కళ్ళు మొహంలోంచి మొలిచి
ముందుకే చూస్తుంటాయి
శూన్యావరణాల కొలతల్లో
చిక్కులుపడిన చూపు
వెర్రి నవ్వొకటి అలవోకగా విసిరేస్తుంది
అయినా
నా వెనకాల వెకిలి వేషాల అలికిడి
సవర్ణ దౄశ్య మాలికగా
మనో వీధిలో బీటు కోడుతూనేవుంటుంది
గుండెకు విసిరికొట్టిన మాటలు
రెక్కలు విరిగిన పసిపాప పక్షులై
ఠపఠపా నేలకు రాలుతూనేవుంటాయి
కాళ్ళకిందా నడినెత్తినా
వేడి కుంపట్ల అడకత్తెరలో
ముక్కలు ముక్కలై వికీర్ణమైన
పాలిపోయిన రక్తపు చుక్కలు
సంకీర్ణమౌతూ సమైక్యిస్తూ
ద్రవీకరించి ప్రవహిస్తూ
మాటల మూలాల్లోకి మౌనంగా జారిపోతాయి
నాముందూ వెనకా
నలుదిక్కులా
నడిచే ప్రతి వెలుగుముక్కా
చీకటిచుక్కా
అన్నీ నా కలం నింపే అక్షర సముద్రాలే
స్వాతీ శ్రీపాద
No comments:
Post a Comment