Saturday, October 22, 2011

కలగన్నానా?

కలగన్నానా ? కలగన్నానా?
ఇలలోనైనా కలలోనైనా అనుకున్నానా? ’
ఈ క్షణమొకటి నాకోసం వేచి వున్నదని
ఎన్ని యుగాలుగ ఎదురు చూసిన రాగబంధమొకటి
ఇంటి గడపలో ఎదురుచూపులో నిలచివుందనీ
కలగన్నానా..........................

ఎవరో నడిచొచ్చే అలికిడి లేదు
ఎచటా అడుగుల సడి అసలే లేదు
మనికి మూలలో మాట మలుపులో
వెలుగుపూల వానై , చిరుజల్లు వరదముంపై
ఊహల నదిలో ఊరేగింపున మునిగి తేలుతూ
పూలపల్లకై పూర్వ జన్మ సుకృత మొకటి
ఎదుట నిలిచి ఉంటుందని
కలగన్నానా?

క్షణమొక యుగమై మనసొక జగమై
మాటరాని మౌనానికి ఒక జీవిత ఖైదీనై
వెలుగు చీకటుల దాగుడుమూతల రాతి బొమ్మ ఊపిరినై
హుషారైన తుషార వీచిక ఏ మాత్రపు అలికిడి తోచని
స్నేహ స్వప్నమొక స్వర్గద్వారమును తెరచివుందనీ
కలగన్నానా?

No comments: