Wednesday, January 15, 2014



వెనక్కు మళ్ళిన నదిగా  ..............
1.
సరదాగా సాయంత్రం గత౦ వీధుల్లోకి నడిచినపుడు
చూపులు తడిమేకొద్దీ ఊరే జలలా జ్ఞాపకాలు
కొత్తకొత్తగా పట్టునుండి పిండిన తేనెలా
కాస్త వగరు కాస్త తీపి కాస్త బిడియం కాస్త కోపతాపాలు కలగలిపి
పంచుకున్న అనుభూతుల చుట్టూ గోడలు నిలిచే ఉన్నాయి
పోగొట్టుకున్న ఆనవాళ్ళు మున్నీరై కన్నీరై కంటి చెలమల్లో
కంగారుపడుతూ ,సర్దుకుంటూ ..............
వెనక్కు మళ్ళిన నదిగా ..
2.
మొగిలిపూల వాసనలా నిలువెల్లా పెనవేసుకు  అల్లుకుపోయిన
ఆత్మలచుట్టూ
ఒదిగిపోతూ ,సంశయిస్తూ , దేహాల అనునయం
కాంక్షల కీకారణ్యం లో ఓనమాలు దిద్దుకుంటూ
సంవత్సరాలకు సంవత్సరాలు
ఒకరికొకరై అట్నించిటూ
ఇటు నుండి అటూ లోలోపల , లోనా బయటా
కనిపించని పరిసరాలలోనూ సంచరించిన క్షణాలు
ఇంకా గుడ్డి దీపాలుగా వెలుగుతున్నట్టే ఉంది.
౩.
కరెంటు కోతల మధ్య
పిందెలు పిందెలుగా రాలిపోతున్న వెన్నెల శకలాల మధ్య
ఎదురు చూడని గిలిగి౦తై , గుండె లయలోకి
ఉప్పొంగి ఉరకలేసే రక్తపు నదీనదాల్లోకి
పాటై జారిపోయే స్వరం ఇంకా ఆ ఆరుబయట ఆరెసినట్టె ఉ౦ది.
మూగవోయిన మనసు కనురెప్పల ఆకాశం కింద
తనివితీరని ఊహలను సాగుచేసుకు౦టూ
పురా స్మృతి జల్లుల మధ్య
ఓ తుంపరగా...............




No comments: