నిశ్శబ్దంగా నీ సంతకం
చరిత్ర అలల పల్లకీనెక్కి
లోకసంచారం చేస్తూనేవుంటుంది.
నీతి పద్యాల పాదాలు అరువడిగి
యుగాల పుటలనిండా
శిలా శాసనాల చిత్ర పటాల్ను
ఆవిష్కరిస్తూనే పోతుంది.
అవాస్తవికత అద్దాల్లో
అందని ప్రతిబింబమై
వగలు పోతూనేవుంటుంది.
స్వప్న ద్వీపాల్లో సంచరించే
కలల కౌగిలి కొలువులా
వుండీ లేనట్టు
శూన్యం చెట్ల మధ్యన
ఈదురు గాలిలా ఊయల్లూగుతూ
చీకటి చాటున గొంతుచించుకునే
కీచురాయి శౄతిలా
గానలహరి పంచుతూనేవుంటుంది.
ఎన్నాళ్ళీ దాగుడు మూతల దండాకోర్?
ఎన్నాళ్ళీ వంచన పరదాల వెనక
వామన గుంటలాట?
నేనూ నా ఉనికే ప్రపంచ మనుకున్నప్పుడు
రెక్కలు పుట్టిన అహం పెదవుల మీద
వంచన నయగారాలు కువకువలాడే వేళ
మౌనంగా నన్ను నిలదీసే నాప్రశ్నకు జవాబుగా
ఎక్కడని గాలించను?
అలిగి కూర్చున్న ఆశల చిన్నారిని
ఏ బొమ్మతో బులిపించి
నీ ఉనికిని ఏమార్చను?
బ్రతుకంతా పరచుకున్న నడి సంద్రపు హోరు
ఏ కట్టుగొయ్యలకు బంధీని చెయ్యను?
వేడి తగలని కార్చిచ్చులా
మందులేవీలేని మహమ్మారి రోగంలా
రూపమెరుగని మారణాయుధంలా
క్షణ క్షణం గుండెల్లో శిధిలాల్ను పేర్చే
కసాయితనం కళ్ళనీడల్లో
చూపుకోల్పోయిన మేం
ఎక్కడని పరిశీలించం?
గాలానికి వేళ్ళాడే
కొనవూపిరి నిట్టుర్పుల
జీవచ్చవాల కళేబరాల్లో
సొమ్మసిలిన
మానవ మేధస్సు
మలుపుల్లో నీరెండగా మలిగి పోయే
మానవతా ఎక్కడ నీచిరునామా?
**********************
1 comment:
entandi new posts emi levu.
Post a Comment