Monday, October 21, 2013



పాలపుంతనై.........


1.
ఒక చిన్న భావన
రెల్లు పూల కదలికలా అటూ ఇటూ ఊగి ఊగి
చిన్ని విత్తనంలా లోలోపల ఒదిగిఒదిగి
ఇంతలా కంచుకోటలా ఎప్పుడు మొలకెత్తిందో కాని
వామనావతారమై అటు హృదయ సీమనూ
ఇటు అక్షర ప్రపంచాన్నీఆక్రమించింది  చాలక
అణువణువునూ స్వాధీన పరచుకుంటూ..............
2.
పసిపాపలా మారి నన్ను నేను పరిత్యజించి
తూనీగ రెక్కలమీదా, టేకు పూల పరిమళాల అలల్లోనూ
జలపాత ప్రవాహాల హోరులో ఎదసొదలను కడిగేసుకుంటూ  
గాయపడి కుళ్ళిపోయిన గతాన్ని కరెంట్ తీగలపైకి విసిరి
 పిల్ల కాలువలా నా లోకి నేను ప్రవహించే నదినై.........
౩.
కాస్సేపు చిక్కి శల్యమై ఇసుక మేటల మధ్య
మౌన ధ్యానమై గ్రీష్మ తాపాలను వడబోసుకుంటూ
అంతలోనే నింగీ నేలా కొలిచే వర్షపు ధారనై
ఆకతాయి గ అటు వంగి హరివిల్లు మీటి ,
ఇటు సాగి మెరుపు ముత్యమై
శరత్కాలపు వెన్నెల తెరలా
ఎన్ని హొయలు ఎన్నెన్ని కళలు
4.
రణగొణ ధ్వనుల భుజాలపై బరువునాంచి
కాలాన్ని గుప్పిట దాచుకున్నాననుకుంటాను
సుమధుర గాన మాధుర్యాల గమకాలనెక్కి
స్వర్గారోహణమని సంబరపడతాను
కానీ
రాత్రి నిశ్శబ్దంగా కాపలా కాసే వట వృక్షసమూహాలూ , నదీపాయలూ
నాతో సంభాషించే వేళ, చీకటిలో  నీడలా
నీ ఉనికి ఒక గగుర్పాటవుతుంది
అక్షరాలూ మాటలూ కాని భాషలో
మనం కలబోసుకునే సమయం
 రాత్రంతా వసంతాలను సాగు చేస్తుంది
ఉదయం  గుమ్మం ముందు వాలిన
 తొలి వెలుగు రేఖల్లో మోసుకొచ్చిన పలకరింపు
దోసిళ్ళతో అందించే చిరునవ్వులు
పెదవులపై తేనే వాకల జీవనదులవుతాయి
5.
ఎవరికీ అర్ధం కాని ఒక తేజస్సు
నాచుట్టూ చుట్టూ తొలి ప్రేమికుడిలా తిరుగుతూనే ఉంటుంది
కొత్తగా పుట్టిన తోక చుక్కలా
అందుకే నాకు నేనే ఒక  ప్రజ్వలిత ఖగోళాన్ని
నిత్యం కొత్త మెరుపులు విసిరే పాలపుంతను  

No comments: