Sunday, June 27, 2010

రాజీ


" సీతా సీతా "
ఇంకెక్కడిసీత ! అప్పటికే నిలువుటద్దంముందునుంచుని, అటువొంగి శ్రీదేవిలావున్నానా ఇటూ తిరిగి ప్రియమణిలావున్నానా , ఈ పక్కన కాస్త సన్నగావుండుంటే అచ్చు ఇలియానా లాగా కనిపించేదాన్ని కాదూ అని తనలో తను అనుకుంటూ సౌందర్య పోషణలో మునిగిపోయింది సితా మహాలక్ష్మి.
అలాగని సీతను తక్కువ అంచనా వెయ్యకండి.
ప్రైవేట్ కాలేజ్ లో డొనేషన్ కట్టి బీటెక్ అయిందనిపించాక వాళ్ళ నాన్న పెళ్ళిసంబందాల వేట ఆరంభించాడు.
పిల్లలు పెద్ద తెలివిమంతులు కాదనితెలిసే ముందుగానే జాగ్రత్తపడ్డాడా పెద్దమనిషి.
ఎలాగో ఊహించగలరా ... కాలేజ్ కి కట్టవలసిన డబ్బు హాస్టల్ ఫీజులు తడిసిమొత్తం ఎన్ని అప్పులుచేసినా తీర్చేదారేదీ? అలాగని జీతం రాళ్ళలో ఇవన్నీ భరించడం నరమానవుడికి సాధ్యమయే విషయమేనా ?అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే సామెతను బాగా వంట పట్టింఛుకుని జీర్ణించుకుని మరీ అమ్యామ్యా అందించే ఉద్యోగం కళ్ళకద్దుకుని ఇంటికి దూరమైనా సరిపెట్టుకుని మరీ సంపాదించాడు... ఒక్కరికి కాదు నలుగురాడపిల్లలకీ పెళ్ళి పేరంటాలకూ వారి మొగుళ్ళకు ఉద్యోగాలిప్పించుకుందుకు ఆ పైన అన్ని విధాల పెట్టిపోతలకు సరిపడామరీ... టీవీ చానెళ్ళలో పెద్ద పెద్ద స్క్రోలింగ్ లు ఇస్తుంటారు అవినీతి పరులగురించి సమాచారం ఈ క్రింది నంబర్లకు తెలియ జెయ్యండంటూ ..నిజానికి ఎక్కడ ఎవరు ఎంత సంపాదిస్తున్నారో ప్రభుత్వానికి తెలీదా... లక్షలు లక్షలు డొనేషన్లు కట్టి బాహాటంగా తులాలకొద్దీ బంగారాలూ ఇళ్ళూ వాకిళ్ళూ కట్న కానుకలుగా ఇచ్చే ఉద్యోగస్తుల ఇళ్ళలో నిధులేమన్నాదొరికాయనా అందరూ చెవుల్లో పువ్వులు పెట్టుకుని గుడ్లప్పగించి చూసేది? ఇంటి దొంగలను పట్టుకోలేక ఈ బాహాటపు ప్రకటనలు?
ఆపైన దిదిన దిన గండంలా ఎప్పుడు ఎవరొచ్చి రైడింఘ్ అంటారో నని భయంతో నిద్ర పట్టక బీపీ పెరిగి సతమతమవుతున్నా ఉద్యోగం అవసరం లేకున్నా మానేస్తే రేప్పొద్దున సంబందానికి ఎవరొచ్చినా మామగారింకా ఉద్యోగంలో వుంటే ఎవో మర్యాదలు చేస్తాడనీ, లేకపోతే తనకేదో కొరవపడిపోతుందనే బెంగపడిపోయే పెళ్ళికొడుకులను చూసాక అందరిపెళ్ళిళ్ళు అయితే గాని ఉద్యోగవిరమణ చెయ్యదలచుకోలేదు.
ఆ పరంపరలోనే పెద్దకూతురు సీతకు పెళ్ళి సంబందాలు వెతుకుతున్నాడు.
"సీతా సీతా" తల్లి మళ్ళీ పిలిచింది. కాదు కొంప కూలేలా అరిచింది.
"అబ్బ! ఏంకొంపలు మునిగి పోతున్నాయని అలా అరుస్తున్నావు? కాస్త నెమ్మదిగా పిలవవచ్చుగా ?" రుసరుసలాడుతూ వచ్చింది సీత.
"ఎంతసేపూ ఆ అద్దం ముందు కూర్చోకపోతే పూజకు వేళవుతోంది ...కాస్త అక్కడికి కావలసినవి సుధ్ధం చెయ్యొచ్చుగా?"
సీత తల్లి శంకరికి భక్తి పిచ్చి. మొగుడు న్యాయాన్యాయాలువదిలేసి జనబాహుళ్యాన్ని పీడించి డబ్బు సంపాదించినా తన పూజలకు మెచ్చి బాబాగారే అపారమైన ఆస్థిని ఇస్తున్నారని ఆమె నమ్మిక.
అందుకే ఆ బాబాను మంచిచేసుకుందుకు గురువారాలు పెద్దఎత్తున పూజలు పునస్కారాలతో పాటు ఉపవాసమూ చేస్తుంది. తను చేసే టీచరమ్మ ఉద్యోగానికి వెళ్ళి వచ్చాక , పిల్లల గోలతో పాటు ఉపవాసం వల్ల నీరసించి తిక్కతిక్కగావున్న కోపాన్ని పిల్లలమీద చూయిస్తుంది.
అక్కడికీ ఆర్నెల్లక్రితం ఎలాగూ అడిగేవాడు లేదన్న ధీమాతో తనే కదా ఎచ్ ఎమ్ నన్న గర్వంతో నాలుగువందలిచ్చి తనస్థానంలో ఓ బీదపిల్లను అపాయింట్ చేసుకుంది.
ఏదో గతిలేనివాళ్ళకు సాయపడుతున్నాను , అంతా బాబా దయ అనుకుంది కాని ఆవిషయం పైకి పొక్కి పై అధికారులు గుట్టు చప్పుడు కాకుండా రెడ్ హాండెడ్ గా పట్టుకున్నాక, మొగుడి ధనబలం అధికార బలంతో ఆగొడవనుండి బయటపడేసరికి అటు వేలకు వేలూ లంచమివ్వాల్సి వచ్చింది, ఇటు మొగుడు వాళ్ళడిగినవన్నీ చెయ్యకా తప్పక చావుతప్పి కన్నులొట్టపోయిన చందమైంది.
అందుకే ఎప్పుడైనా అత్యవసరమ్ అనుకుంటే మొత్తానికి స్కూలే మూసేసి పిల్లలకు అనధికారిక సెలవు ప్రకటిస్తుందికాని మరిక అంత పెద్ద రిస్క్ తీసుకోదలచుకోలేదు.
అసలే ఉపవాసం స్కూల్లో పిల్లకోతులకు ఒక్కటీ వచ్చిచావదు...అలాగని వాళ్ళను తిట్టేందుకూ లేదు, కొట్టేందుకూ లేదు.
చదివి చచ్చినా లేకున్నా కనీసం వాళ్ళను రోజంతా భరించి చావాలి. దిక్కుమాలిన చావు.
అసలు టీచింగ్ అంటేనేముందునించీ పెద్ద అయిష్టం. కాని ఎంత ప్రయత్నించినా ఏఉద్యోగమైనా దొరికిచస్తేగా? ఇది కూడా వరసగా నలుగురాడపిల్లలుపుట్టేసరికి తండ్రి వాళ్ళకాళ్ళు వీళ్ళకాళ్ళు పట్టుకుని మరీ చివరికి ఏజ్ బార్ అయిపోయే సమయంలో ఇప్పించాడు.
సెలవులూ జీతం రాళ్ళూ బాగానే వున్నాయి కాని రోజూ వేళకు వెళ్ళాలంటేనే చ్చేచావుగావుంది.
ఎంత దాచుకున్నా సీత పెదవులమీద నవ్వు శంకరి చూపుదాటిపోలేదు.
"అదొక్కటే వచ్చు పిచ్చ మొహంలా నవ్వడం ... ఏది చెప్పినా .."
"నువ్వంతకంటె ఏమంటావులే , ఎప్పుడయినా ఏదైనా మాకోసం చేస్తే గద... పక్క వాళ్ళని చూడు .."
పిల్ల మాటలకు ఉక్రోషం వచ్చి ,
"ఏంటే , ఏంటి నీ గోల నేనూ వెయ్యి అనగలను...నువ్వూ చూడు నీతోటి పిల్లల్ను ఎంతబాగా చదివి ఫ్రీ సీట్ లుతెచ్చుకున్నారో ..."
