ఎప్పటి మాట మిత్రమా!
ఎప్పటి మాట మిత్రమా ఎప్పటిమాట అది
చిరు నవ్వులు కలబోసుకు జీవితాలను ఆరేసుకు
అక్షరాల మధ్య వికసించని గులాబీ మొగ్గల్లా ఒదిగి
నిశ్శబ్ద సరిగమలను చెరిసగం పంచుకున్నాం
ఉప్పునీటి కెరటాల్లో కొట్టుకుపోతూ ఒకరికొకరం
గడ్డిపోచల ఆధారాలమయినాం
ఒకరి చేత్తుల్లో మరొకరి జీవితాన్నుంచి
నీళ్ళ మీదా నిప్పులమీదా ముళ్ళమీద మల్లెలమీద
ఒకలాగే నడిచేసాం
ఎప్పటిమాట మిత్రమా
నిద్రపట్టని రాత్రులను పాటలుగా కరిగించి
రాగాలాపనల్లో ఒదిగి పరవశత మత్తులో
నీ చేతి పూల దిండు పై ఒరిగి
సుఖసౌఖ్యాల ఆవలితీరానికి
అలవోకగా చేరినది
ఎప్పటిమాట మిత్రమా
బ్రతుకు భయాలూ రేపటి కలలూ
చీకటి క్షణాలూ వెన్నల సొగసులూ
తలిరాకుటూయలలా కదిలే సౌమ్యత
తుఫాను భీభత్సపు రౌద్రపుటలలమీదా
ఇద్దరం ఒకటిగా ఊయల్లూగినది ఎప్పటిమాట మిత్రమా
కాలం ఎడారి మధ్యన కన్నీటి చారికలను తుడిచేసుకుంటూ
ఒకరి చిరునవ్వులను మరొకరి కంటి వెలుగుగా ప్రతిబింబిస్తూ
మాట మనసు మనికి ఒక్కటిగా
ప్రతిక్షణం మలుచుకున్నది ఎప్పటిమాట మిత్రమా
అసహనంగా ఈ క్షణం
దోచుకుపోయినా సాన్నిహిత్యం సాక్షిగా
ఊరూ వాడా ప్రతికొండా కోనా
తప్పిపోయిన అనుభూతుల అన్వేషణలో
ఉపవసిస్తున్న ఆశలూ బక్కచిక్కిన
భావాల సంక్షోభంలో
ఎన్నాళ్ళ మాటిది
No comments:
Post a Comment