాల దారులవేంట సాగిపోదురుగాని రండి రండి









రండి... మనం కొత్త స్వప్నపు వాస్తవాన్ని ఆవిష్కరిద్దాం



పరిమళ భరిత సస్నేహ జలపాతాల్లో జలకాలాడి
సమ భావన సమ జీవన వజ్రాలు పొదిగిన
ఊహల మెట్లెక్కి ఒంటిగా నిరీక్షించే మానవత మౌన నివేదనకు
ఉషోదయాన ఉదయతార మసక బారిపోతున్నా
పొగమంచుపరదాల్లో మోము దాచుకుంటున్న
పండువెన్నెలతో ఊసులాడేందుకు  తహ తహ లాడుతున్న
ఈ క్షణమైనా తలఊపి అంగీకరించకపోతే .................

చెకుముకి రాళ్ళ ఒరిపిడి సృజన నిప్పురవ్వల చిటపటల మధ్య
మనిషికీ మనిషికీ మధ్య గిరిగీసుకున్న సరిహద్దులను తుడిచేస్తూ కురిసే
తొలి జల్లు ప్రేమాన్విత చినుకుల సవ్వడి సరిగమల తప్పటడుగుల్లో
ఇసుక సముద్రాలనూ నీటి ఎడారులనూ చిటికెలో అధిగమించే
మేధస్సుకు సానపెట్టి యుగాల జీవన హేలను మచ్చిక చేసుకుంటూ
సర్వాంగ సుందరంగా సుకుమారపు భావాల్ను ఏర్చి కూర్చి పేర్చి
నిర్మించుకున్న సువిశాల గాజు మందిరం మన గతం..........
ఏదీ ? ఎక్కడా ఆనవాళ్ళైనా మిగలకుండా కుప్ప కూలిన వైనమయినా లేదే?
మనస్సుకూ మనసుకూ మధ్యన సమకూర్చుకున్న స్వార్ధం అడ్డుగోడలు
మనిషికీ మనిషికీ మధ్యన ఆనకట్టలై , ఓంకార నాద బృందగానం నుండి
ఒంటిపిల్లి రాకాసి తత్వానికి తారుమారైపోయిన అనిర్వచనీయ పశుప్రవృత్తికి
మనిషి తొడుగు తగిలించుకున్న రాక్షసత్వానికి ఓ చుక్కపెట్టి
మట్టుబెట్టే ఘడియ కు ఇప్పుడు శ్రీకారం చుట్టకపోతే ...............

నేను నేననే వ్యామోహపు అగ్నికీలల్లో
సస్య శ్యామల విశ్వైక భావన మాడి మసై బూడిదై
చివరకు నిట్టూర్పుల గాలి కెరటాల్లో చూపానని సుదూరతీరాలకు తరలిపోదా?
పెద్ద తేడా తెలియని గాజుగోడల మధ్య ఒకటిగా కనిపించే జనసమూహపు
ఒంటి స్థంభపు ఏకాంతమందిరాల్లో కుమిలి కుమిలి ఏడుస్తున్న వెక్కిళ్ళ ద్వని
నిశ్శబ్దంగా తలవంచుకు శపించదా కృంగి కృశించి బక్కచిక్కి బలిపశువై పోతున్న సౌహార్ద్రత

బంగారపు గోడలపై వజ్ర వైడూర్యాలు తాపడం చేసిన  రాజమందిరం స్వంతమైనా
సూర్య చంద్రులకు ఆతిధ్యమిచ్చే చిల్లుల ఆకాశం గుండా చుక్కలు నవ్విపోయే
తాటాకు కప్పు గుడిసే ఆస్థి అయినా
మట్టి తల్లి ఒడిలో తొలిఊపిరి పీల్చుకు , చివరకు తుది శ్వాసా అదే అయినా
మట్టి మనుషులు వేరనీ మట్టినుండి కూడా బంగారం పండించుకునే
పుణ్య పురుషులు వేరనీ రాజకీయాలు నడిపే ప్రజ్ఞకు
నోటమాట పోగొట్టుకోదా నడమంత్రపు సిరి రోగానికి గురైన సమభావన

ఇంకా వేళ మించిపోలేదు... వసంతం  పూర్తిగా విషంతాగి శిశిరంలో సమాధి కట్టుకోలేదు
అక్కడో ఇక్కడో తలెత్తిచూసే మంచితనం మరకత రత్నాలు
గాలి వీవన పలకరింపులకే పులకింతలవుతున్నాయి.
ఇంకా ఏమూలో కాస్త కొస ప్రాణం కొడిగట్టబోయే వత్తిలా
దీపంపురుగుల రెక్కల శబ్దంలా శ్వాసిస్తూ
ఉండుండి వెలుగు రవ్వలను విసురుతూనే వుంది.
రండి రండి !
గాజుగోడలను తునాతునకలు చేసుకుంటూ
నేను నువ్వనే మాటలకు చ్చితిని పేర్చి
మనం మనం ఒకటంటూ కలసి రండి
కలగలుపుగా రండి, అందరూ ఒక్కరై  సలలిత ప్రవహంలా కదలిరండి...
నేను నేనంటూ మోడువారిన మనమంతా
మొక్కలమై వసంతపు గాలి సోకిన చెట్ల కొమ్మలమై
చిగురిద్దాం
ఇన్నాళ్ళూ ఇన్నేళ్ళు ఒంటిగా శ్రమపడి కట్టుకున్న
అడ్డుగోడలను పడగొట్టి ఒకటిగా కదులుదాం
కొత్త స్స్వప్నపు వాస్తవాన్ని ఒకటిగా ఆవిష్కరిద్దాం .

****************************


















కలల కూ వాస్తవానికీ మధ్య ........................
నిట్టూర్పుల సెగలోగిలి కొలిమిలో
ఉదయం మేల్కొల్పుల పర్వంలో
శీతల పవనపు పలకరింపులా నీ ఆలోచనలు
మసక మసగ్గా ఆవిరితుంపరలుగా
అస్పష్టపు దృగ్గోచర ప్రపంచంలోకి
ఒక వెలుగు కిరణం ప్రసరణలా
వర్తమానానికి బాటనేర్పరుస్తూ
ఆగిపోయిన గుండె చప్పుడు
కీ ఇచ్చిన గడియారంలా పునః ప్రారంభిస్తుంది.
వెన్ను తట్టి తలనిమిరిన ఊహ
వెయ్యి జీవితాల బలాన్నందిస్తుంది.
నీ మాటల పల్లకిలో నా నిశ్శబ్ద గమనం
వాయులీనపు రాగమవుతుంది.
వెచ్చని నీ తలపుల పులకింతల్లో
ఓ కొత్త మొక్క కళ్ళు విప్పుతుంది.
రాత్రంతా కనురెప్పలపై వాలి
కాపలా కాసిన వేదన అలసి సొలసి
సొమ్మగిలిన క్షణాలు కాస్త రెప్ప వాల్చగానే
ఎప్పటినుండో ఎదురు చూస్తున్నట్టు చటుక్కున వాలి
కలల సోపానాలెక్కేందుకు చెయ్యందించే నీ స్పర్శ
ఓదార్పులో కలో వాస్తవమో తెలీని తుహిన కణంలా ...
కాస్తంత మగత మత్తు సందులో దూరగానే
నీకూ నాకూ మధ్యన దూరం అదృశ్యమై
నీ గుండెలపై తలవాల్చిన నా మనసు
ప్రతి  ఉదయం ఓ అమర ప్రేమ కావ్యమై...




ఇదేగా వాస్తవం

స్వప్నసౌందర్య సీమల కూనిరాగాల
అగరుపొగల మసక మబ్బుతెరలు...........
చుట్టూ దిగంతాలను కబళిస్తూ
పరచుకున్న జలతారు అలల కలవరం .............
మొలకెత్తేందుకు తలలు పైకెత్తి
వెలుతురు ఊపిర్లు పీల్చుకునే కొత్త మొలకలు.................
ఉరుములు మెరుపుల్లో ఊరట పొందే తుఫాను గాలులూ
జీవితమంతా పరచుకు మెత్తని తివాసీ  గామారి
ఆహూతులనూ అనాహూతులనూ వెచ్చగా పలకరిస్తూ
నును సిగ్గు పదల మేలిముసుగుల్లో
తమను తాము అలంకరించుకుంటూ
క్షణికమైన తలపు కరిగి కన్నీరై
భ్రమ పొత్తిళ్ళలో హత్తుకుపోతూ ....
మాటల పాపాయిలుగ  అంతలోనే  బోసినవ్వులూ
ఇదేగా వాస్తవం








ఇప్పుడూ...............

వసంతం బహూకరించిన పరిమళాల కల్పవృక్షాల్లా రాత్రీపగలూ
ఇంద్ర ధనుసు రెక్కలకు వేళ్ళాడిన రోజులు గుర్తున్నాయా
చుక్కలడిగినా ఆకాశం ముక్కలడిగినా
అందని స్వర్గపు అంచుల జిలుగులడిగినా
దిశదశలా పరచుకున్న నీటి పరవళ్ళ అద్దంలో మొహం చూసుకునే
వెలుగు మేలిముసుగు సవరింపు వెన్నెల నడిగినా
ఎప్పుడైనా కాదన్నావా?
గాన గాంధర్వుడవై రాగాల వాకిట రతనాల తివాసీ పరచి
లోకాలనరచేతిలో సృష్టించలేదూ?
ఇప్పుడూ అంతే
సముద్ర తీరాన సంధ్యారుణిమ ఏకాంత సౌధంలో
మూగవోయిన నీటి కెరటాలపై చెక్కిన శిల్పంలా సాగిపోయే నావ
అయినా సజీవంగా గతం నా చెక్కిలిపై రాలీ రాలని నీటి ముత్యాల నావిరి చేస్తూ ...
దూరం
నీకూ నాకూ మధ్య
నింగీ నేలా NAdUMA UNNAmTA దూరమనుకున్నాను
సప్త సముద్రాలు పరచుకున్న భారమనుకున్నాను
వాలిన కను రెప్పలు శతృవులై
నిన్నూ నన్నూ విడదీస్తున్న నిద్రకు స్థావరాలనుకున్నాను
కాని
ఇప్పుడు తెలుసుకున్నాను
కనురెప్పలు విశ్రమిస్తూనే
మన మధ్య దూరం ఒక స్వప్నమేనని
ఇహ జీవితమంతా స్వప్నాల బృందావనాలేనని.

ఇంకా నా..............

ఈ చిరునవ్వుఅలల సొబగులను
ఎన్నాళ్ళిలా తగిలించుకోను
సీల్ వేసిన అత్తరు సీసాలో పరిమళంలా ఎన్నాళ్ళిలా
కన్నీళ్ళకు తాళం వేసి ఉంచను
సమయం వాలువైపు పరుగులు తీసే ప్రవహంలా
నిశ్శబ్దంగా మెలికలు తిరుగుతూ కదలిపోయే సర్పంలా
ముక్కలైన మనసు చిందరవందర మధ్య
ఎండమావుల మెరుపుల మధ్య
అవిరమంగా దారి వెదుక్కుంటూనేవుంటుంది
అయినా స్వప్న సీమల్లో చేజిక్కిన స్వర్గంలా
భ్రమ చుట్టూ మనసు పరిభ్రమణం
ఎన్నాళ్ళిలాగ ...






మళ్ళీ మొదలు
నక్షత్రాలను మింగి చీకటి దారుల్లో పచార్లు చేసే
నిశ్శబ్దం గదిలో కరిగి కన్నీరౌతున్నరాత్రి
ప్రవాహం అడుగు జాడల్లో అడుగులు వేస్తూ
నేనూ కరిగి కరిగి కదిలిపోవటం
సారూప్యత పొందటం ...మళ్ళీ మొదలు.

అత్తరు సువాసనల్లా , అగరుపొగల్లా
ఉషోదయపు మంచు పరదాల్లా
అస్పష్టంగా నర్తించే నీడల లయ విన్యాసాల్లో లీనమవుతూ
రెక్కలు విరిగి కుప్పకూలిన కలల కుప్పమీద
గుండెలు బాదుకుంటూ రోదించే కీచురాళ్ళ గానానికి వంతపాడుతూ
ఈ సుదీర్ఘ యానం  .............మళ్ళీ మొదలు

ఏకాంతపు రెక్కలమీద వాలి
గడచి గతించిన సంధ్యారాగపు గమకాలనూ
సజీవంగా పల్లవించే జ్ఞాపకాల మధురిమలనూ
పోగేసుకుంటూ ,
జీవితం పుటలను మళ్ళి మళ్ళీ సవరించుకుంటూ
సరిచూసుకుంటూ
అనంతంగా సాగే రాత్రి యాత్రకు మళ్ళీ మొదలు..


రాత్రి

నిద్రపట్టని రాత్రి కంటి కొసల్లో
నిశ్సబ్దంగా పచార్లు చేస్తూ
మసక వెలుతు జోరువాన గుసగుసల్లో
తడిసిముద్దై గజగజ లాడుతూ
దిక్కుతోచక ఉక్కిరిబిక్కిరయే
నిస్సహాయత చుక్కలు చుక్కలుగా రాలిపడుతూ
కిటికీ అద్దాలగుండా నీలెఖ్ఖేమిటంటూ
దౌర్జన్యంగా దూసుకువచ్చే జాబిల్లి చల్లదనం
ఉపశమనంలో సేదదిరుతూ ....
శిశిరం వానలో కొట్టుకుపోయిన వసంతం
తనవెంటే హరివిల్లు రంగులనూ లాక్కుపోయినా
రెప్పలు వాల్చిన అరక్షణం విశ్రాంతిలో
ఊహల సరిగంచు వయ్యారాల కలల చిరుజల్లులో
రంగుల సింగిణీలు నేలకు దిగివచ్చిన అప్సరసల్లా సరిగమలను నర్తిస్తాయి
పరవశంలో తడిసిముద్దైన వెన్నెల గొంతు సవరింపులో
వెయ్యి లాలింపుల జోల









విభ్రాంతిలో..............

గాలి గిలిగింతల తుళ్ళింతల్లో రాలి పడిన పున్నాగలు
ఆకాశం ఆనందపు హేల మంచు పూలవానతో పోటీ పడే
ఉషోదయ సంధ్యారాగం అరుణిమలో నులివెచ్చని  కిరణంలా
నీ మనసు తొలి అడుగుల సుతిమెత్తని ధ్వని వెంట
రాగమై ... గానమై ......మైమరపునై ...............
చేతనా చేతన అవస్తలో నాఉనికిని నేను పారేసుకుని
నీ తలపుల స్వప్న సీమలో ఓ సుందర సుమధుర
తేనెవాకల సోయగాన్నై, గాలి ప్రవాహాన్నై
జీవితం రెక్కలమీద అలవోకగా ఆవలితీరాలకు చేరే
నిన్నటి విభ్రాంతిలో..............










వెదకబోయిన తీగ

పగిలి ముక్కలైన గాజుముక్కల్లా వర్షపు చినుకుల
హఠాత్తుగా జారిపడే
అతిక్రమణ క్రమంలో సుదూరపు
అస్తవ్యస్త దృశ్యం లోకి మనసు సారించి
శూన్యంలో సృష్టించుకున్న వేలాది
ముఖకవళికల్లో కావలసినది వెదుక్కుంటూ ............
రాతి ప్రవాహాల మధ్య
రణ గొణల పలకరింపుల
పాటల రింగ్ టోన్ ల పిలుపులు కలగలసి
హృదయాన్ని పిండి వంపేసిన అహం క్షణం
ఏకాంత సమాలోచనలోని ఆలోచనల్లో
విశ్రమించిన ఆకు పొత్తిళ్ళలోంచి
విసురుగా దూసుకెళ్ళే వేదన ఆక్రోశాలు
ఖాళీ గాజుకళ్ళ చూపుల్లో
ఏ తైల వర్ణ చిత్రాలనావిష్కరించుకోవాలన్న తపన
వ్యర్ధంగా లోకాన్ని గాలించి గాలించి నిస్పృహగా
చీకట్లు వెంటేసుకు కాళ్ళీడ్చుకుంటూ గూడు చేరిన వేళ
గుండె వాకిట్లోనే చిలిపి నవ్వుల పలకరింపులతో
వెదకబోయిన తీగ






కాస్సేపు నన్నిలా వదిలెయ్యండి


నీలి గగనం జలతారు మేలిముసుగులో
చీకటీ చుక్కలూ మసక మాటున
ఊసులాడుకునే వేళ
నిశ్శబ్దపు కనురెప్పలను వాల్చి
సాయం సంధ్యలు సిగ్గులమొగ్గలయి
మల్లెలూ మందారాలూ మంచు పొత్తిళ్ళలో
వెన్నెల మెలిమి వెలుగుల్లో
కలను ఏరుకుంటున్న జ్ఞాపకాలు చిత్రిస్తున్నాను
కాస్సేపు నన్నిలా వదిలెయ్యండి.

కనిపించని బ్లాక్ హోల్ లా చాపకింద నీరులా రాత్రి నన్ను
తనలోలోనికి లాగేసుకుని అదృశ్యం చేస్తున్న వేళ
ఉక్కిరి బిక్కిరైపోతూ నిస్సహాయంగా వేళ్ళాడబడిపోతూ
చీకటిలోంచి చీకట్లోకి చీకటిలా సాగుతున్న ఘడియలు
చీకటితో గీస్తున్నాను ఆశల కాన్వాస్ మీద
కాస్సేపు నన్నిలా వదిలెయ్యండి
స్స్వప్న దీపాలను అరచేత పట్టుకు రాత్రిని వెలిగించుకుంటూ మబ్బుల రాతి పలకల మీద
పదిలంగా అడుగులేస్తున్నాను
కరిగి కన్నీరై నేలకు జారే నీటి చుక్కల వెంట
ఆకాశ హర్మ్యం  నుండి సుతారపు టప్సరసలా దిగి వస్తున్నాను
కాస్సేపు నన్నిలా వదిలెయ్యండి
పదిలంగా ఎంచుకున్న పదాల మొలకలను
హృదయంలో నాటుకున్నాను
నును వెచ్చని మమతానురాగాల పిల్లకాలవలతో నీరెడుతున్నాను
ప్రేమ పండించేందుకు నా వ్యవసాయం
నిరంతరమ్ ఇలా సాగిపోయేందుకు
కాస్సేపు నన్నిలా వదిలెయ్యండి

























నిద్రపట్టని రాత్రి.................

చిక్కటి ఆకాశం నీలాన్ని చుట్టుకుని
మెత్తని పట్టుకుచ్చులా
నా లోలోనికి ఒక సౌందర్య ప్రవాహమై
సౌకుమార్యమై సలలితమై
వేల వేల హరివిల్లుల రంగులు అలదుకున్న పక్షి కూనలై
రెక్కలు మొలచిన నక్షత్రాలు అటూ ఇటూ సందడిగా గిరికీలు కొడుతూ
గుప్పెడు వజ్రాలను దారంతా వెదజల్లి
వెనక్కు విసిరేస్తున్న వెలుగు పుంజాల్లో
నిశ్శబ్దంగా కళ్ళల్లో కళ్ళుంచి
మౌనంలోంచి మౌనం లోకి మౌనంతో
ఊసులు పంచుకుంటున్న క్షణాలు
ఎగిరెగిరిపడుతున్న భావావేశాలను
లోలోపల అదిమేసుకుంటూ , చిదిమేసుకుంటూ
మసక బారిన చూపుల్లో కట్టెదుట
నిలువెల్లా వణికిపోతూ నా గుండె చప్పుడు
నిద్రపట్టని ఈ రాత్రికి
ఏ పాట జోలగా పాడను
కొత్తబాట వేసుకునే నా మనసు గమకాలనా?
రాత్రి నింగిలో నన్ను నేను చూసుకుంటూ
నేలకు దిగివచ్చే కలల పల్లవులనా?


అనంతంగా సాగే
అతుకుల్లేని గాలి పరదాల్లో
రాత్రి పుటల మధ్య బిక్కు బిక్కు మంటూ
రాయని కధలూ చెప్పని గాధలూ ఆవిష్కరిస్తూ
నిద్రకళ్ళతో నగరం

తూర్పు లేసంజవెలుగుల్లో ప్రభవించే
ఉషోదయం చిరునవ్వుల వెనక
ఒదిగిన స్వరరాగమంజరి రాగాలాపన పెదవులపై వాలాలని
మళ్ళీ మరోసారి రాత్రి రెక్కలను తొడుక్కు
నీడల్లో కరిగి కరిగి రెపరెపల గోడలమీద
పొగమంచు పరిమళాల ప్రవాహంలో
గులకరాళ్ళ సంగీతంలా
చిరు సవ్వడి
మరిమరిగి గుండె కన్నీళ్ళుగా పాదముద్రలుగా
చీకటి వాకిళ్లలో నిద్రలేమి రాత్రులను
స్వప్నాలు బహిష్కరించిన







కలలు

రంగు రంగుల కాగితం కలలను
మడిచి పడవలుగా చేసి
అల్లరి వయసు
కాలం ప్రవాహంలోకి వదులుతున్నాను
కొన్నింటికి రెక్కలు తగిలించి
పుష్పక విమానాల్లా
నింగి నిండా పరచుకున్న ఎండమావి
నింగిలోకి విసిరేసాక
క్షణం మర్చిపోయి 
గతం పుటలను మూసేశాక
సుకుమారపు కలల
సుతి మెత్తని స్పర్శ
స్పటికపు పొరల వర్తమానంలోకి
లీలగా అవలీలగా పాదం మోపుతూ
జీవితం అసమగ్రతలను మేలి ముసుగు పరదా వెనక
ఆలోచనల బరువులను వేళాడదీస్తూ
చివరకు కలలు గాలి పటాలై
అనంతం లోకి అనవరతం సాగిపోతూ ...............






జీవితం పుటల మధ్య ..........
జీవితం పుటల మధ్య
వెయ్యి కాళ్లతో ఎగిరెగిరి పడుతూ
వెయ్యి చేతుల్తో పొగమంచును
విసిరిసిరి కొడుతూ
గసపోసినట్టు
హృదయాన్ని తట్టిలేపే హోరు తో
భూనబోంతరాళాలను పిడికిట ఒడిసిపట్టుకున్న
సముద్రాలను స్పృశిస్తున్నాను
వేళ్ళసందుల్లోంచి జారిపోతూ
అంతలోనే జలపాతాల మోపులను
కట్టగట్టి గుమ్మరిస్తున్నట్టు
ఉక్కిరి బిక్కిరి చేసే తీరం వెంట గులకరాళ్ళ వేటలో
కాలాన్ని కదిలిస్తున్నాను.
మరో వెంపు
సూర్యాస్థమయాల కెంజాయలతో
తీరాన అల్లుకున ఇసుక భువనలకు రంగులద్దుతున్నాను
సూర్య చంద్రులను రెక్కట్టుకు లాక్కువచ్చి
నా తాటాకుల గుడిసె చూరులో
అటొకణ్ణీ ఇటొకణ్ణీ తగిలించుకుంటున్నాను
నిన్నటి జీవితం ఇనుప పరదాకింద
నిశ్శబ్దంగా ప్రవహించే కన్నీళ్ళ పరిమళాలను
 మళ్ళీ మళ్ళీకలబోసుకుంటున్నాను
రాత్రీ పగలూ అందకుండా సతాయించే
ఋతువుల వేటలో
పరుగులు పెడుతున్ననేల తల్లి
చేతిలో గోరుముద్ద కోసం
చాతకాన్నై ఎదురుచూస్తూ
రేపటి వెచ్చదనానికి 
గూళ్ళల్లుకుంటున్నాను
ఏదీ మరి తీరిక

క్షణాలు ,నిమిషాలు గంటలు రోజులు సంవత్సరాలు యుగాలు
ఎన్ని యుగాలీ గడచిన కాలసంధి
మనం గడిపిన రోజుల ప్రవాహం
 ఆడుతూ పాడుతూ సుళ్ళు తిరుగుతూ
స్వప్న సీమలను పంచుకుంటూ
చుక్కల మధ్య చెక్కుకున్న జ్ఞాపకా్లు
ఇప్పుడు ఎవరికి వారై
 పెనవేసుకున్న ఆత్మల మధ్య
పెను నిశ్శబ్దం పూలకొమ్మను
దులిపినట్టుగ ఓ పిలుపు
జీవితాన్ని దులిపినప్పుడు
జాలజలా రాలిపడ్డ పారిజాతాలు
కనిపించని తలుపులను మూసేసుకు
 ఎక్కడో అదృశ్యం అయిపోయి ఎన్ని యుగాలు
ఒక్కసారైనా ఎలావున్నావన్న ఓపరామర్శ...................
సుమ పరిమళాల గాలి కొసల
 ఊయలూగు తూనీగల రెక్కలపై
పచ్చని పూబంతులు కిరణాలై  పరుగెత్తే    హరివిల్లులు

తుర్పుకోన తొలివెలుగుల రేఖలు వెన్నాడే
చిరు బాలలు పక్షి పాపలు తమ రెక్కలార్పి
రివు రివ్వున కొమ్మ కొమ్మకు పాడే ఉదయగీతి ఈ ఉషోదయపు స్వాగతీ కృతి

అడుగడుగునా చీకట్లో ఏకాంతంగా సుళ్ళుతిరుగుతూ
జీవితాన్ని తడుముకుంటున్న క్షణాన
ఎక్కడో ఏ మూలో హృదయపు గమకాల్లోనో
మత్తుగా ఒత్తిగిల్లిన మస్తిష్కపు వాన మెరుపుల్లోనో
లీలగా ఓ చిరు కెరటపు అలజడిలా
గాలి స్పర్శకే కదిలే నీటి కెరటంలా
ఎక్కడో మసక తెరలా నీ ఉనికి
చూపుల మమేకంలో ప్రవహిస్తూ
వెచ్చ్చని ఆత్మ్మీయత పొత్తిళ్ళలో ఒదిగి
బ్రతుకంతా దారిచూపే ప్రేమ వెలుగులు
నిశ్చలంగా నిశ్శబ్దం అలుముకుంటున్న వేళ
పదాలను పెనవేసుకున్న పెను భావన
అదృశ్యంగా అల్లుకుపోతూ
చిరు తీవెలా ఓ ప్రేమ భావన
నెమ్మది నెమ్మదిగా గోడలు విరిగి పడుతున్న జాడలు
ప్రేమ గీతలు అల్లిన పొదరింట్లో
అ మూలన ఒకరూ ఈ మూలన ఒకరు
స్వప్నసీమల్లో రెక్కలు తగిలించుకు విహరిస్తూ
హఠాత్తుగా ఓ పెద్ద వెలుగు విస్ఫోటం
ఎదురెదురుగా ఒకరి లోకి మరొకరు
నిరంతరాయంగా నిమ్నగలై ................
ఎప్పుడో ఎక్కడో మసకవెలుతురు మెట్లమీద
ఉషోదయాలకూ సంధ్యారాగాలకూ మధ్యన  
మనిద్దరం కలబోసుకున్న జ్ఞాపకాల లీల
అస్తమించిన సూర్యుడికీ ఉదయించని చంద్రుడికీ
మధ్య చెలియలికట్ట కెంజాయ కెరటంలా

నీలి సముద్రం నడిలోతుల్లో స్వేచ్చగా తేల్తున్న కలల నీడలు
నీకూ నాకూ మధ్యన ఏనాడో పెనవేసుకున్న అనుబంధం
నింగీ నేలకు మధ్యన సుషుప్తిలో మంచు పర్వతాలు
హఠాత్తుగా రెక్కలు మొలిచి మేల్కొన్న పచ్చని అరణ్యాలై
చిక్కని సశ్య శ్యామలత పరచుకున్న జాడలు
కరిగి నీరవుతున్న కాలం క్షణాల్లో కాదు
అనుభూతుల్లో పంచుకుందాం
వెండి వెన్నెల వెలుగు జాడల్లో
బాల్యం తొక్కుడు బిళ్ళాటలను ఆడుకుందాం
నా తో పాటు కాస్సేపు ఈ పట్టుకుచ్చుల
మెత్తని గగనంలో
కరిగి ప్రవహించే కలల భువనంలో 
విహరించేందుకు రారాదూ 
ఉదయపు గాలితో చుట్టేసే
పారిజాతాల పరిమళంలా మన అమాయకపు
స్నేహాన్ని చెరిసగం పంచుకుందాం
ఒకరి సమక్షంలో ఒకరం
జీవితాన్ని మరచి కలల్ని వలచి కాస్సేపిలా
అత్మీయత కలబోసుకుందాం.