Friday, July 6, 2012

సమ తూకం

” ఈ వారం కూరగాయలు తెచ్చుకోలేదు…. ఇవాళింకా  బుధవారమే … పొద్దున లేచినప్పటి నుండి ఏం

swatee sripada
వండాలా అని తడుముకోడమే సరిపోతుంది. పప్పులో వేసేందుక్కూడా ఏమీ లేవు…” వంటింట్లోంచి శారద గొణుగుడు వినబడుతూనే వుంది.  నిజమే! శనివారం అమ్మా నాన్నను చూసి రావడానికి ఉదయమే ఊరెళ్ళడం వచ్చేసరికి రాత్రి పదిన్నర దాటి పోయింది. ఆదివారం లేవడమే ఆలస్యం. తొమ్మిదిన్నరకి లేచి తీరిగ్గా కాఫీలు తాగి టిఫిన్ సెంటర్ నుండి ఈ రోజుకి దోశలో ఊతప్పమో తెచ్చుకుందామని  ఆలోచించుకునే లోగానే దిగారు పిల్లా పాపల్తో సహా దూరపు బంధువులు.  నిజానికి ఉన్న ఒక్క సెలవురోజూ ఇలా వెచ్చించడం మనసుకు ఎంతమాత్రం బాగాలేదు. అయినా  ఇంటి ముందుకొచ్చినాక ఏమనగలం… పిల్లకు పెళ్ళి చూపులు …అబ్బాయి ఇక్కడ వుంటాడు గనక పిల్లను తీసుకుని ఇక్కడికి రమ్మన్నాడట. మాఇంట్లో చూపించాలనుకుని వచ్చారు.

ఇహనేం … ఇక హడావిడి మొదలు.

ముందుగా ఇల్లు సర్దడం.

అందులో అంతకు ముందు రోజు ఉదయమే వెళ్ళి రాత్రి ఆలస్యంగా వచ్చామేమో … పిల్లల పుస్తకాలు ఎక్కడివక్కడ పడి ఉన్నాయి. వాషింగ్ మెషిన్ లో వెయ్యల్సిన బట్టల మేట ఓ మూల … పిల్లల పుస్తకాల బాగులు ఓ మూల …

పిల్లల్ని గదమాయించి వాళ్ళ దృష్టి హో వర్క్ లమీదకు మళ్ళించి నేను ఇల్లు సర్దడం లోనూ శారద అందరికీ ఉప్మాలు కాఫీలు చెయ్యడంలోనూ పడ్డాము. ఇవన్నీ ముగిసేసరికి మళ్ళీ మధ్యాహ్నం భోజనాల సమయమయింది.

ఫ్రిజ్ లో ఉన్న కూరలతో సాంబార్ చేసి ఆలూ వేపుడు మజ్జిగ పులుసు  తో అతిధి మర్యాదలు కానిచ్చింది శారద.

ఇంతకూ వచ్చిన సుబ్బారావ్ శారద చుట్టమవడం నా అదృష్టం.శారద పినతల్లికి వేలు విడిచిన తమ్ముడి కొడుకు… సుబ్బారావ్ భార్య మా అమ్మవైపు దూరపు బంధువైనా దానికి పెద్ద ప్రాముఖ్యత నివ్వలేదు.

అందుకే పెద్దగా నసుగుడేమీ వినబడలేదు.

ఎలాగు వేసవి కనక సాయంత్రం పెళ్ళి చూపులకి కాజూ హల్వా, కారప్పూస తో పాటు రెండు పెద్ద ఫాంటా సీసాలు షాప్ నుండి తెచ్చారు వాళ్ళే…

ఆ తతంగమంతా ముగిసి ఏమాటా ఫోన్ చేస్తామంటు వెళ్ళారు అబ్బాయి, అతని తలిదండ్రులు. రాత్రి పెద్దగా ఆకల్లేదంటూ స్వగృహ నుండి తెచ్చుకున్న చపాతీ కూరలతో కాలక్షేపం చేసే సరికే పదిన్నర దాటింది.

అప్పటికే పిల్లలు నిద్ర ఆపుకోలేక తూలుతున్నారు.

ఆడవాళ్ళు బెడ్ రూమ్ లో సర్దుకుందుకు మగవాళ్ళం హాల్ లో పక్కలేసుకుందుకు తీర్మానించుకున్నాక …..

” శారదా మీ ఋణం తీర్చుకోలేము. సరిగ్గా మాఇంట్లో, నీ కూతురికి  జరిగినట్టే పెళ్ళి చూపులు జరిపించారు.మళ్ళి ఉదయం మీరిద్దరూ ఆఫీసులకి పిల్లలు స్కూళ్ళకి వెళ్ళాలి . ఉదయం అయిదున్నర బస్ కి వెళ్ళిపోతాము .. ఏదో మీ దయ వల్ల ఈ సంబంధం కుదిరితే మీ చలవ వల్లే దాని నెత్తిన నాలుగు అక్షంతలు పడతాయి… “అంటు భార్యా భర్త లిద్దరూ వారి కృతజ్ఞత తెలియ జేసి,

” పిల్లలు నిద్రపోయారా …వాళ్ళకేమయినా కొనిపెట్టు ” అంటూ శారద వారిస్తున్నా వినకుండా ఆమె చేతిలో రెండు అయిదు వందల నోట్లుంచారు.

” ఉదయం టిఫిన్ చేసి వెళ్దురుగాని “అని శారద మొహమాటంగా అన్నా..

“నువ్వవన్నీ పెట్టుకోకు ..ఎంత నాలుగు గంటలేగా ప్రయాణం పొద్దున పదికల్లా ఇంట్లో ఉండనే ఉంటాము..కాఫీలు చాలు ” అంటూ నిద్ర కుపక్రమించారు.

అలా సెలవురోజు గడచిపోడంతో కూరాఆలు తెచ్చుకోలేదు.

వంటింట్లో శారద గొణుగుడుకి ఎలాంటి స్పందనా లేకపోడంతో ఓ మారు తొంగి చూసి “కాలనీ వరకు వెళ్ళి ఏవైనా కూరలు తేరాదూ ” అని డైరెక్ట్ గానే అడిగింది.

నేను నోరు తెరిచే లోగానే వీధిలో కూరలమ్మి కేక వినిపించింది.

” ఈ రోజుకి కావాలంటే ఏవైనా ఆ కూరలమ్మి దగ్గర తీసుకో సాయంత్రం ఆఫీస్ నుండి వస్తూ తెస్తాలే ” అన్నాను.

శారద నా మారో కోర చూపు విసిరి అదే ఊపులో వీఢి గుమ్మం వరకూ వెళ్ళి కూరలమ్మినోకేక వేసింది.

నేను చూసీ చూడనట్టు ఎప్పటిలా పేపర్లో తలదూర్చాను.

రోజూ ఉదయమే ఎమర్జెన్సీ అవసరాలకు కూరలమ్మే శాంతమ్మ వాకిట్లో బుట్ట దింపింది.

ఎంత పేపర్ చదువుతున్నా వాళ్ళిద్దరీ మాటలూ నా చెవుల్లో దూరుతూనే ఉన్నాయి.

” పావు కిలో ఎనిమిది రూపాయలా? ఇవి బెండకాయలా బంగారపు ముక్కలా ?” అడుగుతోంది శారద.

” నాకు పడ్డధర అంతే నమ్మ .. అయినా ఎంత లేత మొగ్గల్లా ఉన్నాయో చూశారా? ఇలా పొయ్యిమీద వేస్తూనే ఉడికిపోతాయి.. కావాలంటే మార్కెట్ లో కనుక్కోండి ఎక్కాడా ముదురు టెంకలు కూడా పది రూపాయలకు తక్కువ లేవు. బుట్టలో నుండి తక్కెడ తీసి సరిచేస్తూ చూసుకోండమ్మా ..” అంది శాంతమ్మ.

” ఇంతకీ తూకం సరిగా ఉందా… ” మరో సందేహం వెలిబుచ్చింది నా శ్రీమతి.

” ఓ పావలా అటూ ఇటూ అడుగుతాను కాని తూకంలో వీసమెత్తు తేడా ఉండదమ్మగారు.. మళ్ళి ఎక్కడయినా జోకించుకోండి .. మా అమ్మమ్మ చెప్పేది ఇక్కడ తూకం సరి లేకపోతే భగవంతుడే సరి చేస్తాడని ఆయనకెందుకు శ్రమ మనమే సరిగా తూకం చూసుకుంటే పోలా…”

శ్రీమతి తొడిమలు తుంచి ఎంచుకుంటున్న బెండకాయలు ఓ వైపు మరో వైపు తూకం రాయి ఉంచి తక్కెడ పైకెత్తింది.

“చూసుకోండమ్మగారూ రొంత అటేపే మొగ్గుతోంది , తూకం సరిపోయిందిగా ” అనడిగింది.

యధాలాపంగా విన్నా ” తూకం సరిపోయిందిగా ” అన్న మాట నన్ను చాలా ఆకర్షించింది.

ఈ తూకం సరిపోవడం ఒక్క కూరగాయలకే కాదు జీవితంలో ప్రతిచర్యకూ వర్తిస్తుందేమోననిపించింది.

ఎప్పుడైతే మనసులో ఆ ఆలోచన మొదలైందో ఆపైన ఇహ పేపర్లో అక్షరాలు కనిపిస్తే ఒట్టు.

చిన్నప్పుడు అమ్మ కోపం వచ్చినప్పుడల్లా అనే మాటలు గుర్తొచ్చాయి …

” మీతాతకు మా నాన్న హోదా నచ్చక మనతో తూగలేరు ఈ సంబంధం వద్దన్నారట … కానీ మీ నాన్నగారి పట్టుదలకు తలొగ్గినా పెళ్ళిలో భోజనాలు ఆలస్యమయాయని పెద్ద గొడవే పెట్టుకున్నారు. సరి తూగలేని వాళ్లతో

సంబంధాలు కలుపుకోడమే బుద్ధి తక్కువ అంటూ లేచెళ్ళిపోయారు.. అల అందరూ వెళ్ళిపోయినా బాగుండేది … నాఖర్మ బాగాలేకే మీ నాన్న నన్ను తీసుకునే వెళ్ళారు అదిగో ఆ రోజునుండి ఈ రోజు వరకు తరాల తరబడి వెట్టి చాకిరీ చేస్తున్నా ..”

పెళ్లి నుండే మొదలవుతుందా తూకం..

ఆ తరువాత అడుగడుగునా తూకమేనా? అంతెందుకు సంచిత పాపపుణ్యాలకు సరి తూకమేగా ఈ జీవితం.

పుణ్యం కొద్దీ పురుషుడూ దానం కొద్దీ బిడ్డలు అంటారే అంటే పుణ్యానికి సరి తూకం జీవిత సహచరులైతే దానాలకు సమ తూకం పిల్లలా?

ఈ ఆలోచనల్లోనే ఆఫీస్ కి బయల్దేరాను..

అక్కడకు వెళ్ళినా ఈ తూకం మాట నా మనసు నుండి బయటకు కదలనని మొరాయించింది.

అక్కడా అనుకోని పరిణామాలు రోజూ చూస్తూనే ఉంటాము. కాస్సేపు బాధపడి మళ్ళీ మామూలు రొటీన్ లో పడిపోతాము.

