నేలంతా పరచుకున్న
అలల కొంగు దారంతా
జిలుగు రవ్వలు పొదుగుతూ
ఉదయపు సూరీడు
మగ్గం పనికెక్కక ముందే
జీవితాన్నిభుజాన వేసుకు
ఒంటిరెక్క నావెక్కే వాస్తవం
ఉషోదయం గమకాల
ఆటుపోట్ల మధ్య
క్షణాల్నూ గంటల్ను కలనేసి
పడుగుపేకల అల్లికలో
కాలాన్ని రూపాయలుగా మార్చుకునే
వ్యాపారానికి తెరదింపుతూ
సముద్రం పోయిందండి
గోడల వెనక్కి
స్వార్ధం జాడల నీడల్లోకి
వేనవేల్ జీవితాల్ను
అనిశ్చయతకు వేళ్ళాడదీసి సముద్రం పోయిందండి.
వెలుగంతా దోచేసుకు కనుకొలుకుల మూలల్న
చావు దీపం వెలిగించుతూ
గాజు కళ్ళ పొడి నెగళ్ళ వెనక్కు
సముద్రం పోయిందండి.
ఉదయం వెలుగు జల్లులు పన్నీటి చినుకులై రాలుతూనే
ముంగిట్లో రంగుల హరివిల్లుల్ను బంధించి
పని రధాన్నెక్కి ఊరేగే
సీతాకోక చిలుకల రెక్కల్ను విరిచి
కాళ్ళుండి కుంటిదైపోయిన భవిష్యత్తు రేపట్లోకి
చ్హివికిన చీకటి కుప్పలా విసిరి
సముద్రం పోయిందండి.
సముద్రం కదలికల మీద వ్రాసుకున్న
తరతరాల జీవితాల్లోకి పెరుగుదల
పలకా బలపం స్థాయిని వీడకముందే
మాయల మరాఠీ కథల వైచిత్రిలా
శూన్య వలయాల్ను విసురుతూ
హఠాత్తుగా సముద్రం అదౄశ్యమై పోయింది.
ఊయల్లో ఊగేపిల్ల
మరో ఇంటి వెలుగయే తీరు
ఇంకా చంకొదలని చిన్నది
పిల్లలకోడిగా మారే రహదారి
జానెడు గుడ్డ ముక్కతో అపురూప ప్రపంచాల్ను
మనసు గుప్పిట దాచుకునే మహత్తర
పధకం ఇంకా రూపైనా దిద్దుకోలేదు
అన్నింటికీ అసలు పునాది
మా అరచేతి స్వర్గం సముద్రం పోయింది.
మాఉనికేమాయమై పోయింది. మా రేపు శూన్యమై పోయింది
మాజాతి వట్టి పోయింది.
{గంగవరం మత్స్యకారుల ఆవేదన}
1 comment:
chala baagundi. :)
Post a Comment