Monday, June 4, 2012

గబగబా షవర్ కింద స్నానం అయిందనిపించి షవర్ క్యూబికిల్ నుండి అడుగు బయట పెట్టింది సీత. పనికి రాదని డోర్ మ్యాట్లు తొలగించడం వల్ల కాలు జర్రున జారి పడబోయి , షెల్ఫ్ పట్టుకుని ఆగింది. టవల్ తీసి బాత్ టబ్ పైకి విసిరేసి ఓ పక్కన మడిగా పెట్టుకున్న పాత పట్టు చీర చుట్టుకుని, ఏవీ తగలకుండా జాగ్రర్త పడుతూ బెడ్ రూమ్ లోంచి బయటకు వచ్చి, ఫ్యామిలీ రూమ్ లో ఓ పక్కన అమర్చుకున్న కలశం వద్దకు చేరుకుంది. మనలో మనమాట ఇల్లంతా పరచి ఉన్న కార్పెట్ తొక్కితే మడికి పనికి వస్తుందా? ఏమో!

“మెలుకువ వచ్చిచావలేదు … ఆలస్యమైపోతోంది ” అనుకుంటూ లలితా సహస్ర నామాల పుస్తకం అందుకుంది. అంతలో ఇంకా అనుష్ లేవలేదని గుర్తొచ్చి ఓ పెద్ద గావు కేక పెట్టింది

“అనూ ..అనూ …”

ఉహు,  ఊ లేదు ఆ లేదు …

“ఒరే అనుష్ గా ………….”

ఈ అరుపుకి అనుష్ కంటె ముందు పది నెలల పసిది అమి లేచి కెవ్వుమంది.  పక్కనే ముణగదీసుకు పడుకున్న శరత్ లేచి పిల్లదాన్ని సముదాయించడం మొదలెట్టాడు. పుస్తకం  విసురుగా కింద పెట్టి విసవిసా అనుష్ గదిముందు నించుని మరో మారు గొంతు చించుకుంది.

“ఒరే అనుష్ గా …..లే టైమయింది లేచి రెడీ అవ్వు ” హుంకరించి కిందకు దిగింది.

మళ్ళీ వచ్చి తీరిగ్గా కూచుని పుస్తకం తెరిచింది.. కళ్ళు మూసుకుని, ఒక్కసారి అమ్మ వారిని తలుచుకుని సహస్ర  నామాలు చదవడం మొదలెట్టింది. ఈలోగా శరత్ పిల్ల డయాపర్ మార్చి దానికి పాలు తాగించి లంచ్ పాక్స్ రెడీ చేసి అమి బ్యాగ్ , అనుష్ స్కూల్ బ్యాగ్ రెడి చేశాడు.

సహస్ర నామాలు చదువుతూ మధ్య మధ్య కునికి పాట్లు పడుతూ, గుర్తొచ్చినప్పుడల్లా శరత్, ఇది చేశావా, అది చేశావా అని అరుస్తూ పూజ కార్యక్రమంలో మునిగిపోయింది. పిల్లాడికి ఓట్ మీల్ తినిపించి శరత్  సిరియల్ తింటుంటే పూజ ముగించి హడవిడిగా పైకి పరుగెత్తింది సీత . ఆ హడావిడిలో చీర కొంగు జారిపోయి మెట్ల మీద పడటం, ఆ సీన్ కి అనుష్ చప్పట్లు కొట్టి నవ్వడం తో ఉక్రోషం పొడుచు కొచ్చింది.

” అలా  దిష్టి బొమ్మలా నించుని నా వంక గుడ్లప్పగించి చూడకపోతే పిల్లల్ని కార్ సీట్లో కూర్చో పెట్టరాదూ..”

రుస రుస లాడుతూ పైకి వెళ్ళింది. పది నిమిషాల తరువాత బయాటకు వచ్చిన సీతకూ అంతకు ముందు సీతకూ పోలికే లేదు.  జీన్స్ పాంట్ పైన  డిజైనర్ టాప్…. గాగుల్స్ …….హైహీల్స్ ,…. హ్యాండ్ బ్యాగ్.  ఎవరి కారు వారు తీసుకుని బయల్దేరారు. సీత అమిని డే కేర్ లో వదిలి క్లినిక్ కి వెళ్ళాలి. శరత్ అనుష్ ను స్కూల్లో  వదిలి ఆఫీస్ కి వెళ్ళాలి.

అసలు కధ ఇక్కడే కద!

అమిని డే కేర్ లో వదిలి ఆదరా బాదరా డ్రైవ్ చేసుకుని క్లినిక్ కి చేరుకునే సరికి అయిదు నిమిషాలు ఆలస్యం అవనే అయ్యింది. అప్పటికే అపాయింట్ మెంట్ తీసుకున్న పేషంట్స్ అసహనంగా ఎదురు చూస్తున్నారు. సీతకు ఒక్కసారి లోలో్పలే కోపం తన్నుకు వచ్చింది.

” నా ఖర్మ, నా ఖర్మ గాకపోతే మెడిసిన్ ఎందుకు చదవాలి…. చదివినా ఏదో గవర్నమెంట్ ఉద్యోగం చూసుకోక తగుదునమ్మా అంటూ ఇలా అమెరికా రావడం … ఇక్కడ క్లినిక్ పెట్టుకోడం………..: ”

తప్పదన్నట్టు మొహం మీద కృత్రిమ దరహాసాలను కురిపిస్తూ తన గదిలోకి కదిలింది.  లోపలకు వెళ్ళి ఒకసారి డ్రా తెరిచి దానిలో పెట్టుకున్నఅమ్మవారి ఫోటోకి నమస్కారం పెట్టుకుని ఆమెనో సారి స్మరించుకుని మళ్ళీ డ్రా మూసి , పక్కనే ఉన్న అద్దంలో చూసుకుని ఓ సారి కొబ్బరి పీచులా ఉన్నజుట్టును సవరించుకుని , పెదవులపై లిప్ గ్లాస్ అద్దుకుని కాలింగ్ బెల్ నొక్కింది. ఓ సారి లోపలకు తొంగి చూసి పేషంట్లను ఆర్డర్ ప్రకారం లోపలికి పంపటం ఆరంభించింది అటెండర్.

మొదటి పేషంట్ లోపలికి వచ్చింది, ఆర్నెల్ల పిల్లవాడితో. వాడికి కోల్డ్ అండ్ ఫీవర్. సీతకు చటుక్కున చిన్నతనం గుర్తుకు వచ్చింది. నెలకు రెండు సార్లైనా జలుబు జ్వరం రాకుండా ఒక్కనెలా గడిచేది కాదు. జ్వరం వచ్చినప్పుడల్లా వారం రోజులు జలుబు దగ్గుకి ముక్కుని తుడిచి తుడిచి ఎర్రబారటం .. అయితే ఇంట్లో మాత్రం ఎప్పుడూ డాక్టర్ దగ్గరకు వెళ్ళే అలవాటే లేదు. మిరియాల కషాయం , మిరియాల చారు, చింతాకాయో నిమ్మకాయో వేసి కాస్త నెయ్యి చుక్క తగిలించిన అన్నం , అపైన మజ్జిగ మానేసి వేడి వేడి పాలన్నం. మూడు పూటలు తిరిగేసరికి  ఎక్కడి జలుబక్కడ ఠక్కున మాయమైపోయేది. ఇంకా తగ్గలేదంటే లంఖణం పరమౌషధం అంటూ కడుపు మాడ్చి  పాలలో పసుపు వేసి తాగించడం….దాంతో పాటు పదకొండు రూపాయలు కొత్తగుడ్డలో పసుపు కుంకం వేసి అమ్మవారికి ముడుపు కట్టడం………..

కాని జలుబూ జ్వరాలకు మాత్రలూ , కాఫ్ సిరప్ , ఇన్హేలర్స్స్ ….నవ్వొచ్చింది. పిచ్చిమొహాలు , గోరుతో  పోయేదానికి గొడ్డలి వాడటం అంటే ఇదేనేమో!

“పొద్దున్నే స్నానం చేసి దేవుడికి దణ్ణం పెట్టుకుని   ఓ పదకొండు రూపాయలు ముడుపు కట్టి మొక్కుకో …అదే తగ్గిపోతుంది… పిల్లాడికి కాస్త సాయిబాబా విభూది పెట్టు ” యధాలాపంగా చెప్పినట్టుంది.

ఆ వచ్చినావిడ ఆశ్చర్యంగా చూసి ” ఐ కాంట్ గెట్ యూ” అన్నాక కాని స్పృహలోకి రాలేదు సీత.

” ఐ యామ్ సారీ ” అంటూ గబగబా ప్రిస్ క్రిప్షన్ రాసిచ్చింది. అవి ఎలా వాడాలో వివరించింది.

ఒకరికి వైరల్ ఫీవర్ , మరొకరికి ఆటలమ్మ, ఇంకోళ్ళు గవద బిళ్ళలు …. మై గాడ్ … పేషంట్ లు ఒకరి తరువాత ఒకరు వస్తూనే ఉన్నారు. కాస్త తెరిపిచ్చేసరికి పన్నెండు దాటిపోయింది. కాస్త తీరుబడిగా ఉంటే లలితా సహస్ర నామాలు మరో మారు చదువుకుందామనుకుంది. కుదిరి చస్తేనా….. ఎక్కడో యధాలాపంగా చదివింది లలితా సహస్ర నామాలు వెయ్యిమార్లు చదివితే లలితా దేవి ప్రసన్నమయ్యి అద్భుత శక్తులు వస్తాయని , అనుకున్నవి అనుకున్నట్టు జరుగుతాయని …

అఫ్ కోర్స్ చదవక పోయినా ఇప్పటి వరకు అనుకున్నవి అనుకున్నట్టే జరిగాయి … కాదు కాదు జరిపించుకుంది.  మంచి ర్యాంక్ తో మెడిసిన్ లో సీట్ రావడం, ఇద్దరూ బిజీ గా వుంటే పిల్లల ఆలనా పాలనా కష్టమని ఇంజనీర్ భర్త కావాలనుకుంటే అలాగే జరగడం, అమెరికాలో స్థిరపడటం , పిల్లలను అదుపాజ్ఞ ల్లో పెట్టుకోడం , ముఖ్యంగా శరత్….
అయినా మనసులో ఏమూలో ఏదో అసంతృప్తి . మరేదో పొందాలన్న తపన … అందుకే ఎలాగైనా వెయ్యిసార్లు  లలితా సహస్ర నామాలు చదవాలి… పుస్తకం తియ్యబోయేసరికి ఆవులింతలు వచ్చాయి. ఉదయం మదిగా చదువుకుందామని తొందరగా లేవడం వల్ల… నిద్ర సరిపోవడం లేదు. తిక్క తిక్కగా ఉంటోంది. సాయంత్రాలు పిల్లల హోమ్ వర్క్ లతోటే సరిపోతోంది. మధ్యాహ్నం లంచ్ తరువాత మీటింగ్ ఉంది…

అక్కడ శరత్ పరిస్థితీ అలాగే వుంది. ఉదయం మీటింగ్ ల వల్ల తెలియలేదు కాని కునికి పాట్లు వస్తున్నాయి వీకెండ్స్ అంతా అక్కడ పూజలు ఇక్కడ పూజలు అంటూ సరిపోతోంది. వాషింగ్ , క్లీనింగ్ అంతా వర్కింగ్ డేస్ లోనే చెయ్యవలసి రావడం అలసటగా ఉంటోంది, కాని గట్టిగా ఎదురు చెప్పలేని బలహీనత … కాదు కాదు … కాదని ఆ గొడవలు భరించటం కన్నా మౌనంగా తలూపడమే నయం. ఎవరో ఒకరు చెప్పకపోతారా అని ఎదురు చూశాడు కాని డాక్టర్ కదా ఎప్పుడే అవసరం వస్తుందో నని అందరూ సీతను భరిస్తున్నారు.

” భగవంతుడా ఈ పిచ్చి ఎలా వదలాలి?” తల పట్టుకున్నాడు.

ఎప్పటిలా శనివారం రుద్రాభిషేకం ప్లాన్ చేసింది సీత. దానికోసం పిలిచిన వాళ్ళందరికీ వంటలు రాత్రి రెండింటికి లేచి చేస్తే గాని అవలేదు. ఉదయమే స్నానం ముగించి అభిషేకానికి కావలసిన సరంజామా అమర్చుకునే సరికి పిలిచిన వాళ్ళొక్కక్కళ్ళు రావడం మొదలయింది. వనమాలి తో పాటు ఆమె తల్లి కూడా వచ్చింది .

” అమ్మ నిన్నరాత్రే వచ్చారు ”

” ఓ గుడ్ …” అంటూ కావలసిన ఏర్పాట్లలో మునిగిపోయింది.

మిగతా వారంతా పూజలో మునిగిపోయారు వనమాలి తల్లి శకుంతల మాత్రం కుతూహలంగా పరిశీలిస్తోంది. పిల్లలంతా హడావిడిగా అటు ఇటూ పరుగులు పెడుతూ ఆడుతున్నారు. బేస్ మెంట్ కి పైకి కిందకు గోల గోలగా అరుస్తూ ఉన్న పదిమంది పిల్లల్లో నాలుగు గ్రూప్ లు.మగవాళ్ళు ఓ వైపు ఆడవాళ్ళు ఓ వైపు కూర్చుని ముందే అందించిన పుస్తకాలు తెరిచారు మంత్రాలు చదివేందుకు … చిత్రంగా అవి తెలుగులోనూ లేవు , సంస్కృతంలోనూ లేవు తెలుగు ఇంగ్లీష్ స్క్రిప్ట్ లో రాసి వుంది. నవ్వొచ్చింది శకుంతలకు. మొత్తానికి మధ్య మధ్య పిల్లలను అరుస్తూ , ఒకసారి  లేచి వాళ్లందరూ కిందకూ పైకీ తిరగడానికి వీల్లేదని వార్నింగ్ ఇచ్చి అమ్మాయిలనో గదిలో అబ్బాయిలనో గదిలో వేసి పూజ ముగించే సరికి పన్నెండు దాటింది.

పూజవుతూనే ప్రసాదాలు తీసుకుని అప్పటికే ఫుడ్ అరేంజ్ చేసిన  టేబుల్ వైపు ఆవురావురుమంటూ కదిలారందరూ……  డిస్పోజబుల్ ప్లేట్ లలో పెట్టుకుని మగ వాళ్ళు ముందు సిట్ అవుట్ లోకి ఆడవాళ్ళు ఫ్యామిలీ గదిలోకి కదిలారు.

“ఆంటీ మీకు ఇంగ్లీష్ చదవడం రాదా?”

శకుంతలకూ ఒక పుస్తకం ఇవ్వబోతే వద్దన్న సంగతి గుర్తుకు వచ్చి అడిగింది సీత.

 ” వచ్చమ్మా .. కాని చదవడం మీదే నమ్మకం లేదు ” చెంప పెట్టులా వినిపించింది సీతకు.

“వాట్?” అప్రయత్నంగానే వచ్చిందామాట.

“అవునమ్మా … నేను ఆర్గ్యూ చెయ్యదలుచుకోలేదు.కాని ఈ మంత్రాలూ పూజలూ ఇవన్నీ మనం సృష్టించుకున్నవేగా? ఏదో సాధించాలన్న తపన ఎందుకు? నేను ఒక అతీంద్రియ శక్తి ఉందని నమ్ముతాను కాని నేను నా ఇష్టారాజ్యంగా ఏదైనా చెయ్యగలనని అనుకోను. నాకు నా పనే వేదం మనసే సాక్షి. నాకు తోచిన విధంగా ఎవరికైనా ఏదైనా చెయ్యగలిగితే చేస్తాను. ఎక్కడ లేడు భగవంతుడు? ఇందుగలడందు లేడను సందేహము వలదు అని ఎప్పుడో చెప్పారుగా … ఇదంతా సమయం వృధా చెయ్యటమే అనిపిస్తుంది, ఇదంతా ఓ రకమైన ఏస్కేపిజ్మ్ . అందుకే నాకు మానవ సేవే మాధవ సేవ. ప్రార్ధించే పెదవులకన్నా సాయపడే చేతులు గొప్పవి గద. ఈ సమయం అవసరం ఉన్న వాళ్ళకోసం వినియోగిస్తే బావుండదూ ” అంటూ పక్కనున్న మరెవరినో పలకరించి అటుతిరిగింది శకుంతల.   

సీత కోలుకునేందుకు చాలా సమయమే పట్టింది ఆయినా ఎప్పటిలా తలవిదిలించి నా ఇష్టం అనుకోలేకపోయింది ఈ సారి. ఓ చిన్న ఆలోచన తలెత్తింది. ఎక్కడో ఓ గోరంత వెలుగు మినుకు మంది.

                                         

                                                                                                     – స్వాతీ శ్రీపాద

This entry was posted in కథలు and tagged , , , , , , , , , , . Bookmark the permalink.

5 Responses to వెలిగించనా చిన్ని దీపం

  1. చాలా మందిలో ఉన్న మూఢ భక్తికి ఈ కథ అడ్డం పట్టింది.  కథ లో మంచి సందేశం ఇచ్చారు.చాలా బాగుంది .
  2. Lakshman says:
    అర్ధం పద్ధం లేని భక్తి నిదర్శనంగా ఉంది. చాలా బాగుంది. మీ కథ
  3. mulugu sarada says:
    చాలా బాగుంది.ప్రస్తుతం భక్తీ కూడా ఒక ఫోబియా లాగా ఐపోయింది. అందరం మానవ సేవే మాధవ సేవ అన్న విషయం మరిచిపోయి ఎండమావుల వెంట పడుతున్నాం.చిన్న కదే ఐయినా సూటిగా, క్లుప్తంగా , ఆలోచిపచేసిండీ ఈ కదా.
    • rammohan thummuri says:
      మానవ సేవే మాధవ సేవ అని తెలిసి రావడానికి ఇలాంటి కథలు ఎన్ని రావాలో .అమెరికా వాతావరణాన్ని చాలా బాగా చూపించారు.
  4. మీ మీ అందరి అభిప్రాయాలకు కృతజ్ఞతలు
http://vihanga.com/?p=3968