రాత్రంతా..........
రెక్కలు విరిగిన ఈ సాయంత్రం 'కదల్లేక మెదల్లేక
ఓ మూలన కుప్పకూలి పడివుంది.
ఉదయం నుండీ ఊపిరాడక ఉక్కిరిబిక్కిరవుతున్న సమయం
ఎరుపెక్కిన కళ్ళలో
అస్తమించిన ఉత్సాహపు అగ్ని గోళం ఛాయలు
రంగు వెలసిన ఊహలను నీరెండలో అద్ది
కునికి పాట్లు పడుతూ
రాత్రి చీకటిని నాంచేందుకు దాచుకున్న
అశ్రు సంపదనాపలేని కనురెప్పల నిండు మేఘాలు
ఉండుండి ఓ జల్లును వడగళ్ళ వానలా
ఓ విసురు విసురుతాయి
తాకుతూనే కరిగిపోయినా కనిపించని కముకు దెబ్బలు
కసిదీరా హృదయాన్ని నవులుతూనే ఉంటాయి.
కంటి రెప్పల మీద
పడగ విప్పిన వేదన విషనాగు
నిద్ర కోసం ఎదురు చూస్తూంటుంది
రాత్రంతా దాగుడు మూతలాట అనివార్యంగా సాగుతుంది.
No comments:
Post a Comment