Thursday, March 22, 2012

ప్రేమంటే

నిద్ర ముని వేళ్ళమీద నడిచొచ్చే నిశ్శబ్ద స్వప్న సీమ కాదు
పెదవులకు తాళం వేసుకు మాటలకు మౌనం చుట్టుకు విశ్రమించిన సరాగ సౌందర్యం కాదు
విశ్వాంతరాళపు వీధుల్లో ఊరేగి  కొండ కోనల
గుండె లోలోపల నిశ్చల తపస్సామాధిలోని
జీవనదీ కాదు
కెరటాలకూ తీరానికీ మధ్య నిరంతరం కొనసాగే ఆధిక్యతా తోపులాట వ్యవహారం కాదు
రోలర్ కోస్టర్ మీద కాస్సేపు పైపైకీ కాస్సేపు అగాధానికీ చుట్టూ చుట్టూ తిరిగే సరదాకాదు
ప్రపంచం బోనులో పడి కానిపించిన ప్రతివారిపై అక్కసు వెదజల్లే మృగరాజు అంతకన్నాకాదు
చిందర వందర కాగితాల మధ్య ఎవరిని వాళ్ళు
వెతుక్కోడం కాదు
 వీటన్నింటి మధ్యా చిరునవ్వుతో అతలాకుతలమైనా
ఉనికి మరచి ఊహను మరచి నేననే భావన మరచి
ప్రపంచమంతా ఒక్కరిదే ననుకునే తీపి వేదనే ప్రేమ
ఎవరిని వాళ్ళు  బలి చ్చుకోగలిగేదే ప్రేమ
జీవన్మరణాల వాకిట చెక్కిన సజీవ శిల్పం ప్రేమ



No comments: