నేనూ నా మౌనం ప్రియసఖీ
చూపుల్తో ఊసులాడుకుంటూ
రాత్రి చీరకొంగూంచుల్ను
కొనవేలి చివర్న ముడులువేస్తూ
విప్పుతూ
ఒక క్షణం
మరంతలోనే
కాలం మగ్గంమీద నిన్నా రేపులను
పడుగుపేకలుగాపరచుకుంటూ పోతున్న
వర్తమానం కలనేత సరిగంచు మీద
రేపటి సీతాకోక చిలుకల్ను తళుకుముక్కల్లా
అతికించాలని అహరహం
కలవరపడే మా పలవరింతల్ను
విదిలించుకు
క్షిపణుల్లా దూసుకుపోతే
రెప్పవాల్చని విలక్షణాలమై నేనూ తనూ...
రెండు సుదూర తీరాలను
ఒక స్నేహ సమ్మిళిత
సముద్రంతో ముడి వెయ్యాలని
తపనలో కాగి కాగి
లోలోన రగిలి రగిలి
భళ్ళున ప్రజ్వరిల్లే అగ్ని పర్వతాలమై
వెక్కిళ్ళు పెడుతున్న సమయాన
పెనుతుఫాను వరదతాకిడిగా మారి
నాఉనికిని కూకటి వేళ్ళతో పెకలించుకు
నీటి పల్లకీ నెక్కి
అదౄశ్య అస్పౄశ్య తీరాలకు
సాగిపోతున్న ఈ క్షణాన
నావెన్నంటే నా వెంటే
నా ప్రియ సఖీ మౌనం
ఒకరి కొకరుగా...
No comments:
Post a Comment