Saturday, October 17, 2009

తప్పేమీకాదు

అవును తలవంచుకు పోవటం తప్పేమీ కాదు.
నిజం నీవెనక నీడనుకున్నాక
అది పాము పడగై నాణెంగా దొర్లి ఆవైపు
అబద్ధం తొడుగు తొడుక్కున్నా
గొప్ప వింతేమీ కాదు -విచిత్రం అంతకన్నా లేదు

పెదవులు విచ్చిన విష కుసుమాల్లా
తమలోలో పలికి లాగి లాగి
ఊపిరాడని వ్యూహంలో
అదౄశ్య వలయాల్ను చుట్టూ పరచి
జీవకళల్ను సమూలంగా పీల్చేసుకోవడం
తప్పేమీ కాదు లోక సహజతకు లోటేమీలేదు

అహం చిరు పాప అంతరాంతరాళాల్లో
ప్రాణం పోసుకుంటుంటే ఆచిరు ఉనికికి
రంగులకలలద్ది రేపటికి
ఊయలల్ను పేనుకోకున్నా తప్పేం లేదు
ఆదిలోనే చిదిమేస్తే అది భ్రూణ హత్యేమీకాదు.

అవును తలవంచుకు పోవటం తప్పేమీ కాదు
కలల మిణుగురులు కాలం చీకట్లో సద్దు మణిగినా
సద్దుమణిగిన ఏకాంతం గుండెలో
ఎన్ని అపశౄతులు సందడించినా
తలవంచుకు పోవడం తప్పేమీ కాదు.

No comments: