Wednesday, October 26, 2011

నిమిషాలకూ ఘడియలకూ కాళ్ళు తిమ్మిరెక్కి కదలని వేళ
సమయం జారుడు బండ నడి మధ్యన స్థంభించి
సుషుప్తిలోకి జారిపోయిన వేళ
నీ చిరునవ్వు హేల మాటల లాలి
చూపుల్లో మెత్తని అనునయం
వీటన్నింటా శిలాసదృశ్యమైన మనస్సు  ద్రవించి ద్రవించి ప్రవాహమై
 నేనో పరీవాహక ప్రాంతంగా
మానవతనూ ప్రేమామృతాలనూ పండిస్తూ ...............
ఓ కప్పు చీకటిని సేవించి
గుప్పిళ్ల కొద్ది ఆకాశం నడి నెత్తిన విసిరి
విశ్రమించిన జాబిలికేం తెలుసు
ఇక్కడ ఈ చీకటి ప్రపంచం
ప్రతి హృదయం ఓ దివ్వెగా మారి
ప్రేమ వెలుగులను రగిలిస్తుందని
చీకటిని చివరంట రగిలించి దీపావళి జరుపుకుంటుందని.


Tuesday, October 25, 2011


ఇవ్వాల్టి మనిషి

నిర్లిప్తత కప్పుకు నిద్రపొతున్న వెసూవియస్ నో
చిరునవ్వు ఉపరితలం కింద
పొగలుకక్కుతున్న సప్తసముద్రాల పాదారసాన్నో
చిటపటలాడే నిప్పురవ్వలను గుప్పిట్లో బిగించి
శరవేగంతో చుట్టుకుంటున్న అగ్నికీలల్ను
లోలోనే అదిమి పట్టి
ఆకుపచ్చ వెలుగుల్ను గుమ్మరించే
అడవితల్లినో
ఆటవిక స్వభావాన్ని సింహ గర్జ్జనల రౌద్రాన్నీ
సౌమ్యతలో మూటగట్టి అటకెక్కించి
లోలోపల మాత్రం
అవిశ్రాంతంగా అల్లుతున్న సాలెగూళ్ళు.
ఇక్కడ వన్ మాన్ షోలో
నూటికి నూరు శాతం
అత్యుత్తమతకోసం సతమత మవుతూ....
ఊపిరాడని ఊబిలో ఉక్కురిబిక్కిరవుతున్నా
చుట్టూ సుందర ప్రపంచమీద
గుప్పిళ్ళ కొద్దీ బురద జల్లుతూ
ఎప్పుడో ఏదో ఒక క్షణంలో
విస్ఫోటించే సత్యానికై ఎద్దురుచూస్తూ ............