Wednesday, May 22, 2013

రాసేద్దామని కూచున్నావు ఏం తెలుసును నీకు?||




గాలి స్తబ్ధత లో వాలిన దిగులు చూపుల కళ్ళ 
హరిత స్వప్న సీమల జాడ లేమైనా తెలుసునా

వాన తీగల్లో ఒదిగిన చీకటిని తడిమి చూసే
మెరుపు వయ్యారాల వంపులేమైనా తెలుసునా

ఎక్కడో  మారు మూలలనుండి లాగి ఎప్పటికప్పుడు నెమరేసుకునే
గాయాల గడ్డిపరకల రుచి గురించేమైనా తెలుసునా

సూది మొనల్లా చురుక్కుమనిపించే
ప్రవేశాలూ నిష్క్రమణలూ నిలువెల్లా కుదిపేసిన ఘడియలు ఎన్ని

నిశాచరులై నీడల్లా వేళ్ళాడుతూ ఊడలు నాటుకున్న
చేదు విషాదాలు కనురెప్పలపై వాలి నిద్రను నిలువెల్లా
ఆవిరి చేసిన రాత్రులు ఎన్ని?

ఎవరి కంట నీరైనా సముద్రమై
నిన్ను నిలువెల్లా ముంచెత్తిన అలగా మారిన వైనమేదీ
చుట్టూ ఉప్పునీటి వరదల మధ్య
కాగితం పడవ ఊగిసలాడిన ఏకాంతపు ఉద్విఘ్నాలు ఎన్ని

ఇవన్నీ కాకున్నా
వెయ్యి వసంతాల ఆమని ఏనాడైనా
ఒక్కసారి నీ వాకిట నిలిచిందా?
ఎక్కడో గుండె శబ్దం నీదిగా నీకు తోచిందా
చెమ్మగిలిన మెత్తదనం చెక్కిలి నిమిరి పలకరించిందా

రాసేద్దామని కూచున్నావ్
ఏం తెలుసనీ నీకు

No comments: