Friday, March 23, 2012

నవ వసంత యామిని

అలసి సొలసి పవళించిన శిశిరపు గాలులపై తేలి సోలి నర్తించగ 
మంచుపూల కళ్ళుగప్పి  తేట తేనె  గళం ఎత్తి
తొందరపడి నవ వసంత యామిని ముందే మనవాకిట రంగుల పురివిప్పిందీ 

రంగువెలసి పీలికలై గతకాలపు వైభవాల పరదాలిక వద్దంటూ 
ఏ చోటనొ కానరాని
కొత్త పూల నెత్తావులు తొలి కలల జల్లు చినుకులుగా
చూరమ్మట జారి జారి పరిమళాల ధారలుగా
పెదవి దాటి ఒక మాటాల గోదావరి లా
గోధూళి చల్లు రంగుల వసంత కేళిలా .....
తొందరపడి నవ వసంత యామిని ముందే మనవాకిట రంగుల పురివిప్పిందీ 
అడవితల్లి అల్లుకున్న   ఆకు పచ్చకోటలోన
తలదాచుకున్న పాటల పాపాయిల రెక్కలనో మారు నిమిరి
నిప్పులు కురిపించే బాల సూర్యునికో లాలిపాట పాడేందుకు
కొమ్మల తో లేత లేత చిగురాకుల  రెమ్మలలో పరుగులిడే గాలి స్వరం సానబట్టి
అల్లిబిల్లి దారుల్లో కుప్పిగంతులేసే మబ్బు తునకలో రెంటిని చిక్కటి పరదాలై పోపొమ్మని తరిమికొట్టి
తొందరపడి నవ వసంత యామిని ముందే మనవాకిట రంగుల పురివిప్పిందీ 

1 comment:

nmrao bandi said...

తొందరపడి నవ యామిని ముందే పురివిప్పిందీ ...
...జ్ఞప్తికి తెచ్చింది...
తొందరపడి ఒక కోయిల ముందే కూసింది...

జారిన...
పరిమళాల ధారలు...

మాటల గోదారి...
ఊహల రాదారి...

పాట నవ వసంతం...

అభివందనం...