అలాంటి సంఘటనే మరొకటి. శంకరానికి ఆఫీసర్ గా ప్రమోషన్ ఇచ్చి సిటిలోనే మరో బ్రాంచ్ లో వేశారు. అతని ఆనందానికి హద్దేలేదు. వెళ్లగానే అందరికీ కాఫీలు స్నాక్స్ తెప్పించాడు. మళ్ళీ మధ్యాహ్నం లంచ్ ఆర్డర్ చేశాడు.

ఈర్ష్య అనుకోకపోతే ఇక్కడ శంకరం గురించి ఓ మాట చెప్పుకోవాలి. అతనికి ఆఫీస్ పని ఎంత వచ్చనేది అందరికీ తెలుసు, కాదంటే అతనికున్న పబ్లిక్ రిలేషన్స్ ఎలాంటి వంటే ఎవరికి ఏది అవసరపడినా క్షణాల మీద అమర్చిపెట్టగలడు –ముఖ్యంగా ఆఫీసర్లకు. ఆ సేవకు సమ తూకమే ఈ ప్రమోషన్..

అలాగంటే అద్వితీయమైన మేధస్సు, అపారమైన సిన్సియారిటీ ప్రతిభ గల వాళ్ళు ప్రతి ఆఫీసులోనూ అనామకుల్లా ఉండే వుంటారు… మరి వారికి గుర్తింపు లభించకపోడానికి కారణం దేనికి సమతూకం?

అన్నట్టు ఉదయం పేపర్లో చదివిన వార్తలు గుర్తొచ్చాయి…. కోట్లాది రూపాయల కుంభకోణాలు, వేలాది ఎకరాల భూ ఆక్రమణలు లక్షలాది కోట్లలో లంచాలు … ఇవన్నీ వేటికి సమతూకం ….

లంచ్ హెవీ గా వుండటంతో టేబుల్ వద్దకు వస్తూనే ఓ క్షణం కళ్ళు మూతలు పడ్డాయి. ఆ పది నిమిషాల నిద్రలోనూ తూకం నన్ను వదల్లేదు.

తక్కెడలో ఓ పక్కన ఉదయం పేపర్లో చదివిన ప్రముఖ అవినీతి పరులు మరో పక్కన కాళ్ళువిరిగి, చేతులు వంకర్లు తిరిగి మొహం చెక్కుకు పోయి కళ్ళు శూన్య గోళాలయి లబోదిబో మంటూ వారే తూకం వేస్తున్నది మాత్రం సమయం.

చెళ్ళున కొట్టినట్తై మెళుకువ వచ్చింది.

ఆ పక్కన తక్కేడలో నేనూ ఉన్నానా?

అనుమానం ….

నిజమే…. ఒక్కగానొక్క కొడుకుని అయినా అమ్మా నాన్నలను దగ్గరెందుకుంచుకోలేదు. అలాగని పెద్దగా పొరపొచ్చాలూ లేవు. చిన్న చిన్న మాట పట్టింపులు తప్ప.

శారద ఆజ్ఞ… ” వాళ్ళను ఊళ్ళోనే ఉండనివ్వండి. మనం అప్పుడో ఇప్పుడో వెళ్ళి చూసి వద్దాం”

ఎందుకు కాదనలేక పోయాను…

నేనే జీవితంగా బ్రతికిన అమ్మానాన్నలకు నేనిచ్చే బహుమతి ఇదా?

దీనికి సమతూకం ….గుండె ఝల్లుమంది

ఇంటికి వెళ్తూనే కాఫీ అందించిన శారదతో చెప్పాను — ” ఆది వారం వెళ్ళి అమ్మా నాన్నను తీసుకు వస్తున్నాను”

“ఎన్ని రోజులుంటారు?” ముభావంగా అడిగింది.

” మనం మన పిల్లలతో ఎన్ని రోజులు ఉండాలనుకుంటామో అన్ని రోజులు … అప్పుడే తూకం సరిపోతుంది”

మరోమాటకు ఆస్కారమివ్వలేదు నేను.*

  – స్వాతి శ్రీపాద

1 comment:

the tree said...

chakkaga raasaarandi,