Thursday, May 3, 2012

నిశ్శబ్దమూ -అంతరంగమూ

ఎక్కడో అగాధ స్వర్గాల్లో ఏకాంతంగా
విహరిస్తున్న నా అంతరాత్మ స్వాగతిస్తూ
పరచిన హిమ సుమాల పూలబాట ఇది
ఓ నిర్లక్ష్యపు పెదవి విరుపు ఇదిగో ముందుగా నీకో పలకరింపు
ఆపైన మన చిర కాలపు స్నేహాన్ని కలసి పంచుకుందాం
మాటల పరీవాహక ప్రాంతంలో కాస్సేపు సేదదీరుదాం
డబ్బాల్లో మోగే గులకరాళ్ళ ఒట్టిమాటల
శబ్దపు గలగలలు కాస్సేపు బహిష్కరిద్దాం
ఈ శబ్ద రహిత ప్రశాంత వాహనంలో
సారవంతపు మనసు పొరలను సమీక్షించుకుందాం
క్షణ క్షణం గర్భస్తంగా పెరుగుతున్నపరవశతను
 ఈ చిరు మసక వెలుతురులో కలబోసి ప్రదర్శించుకుందాం
అద్దిగో చల్లగాలి మెత్త మెత్తని స్పర్శ
మోకాళ్ళపై వంగినిలిచి అందిస్తున్న చమత్కారపు లీల
ఒకరిలో ఒకరం కలగలిసిపోయి ఒక్కటిగా ఆస్వాదించే
చిద్విలాసపు జోల
చీకటి సవరించిన ఈ మేలి ముసుగు వ్యామోహపు అసుర సంధ్య
మన మధ్య కుదిర్చిన ఈ సమావేశపు ఆరాటంలో
సమస్థ చరచర జగత్తునూ వశీకరించుకున్న మనం  విలీనమై పోదాం
సముద్రాలు కాల్చేసే బదబాగ్ని జ్వాలలనూ
ముక్కోటి లోకలు జయించే ఈర్షాసూయల ఇసుక తుఫానులనూ
ఒక్క చల్లని చూపులో దాచేసుకుని
మనలో మనం కృంగి కృశించి పోతున్న అశాంతి కి అమృతౌషధంలా
 ఒక్కసారి చూపుడి వేలి పరామర్శతో
సప్త సముద్రాల కన్నీళ్ళు దాచుకున్న చూపులకు
మెరుపులు పూయించే
అర్ధ రాత్రి ఆకాశపు మనసులో వెయ్యి చంద్రుల జ్యోత్స్నలు
కురిపించే మనం 
చుక్కలు చుక్కలుగా వర్షిస్తున్న హరివిల్లుల వానలో
ఆ చివరా ఈ చివరా పరచిన రంగుల మవుదాం








No comments: