Sunday, October 30, 2011

పరాధీనత

పరాధీనత



 ”ఇహ నా వల్ల కాదు"  వెయ్యిన్నొక్కోసారి పలవరింత.
కసి కొద్దీ ఏకాంతం విసురుతున్న
పీడకలల సూదిమొనల మగత
కాస్త కాస్త గా సచేతనత నరాల్లోకి జారి జారి
ఎద లోలోపలి నిశ్శబ్దం ఉరుముల మెరుపుల్లో
వెలవెల బోతున్న జీవితం
నిద్రలోకి జారబోతున్న కనురెప్పల నరాల రహదారుల్లో
పచార్లు చేస్తూ గతం పులులూ సింహాల ఘర్జనల ఘీంకారాల్లో
వినీ  వినిపించని బలహీనపు గొంతు
 ”ఇహ నా వల్ల కాదు"  వెయ్యిన్నొక్కోసారి పలవరింత
చుక్క చుక్కగా ఆలోచనల సుప్త చేతనలోకి ఇంకుతున్న నిద్ర
ఊపిరాడకుండా అచేతన రాత్రి లోకి తోసేసి
మనసు కందనంత అగాధంలో చుక్కల నది మధ్యన
వెలుగు రేఖల ఊయల్లూగుతూ
ఎక్కడో చిటారుకొమ్మల చివరన చిక్కుకుని జారి
పడిపోతున్నఆ క్షణం 
”ఇహ నా వల్ల కాదు"  వెయ్యిన్నొక్కోసారి పలవరింత

No comments: