బుడి బుడి నడకల బాల్యం బూరుగుదూదిలా
ఆకలి తాపాల్లో వేడిగాలి ఊపిరి
నడివీధుల చూపులకుముడివేసిన
వినోదం ఉలిపిరి దారంమీద
వయ్యారం అడుగుల సొబగుల్ను
ఆకసం వీధివెంట మళ్ళిస్తూ
బక్కచిక్కిన వెన్నెల తునకలా
మునివేళ్ళసంగీతాల్ను మీటుతూ
చూపుల అభ్యర్ధనల్తో
గుండె గుండెనూ తట్టి పిలుస్తూ
దిగంతాల పరదాల మీద తోలు బొమ్మై
నవ్వులు రువ్వే దొమ్మరిపిల్ల
మనసు దోసిళ్ళనిండా తేనె వాకల్ను నింపుకు
వీధి వీధంతా మధురిమల్ను నింపుతూ
అపాయం అంచుల మీద వెలుగుల వరూధినిగా
బాల్యం లోగిళ్ళలో వినోదాల వేలం పాట
అమ్మ కొంగు చాటున
మురిపాలు గరపాల్సిన ముద్దు పాప
ముచ్చటగా తాడెక్కి మునివేళ్ళ చివర్న
అలవోక వయ్యారాల చంద్రవంకై
వరద గోదావరి పల్లవించిన ఆమె వదనం
అనీమియా పీల్చేసిన అధర యుగళం
గాలి ఊయల్లో గంతులేసే గుండెగుసగుసలు
పుస్తకాల వనాల్లోనో బాల్యం పూపొదరిళ్ళలోనో
తొక్కుడుబిళ్ళాదుకునేవయసు
రంగుమాసిన గోడల్నెక్కి
పొగమంచు మసక వీధుల్లో
నదీనదాల్ను చూపులుగా మార్చి
ఆశల నక్షత్రాల్ను చెక్కిళ్ళ పై జాలువార్చి
చీకట్నించి, చీకట్లోంచి , చీకట్లోకి
సుధీర్ఘ ప్రస్తానంగా
వినోదాల పూలవల్లరిగా తోచే మౄత్యు మార్గం మీద
వెన్నెల పువ్వులా ధవళా హాసాల్ను రువ్వే
నవ్వుల ఊరేగింపుగా
దొమ్మరి పిల్ల.
2 comments:
కవిత చాలా గొప్పగా ఉంది. కొన్ని ప్రతీకలు అత్యద్భుతంగా ఉన్నాయి.
నేనూ దొమ్మరి పిల్ల పై వ్రాసిన ఓ కవితను పొడిగించలేక అలాగే ఉండి పోయింది. మీ కవిత చాలా సమగ్రంగా ఉంది.
మృత్యు తీగపై మోళీ కట్టే బాలిక
అడుగులో అడుగేసుకొంటూ నడుస్తూంది.
ఆమె పట్టుకొన్న వెదురుగడకు
ఒకవైపు జీవిక, మరో వైపు బాల్యం
వేలాడుతున్నాయి.
చిన్న అపశృతి
రోడ్డుపై రక్తపు మరక.
దేముడు
పని ఇంకెప్పటికి నేర్చుకొంటాడూ?
thank you baba garu
Post a Comment