అంతే సీత పెద్దపెట్టున ఏడుస్తూ గదిలోకి వెళ్ళి తలుపులు బిడాయించుకుంది.
ఇహ నాల్రోజుల పాటు తియ్యదు. తండ్రి కూడా ఊళ్ళో లేడాయె... గొణుక్కుంటూ పూజ ముగించింది శంకరి.
శుభ్రంగా తప్పుల్లేకుండా మాతృభాషకూడా చదవడం రాదు శంకరికి.
ఆతప్పులతడకల పూజాస్తోత్రాలకే భగవంతుడు సంపదలిస్తే మరిక రోజూ స్వచ్చంగా మూడు పూటాలా గుళ్ళో పూజలు చేసే పూజారులకెన్ని వరాలివ్వాలి ఆ దేవ దేవుడు.. అందుకే మనం సామెతను కాస్త మార్చుకోవాలి. ప్రేమ గుడ్డిదీ మూగదీ అన్నారు కాని భగవంతుడి ప్రేమ ఆరెంటితో పాటు చెవిటిది కూడా.
********************
ఓ పక్క తల్లి అపశ్రుతుల స్తోత్రాలు వినిపిస్తున్నా సిత మాత్రం ఏడుపు ఆపి మిగిలి వున్న గోళ్ళను టకటకా కొరికేస్తోంది. అసలు అలా కొరికి కొరికే గోళ్ళన్నవి పిసరంతకూడా పెరగట్లేదు అయినా కోపం వచ్చినప్పుడల్;లా ఆటో మాటీక్ గా వేళ్ళు నోట్లోకి వెళ్ళిపోతాయి.
అసలు ఎవరో ఒకరిని పెళ్ళి చేసుకుని వెళ్ళి పోతే గాని తల్లి తిక్కకుదరదు.
ఎవర్ని చేసుకోవాలి? చిన్నత్త కొడుకు చూడ్డానికి బాగానే వుంటాడు. కాని తల్లికే వాళ్ళంటే అస్సలు గిట్టదు.
వీరేశ్ చదువులో అంత చురుకు కాదు అయితేనేం ? తనేమంతపెద్ద తెలివైనదా? గంతకు తగ్గబొంత! బాగానేవుంటుంది.
కని వాడు ఎవరినో ప్రేమిస్తున్నాడని చెప్పుకుంటారు, నిజమో అబద్ధమోకాని... పోనీ ఓ సారి ప్రయత్నిస్తే ...
అమ్మో ఇప్పుడు తలుపు తీస్తే ఇంకేమైనావుందా?
రేపు అమ్మ స్కూల్ కి వెళ్ళగానే ....
తెల్లారి తల్లి స్కూల్ కి వెళ్ళే వరకూ అరచి గీ పెట్టినా తలుపు తియ్యలేదు సీత. వుదయం తల్లి వెళ్తు వెళ్తూ తలుపు దగ్గర ఆగి " నువ్విలా సతాయించడం ఏం బాగా లేదు. లేచి స్నానం చేసి అన్నం తిను " అంటూ బ్రతిమాలింది.
అప్పటికే కోపం తగ్గడంతో పాటు ఆకలి కూడా వేస్తూండాటంతో లేచి తలుపు తీసుకుని బయటకు వచ్చింది.
టైమ్ అవడంతో తల్లికి ఎక్కువ మాట్లాడే అవకాశం లేదని తెలుసు.
స్నానం చేసి తీరిగ్గా ముస్తాబై నెయిల్ పాలిష్ వేసుకోబోయేముందు గుర్తొచ్చింది.
మాట్లాడదామని ఫొన్ ఎత్తింది.
దిస్ ఫెసిలిటీ ఈజ్ నాట్ అవైలెబుల్ ... పూర్తిగా వినకుండానే ఫోన్ విసిరికొట్టింది..
తల్లి అనుమానం తెలిసినదే ఎవరికీ ఫోన్ చెయ్యకూడదు.. ఎలా? ఇప్పుడెలా మరి?
కోటి ఉపాయాలకు కోటిన్నొక్క మార్గాంతరాలు.
కిందరెంట్ కిచ్చిన వాళ్ళింటికి వెళ్ళి అక్కడ్నించి ఫోన్ చెయ్యాలి వెంటనే లేచి చెప్పులు వేసుకుని బయల్దేరింది.
వెళ్ళగానే అడగలేదుగా ... ఓ అరగంట పాటు వాళ్ళతో అఖ్కర్లేని సుత్తంతా మాట్లాడుతున్నా మనసు మాత్రం పోన్ చుట్టూనే తిరుగుతోంది.
చివరకు ఆ పిల్ల ఒక్కత్తీ వున్నప్పుడు ధైర్యం చేసి అడిగింది-"ఒక్క ఫోన్ చేసుకోనా?"
" ఓ దానికేం చేసుకో" అర్ధం చేసుకున్నట్టుగా ఆ పిల్ల లేచి లోపలకు వెళ్ళింది.
తడబడుతూనే అత్త ఇంటినంబర్ డయల్ చేసింది సీత.
అదృష్టం బాగానేవుంది వీరేశ్ ఫోన్ ఎత్తాడు.
"వీరేశ్ ఒక్కసారి ఇంటికి రా , నీతో మాట్లాడాలి ..."
"చెప్పరాదా సీతా, ఇంటిదాకా రావాలా?"
"ఉహు ఇంటికి రా" ఫోన్ పెట్టేసి వచ్చిన పని అయిపోవడంతో థాంక్స్ చెప్పి లేచి వచ్చేసింది.

**********
పది నిమిషాలకల్లా ఇంట్లో వున్నాడు వీరేశ్.
"చెప్పు సీతా, ఏమిటి సంగతి..." చిన్నప్పటినుండి వింటున్నదే అయినా అతని స్వరంలో ఓ విధమైన లాలన, మెత్తదనం.
పెద్ద రంగు లేకపోయినా చూడటానికి బాగానే వుంటాడు. ఏం బిజినెస్ లు చేస్తారో ఏం తిప్పలు పడతారో కాని ఒక్కరోజూ ఇదిలేదు అని అనుకోగా వినలేదు.
దర్జాగా ఖర్చుపెడతారు విలాసమ్గా బ్రతుకుతున్నారు. జీవితంలో అంతకన్న ఏం కావాలి?
"వ్చీరేశ్ ఒక్క మాట అడగనా .. ఏం అనుకోవుగా?"
" చెప్పు సీతా ... నువ్వు పుట్టినప్పటినుండీ చూస్తున్నాను నాదగ్గర మొహమాటమెందుకు?"
" వీరేశ్ నన్ను పెళ్ళి చేసుకుంటావా?"
"సీతా... ఏంటి నువ్వడిగినది? మతికాని పోలేదు కద! ఒళ్ళుతెలిసే మాట్లాడుతున్నావా?"
"లేదు బావా, చిన్నప్పటినుండి నువ్వంటే నాకు ఎంతో ఇష్టం , కాని నీకు తెలుసుగా మామమ్మీ మమ్మల్ని ఎన్ని కట్టుబాట్లలో పెంచిందో ... నాకు ఈ పరిసరాలనుండి పారిపోవాలనుంది ..నన్ను పెళ్ళి చేసుకుంటావా?"
"సీతా , మీ అమ్మ దృష్టిలో మాకు అస్సలు విలువేలేదు.. మమ్మల్ని ఈగలుగానో దో మలుగానో చూస్తుంది. మీ నాన్న పెద్ద ఉద్యోగస్తుడని మేం కంటికి ఆనం
అందుకే వరసైన వాళ్ళయినా మీ మీద మేం ఆశలు పెంచుకోలేదు.. అది జరిగే పని కాదులే ..."
"లేదు బావా ... నువ్వు సరేనంటే చాలు నేను ఉన్నపళంగా నీతో వచ్చేస్తాను..."
" ఈమధ్య సినిమాలు ఎక్కువగా చూస్తున్నట్టున్నావు... అన్నీ పిచ్చి పిచ్చి ఆలోచనలే వస్తున్నాయి నీకు... అయినా నీకు తెలిసేవుండాలి నేను డాలీ ఎప్పుడో కమిటయిపోయాం .. పెళ్ళంటూ జరిగితే డాలీ తోనే ..."
"బావా... మరోసారి ఆలోచించు..."
" మీ అమ్మ వచ్స్తే ఇంకేమయినా వుందా నేనే నీకు సైట్ కొడుతున్నా అనుకుంటుంది .. ఏంతోచకపోతే టీవీ చూడూ లేదూ ఏవైనా పుస్తకాలు చదువుకో...వస్తా..." వీరేశ్ బయటాకు వెళ్ళాడు. సీతా చాలా సేపు అలాగే కూర్చుండి పోయింది-ఎంత వరకంటే తల్లి వచ్చినది కూడా గమనించనంతగా...
అయితే వారం తిరక్కుండా సంబంధం వెతికి సెటిల్ చేసి నిశ్చితార్ధం పెట్టుకున్నాక గాని సీతకు అర్ధం కాలేదు ఆ రోజు శంకరి మన మాటలు విందని.
ఈ చూసిన సంబంధం పెద్ద గొప్పగా ఏం లేదు.
పిల్లాడు అచ్చు పల్లెటూరి రకం. అప్పచెల్లెళ్ళు పెద్దగా చదువుకోలేదు ..ఇతనే చివరివాడు ఏదో ఉద్యోగం చేస్తున్నాడు ...
ఎలాంటి వాతావరణం నించి ఎలాంటీ చోటికి వెళ్తోంది , సిటీలో పుట్టి పెరిగి ... పిల్లాడు చదువుకుంటే మాత్రం రేపు తన వాళ్ళంతా ...
తెల్లారితే నిశ్చితార్ధం ... సందు చూసుకుని వీరేశ్ ని ఒంటిగా కలిసింది...
మళ్ళీ అదే అభ్యర్ధన...
" సీతా ఎక్కువతక్కువ ఆలోచించకు... చక్కటి సంబంధం కళ్ళుమూసుకుని చేసుకో ... "
"అంతేనా ..బావా .."
"అంతే .."
"నువ్వు చెప్తున్నావని చేసుకుంతున్నా..."
***

ఎప్పటిమాట..
పెళ్ళై తొమ్మిదేళ్ళయిపోయింది..
నిజమే అన్ని రకాలా తండ్రి ఆదుకుంటున్నాడు.. అల్లుడి చదువు తక్కువనిపించి మూడేళ్ళపాటు పై చదువులకు అన్ని ఖర్చులూ భరిస్తూ ఇద్దరినీ అమెరికా పంపాడు...
కావాలనడం ఆలస్యం కొండమీద కోతినైనా తెచ్చిస్తాడు..
తమకే కాదు నలుగురాడపిల్లలకీ ....
అల్లుళ్ళూ అదృష్టవంతులు ... బాధ్యతగా అన్నీ అమర్చేమామగారు ...
తడుముకోనఖ్ఖరలేని సౌభాగ్యం..
కాని మనసునిండా లోటే ...
ప్రతివాళ్ళూ గుచ్చి గుచ్చి చూస్తున్న ఫీలింగే...
నిజమే బట్టలు విప్పినగ్నంగా మిలబడాలా మనమేంటో తెలియాలంటే ...
వచ్చిన ఆదాయంలో ఒద్దికగా పెరిగి పెద్దయిన వాళ్ళకున్నంత స్వఛ్చత తమకెక్కడిది?
ఇప్పుడు కొట్టుకుపోయేంత సంపాదించినా నాన్న పట్టుమని పదిమెతుకులు తినలేని రోగిష్టి... అమ్మ సరే సరి ...
తన అహంకారం కి ప్రతిగా ఏం మిగిలింది?
అన్నీ రోగాలే నెలకి పదిరోజులు ఆసుపత్రిలో వుండాలిసిందే ....
రోగాలుకూడా పూజలకు ఫలితంగా బాబాగారే ఇచ్చారని చెబ్దామనిపిస్తుంది.
" ఎక్కడ ఏ ప్రేమ సామ్రాజ్యంలో విహరిస్తున్నావు ..పిల్లది మంచం అంచుకు దొర్లినా ఒళ్ళే తెలియటం లేదు... "
అతని మాటల్లో ఎంతకసి..
అదే అమ్మానాన్నముందు ఎంతతియ్యగా ఎక్కడ కందిపోతానో అన్నంత అపురూపంగా చూసుకుంటున్నట్టు నటిస్తాడు . నిజం తను చెప్పినా వాళ్ళు నమ్మనంతగా...
కళ్ళు తుడుచుకుందామన్నా కన్నీళ్ళూ ఇంకిపోయి చాలాకాలమైంది..
అదీ భగవంతుడిచ్చిన వరమేనేమో.........

No comments: