Sunday, September 18, 2016

పొద్దు తిరుగుడు ..................

ఒక జ్ఞాపకాన్ని ఓరగా తెరిచి
నిన్నటి నీడలను వెతుక్కున్నా
రేపటి కలలకు రంగులద్దుకున్నా
అది మబ్బుల మధ్య ఒకసారి వెలిగి ఆరే
క్షనికపు తటిల్లతే

ఎప్పటి గాలి కెరటమో ఒకటి
పదిలంగా దాచుకున్న పరిమళాల ఆనవాళ్ళు
సుతారంగా మోసుకు వచ్చి
కనురెప్పలపై సీతాకోక చిలుకల్లా వాల్చినట్టు
ఒక సుగంధాల వాన
ఎన్ని నిధి నిక్షేపాలు జాగ్రత్తపరచుకున్న
ఖజానానో కదా ఈ వలపుల పెట్టె
తీసే కొద్దీ ఊరుతూనే ఉంటాయి
జీవితకాలపు వజ్రవైడూర్యాలు
ఒక జీవనకాలమంతా

ఎప్పటికప్పుడు కొత్త ముచ్చట్లు
ఏరికోరి ప౦చుకు౦దామని
ఎదురుచూసి ఎదురుచూసి తలపుల తలగడపై
తలవాల్చానో లేదో
నిద్ర నీడపై మేఘమల్లే వాలి
పరామర్శ ముగియకము౦దే
ఉదయపు మంచై కరిగిపోతావు

విరిగి పాదరసం ముక్కలై చెల్లా చెదరైన గు౦డె
పగలంతా వెతుక్కుని వెతుక్కుని
అగుపి౦చని జాడకోసం పొద్దుతిరుగుడు పువ్వునై
ఉదయిస్తూ , అస్తమిస్తూ ...