Friday, November 28, 2008

శిశిరంలో వసంతం

మాటలగుండా ప్రవహిస్తూ
నిశ్శబ్ద భావాల్ను సవరిస్తూ
వినువీధి కంటి కొసల్లో
మెరుపు తీగల హొయలుప్రసరిస్తూ
అంతరంగపు యవనికపై
అలల్లా కదిలే చిత్రవిచిత్రాలు

ఏ మూలనుండో ఓపులకింత
రెక్కలు కట్టుకువాలి
అదౄశ్య సందేశాల్ను చూపుల అంచులమీద
మోసుకు వస్తూనేవుంటుంది

అనుభూతి తొలకరి స్వప్నపు తునక
జీవనసంధ్యాకాశం నిండా
చుక్కలరంగవల్లికల్ను
తీర్చిదిద్దుతూనేవుంటుంది
అడుగడుగునా మమతల సువాసనల్ను
గుభాళిస్తూనేవుంటుంది.

సుషుప్తిలొ మైమరచిన చైతన్యాన్ని
కొనగోట చెక్కిళ్ళుమీటి
అలవోక సౌఖ్యమో అలౌకికమో
అనువదించుకోలేని పారవశ్యపు వాకిలి ముందు
మౌనరాగాల్ను పలవరింతలుగా
చెక్కుతూ పొయేవేళ

ఒద్దికగా జీవితం పుటల మధ్య
సస్నేహ వీచికల సౌరభాల్ను
పరిరక్షించుకుంటూనే వుంటాను
కాలం ఓడిపోతూ వెనక్కు తిరిగి
పరుగెడుతూనేవుంటుంది.

No comments: