ఓ ఖాళీ జీవితం
తెల్ల కాగితమై ఎదురుగా చేతుల్లోవుంది.
కాలం కుంచెకు మనసునద్ది
కళాఖండాలు సౄష్టిస్తారో
ఉట్టుట్టి పడవల్ను చేసి
ఎడారి ఏటి వాలుకు ఒదిలేస్తారో
అదంతా మీఇష్టం.
నాకు మాత్రం
అలల కలలపూదోట
అక్షరాల విరిబాలల్ను
ఊయల్లూగిస్తూ
నిశ్శబ్ద గమకాల్ను
గుండెను నొక్కి మరీ
పలికిస్తుంది.
కొండా కోనా దూరానికి
గీసిన పెన్సిల్ చిత్రాలా
శబ్దరాహిత్యాన్ని కొలుస్తున్నా
ఒక్కసారి ..ఒక్కసారంటే ఒక్కసారి
దరిదాపుల్ను
కంటిచూపు స్పర్శతో తడిమిచూడు
సుతారంగా రెక్కలల్లార్చే
గాలి చూపుల గిలిగింతలూ
వివరణకందని పులకింతల్ను
నిలువెల్లా రాగాలుగా మార్చుకోలేదూ?
నిలువెల్లా కదలిపోయిన మనసు
జలజలా రాల్చే పున్నాగల్ను
అదిగో అనుభవాలపొరలమధ్య పదిలంగా
పరిరక్షించుకున్నానుగా ..
ఇప్పుడూ అవి గాలి వాటుకు
సుగంధాల్ను మోసుకువస్తూనేఉన్నాయి
ఆశల తివాచీ పరచుకు
ఆకాశం మలుపుల్లో
మరువపు చెలమల్ను
వేలికొసల పలకరింపుల్లో
పంచుకున్నది
మనసా శరీరమా?
ఏ క్షణానికాక్షణం
అనుభూతుల అమౄతాన్ని
తనివితీరా తాగితాగి
అమరమైపోయిన నిన్న
నేడు నా వర్తమానం
రేపది నా అపార సౌఖ్యానంద సంపద
జీవితాన్ని పొందికగా పెదవుల వెనక మలచుకున్నాక
ప్రతిమాటా
ఓతియ్యని మాధుర్యమే.
పునరపి జననం పునరపి మరణం
అందుకే గిర్రున తిరిగోచ్చే ఉగాదినై
నేను మళ్ళీ మళ్ళీ
కావ్య ఖండాల్ను
పరిచయం చేస్తూనే పోతాను.
No comments:
Post a Comment