Wednesday, January 15, 2014



ఒక అంతరాత్మ
స్వాతీశ్రీపాద

  చిటికెడు దోర దోర  అనుభూతిని
ఆరుద్ర పురుగులా మెత్తని వెల్వెట్ హృదయంలో
పదిలంగా చుట్టి  
చుట్టూ నులివెచ్చని వెచ్చదనానికి
ఎండిన ఆకులూ అలమల్లాటి మాటలు పేర్చి
ఎన్నాళ్ళు వేచి చూడలేదు
పలకబారిన రసాల ఆస్వాదనకోసం?

కసిగాయలు కొరికి కసురుకున్న తమినోదార్చి
చేదెక్కిన అనునయాలు సహనంగా సరిచేసుకు
ఎన్ని చీకటి మడుల్లో వెలుగు విత్తనాలు నాటుకోలేదు
అప్పుడో ఇప్పుడో ఆగిపోయిన కాలం ముళ్ళమీద సుతిమెత్తని అనుభవాలు పరచి
ఎన్ని మార్లు నిన్ను నువ్వు
పూల తివాసీగా భ్రమపెట్టుకోలేదు

ఎండిపోయిన గాలి విత్తనాలై దూర దూరాలకు తరలిపోతున్న
అనుబంధాలకు వీడ్కోలు పలుకుతూ
ఇగిరిపోయిన కన్నీటి ఆవిర్లలో
ఎన్నేళ్ళు కమిలిపోయిన సౌకుమార్యానికి
కాపు పెట్టుకోలేదు
ఎక్కడైనా క్షణం స్పృహ తప్పి
దానికది అంతిమ గీతం పాడుకుందా
దేనికైనా చలించిన మనసు విస్మృతిలో
విచక్షణ మరచి ఆదమరచి
వింత జీవిగా  మారిందా?

రోజుకో కొత్త వింత మొలకలెత్తె ఇక్కడ
ప్రతిక్షణమూ ఒక నిరీక్షణే

నిమిషానికో కొత్త పుంత
రూపుదిద్దుకునే ఈ వర్తమానం
ఎప్పటికీ ఒక నవ నవోన్మేశ నర్తనశాలే

క్షణానికో సముద్రం ఉరకలెత్తే
ఈ రక్త ప్రవాహాలు
నిన్నటికీ రేపటికీ
అల్లుకు౦టున్న సాలేగూళ్ళు
అన్ని౦టి మధ్యా కొట్టుమిట్టాడుతూ
ఒక అంతరాత్మ  



No comments: